భగవద్గీత 3-10
“ సహయజ్ఞాః ప్రజాఃసృష్ట్వా పురోవాచ ప్రజాపతిః | అనేన ప్రసవిష్యధ్వ మేషవోஉస్త్విష్టకామధుక్ || ” |
పదచ్ఛేదం
సహయజ్ఞాః – ప్రజాః – సృష్ట్వా – పురా – ఉవాచ – ప్రజాపతిః – అనేన – ప్రసవిష్యధ్వం – ఏషః – వః – అస్తు – ఇష్టకామధుక్
ప్రతిపదార్ధం
ప్రజాపతిః = బ్రహ్మ ; పురా = కల్పారంభంలో ; సహయజ్ఞాః = యజ్ఞంతో కూడిన ; ప్రజాః = ప్రజల్ని ; సృష్ట్వా = సృష్టించి ; ఉవాచ = చెప్పాడు ; అనేన = ఈ యజ్ఞం ద్వారా ; ప్రసవిష్యధ్వం = అభివృద్ధిని పొందండి; ఏషః = ఈ యజ్ఞం ; వః = మీకు ; ఇష్టకామధుక్ = కోరుకున్న భోగాలు ప్రదానం చేసేదిగా ; అస్తు = అవుతుంది.
తాత్పర్యం
“ కల్పారంభంలో బ్రహ్మ సకల ప్రజలనూ ‘యజ్ఞ’ సహితంగా సృష్టించి వాళ్ళతో ‘మీరూ యజ్ఞం ద్వారా పురోభివృద్ధిని పొందండి, ఇది మీరు కోరిన కోరికల్ని నెరవేరుస్తుంది’ అని చెప్పాడు ! ”
వివరణ
ప్రతి అంశాత్మా ఒకానొక పూర్ణాత్మ నుంచి ఉద్భవిస్తుంది !
ప్రతి పూర్ణాత్మా తన స్వీయశక్త్యానుసారం అంశాత్మలను సృష్టిస్తూ ఉంటుంది !
మహాశక్తివంతమయిన పూర్ణాత్మలు జీవాత్మలను
‘ వర్షం ’లా కూడా కురిపిస్తూ ఉండవచ్చు.
అంశాత్మ “ ప్రజ ” అనబడుతుంది !
పూర్ణాత్మ “ ప్రజాపతి ” అనబడుతుంది !
సృష్టిలో కోటానుకోట్ల ప్రజాపతులున్నారు.
ప్రతి ప్రజాపతి కూడా “ ఒకానొక బ్రహ్మ ” … అంటే “ ఒకానొక సహ సృష్టికర్త ”.
ఏ ప్రజాపతి అయినా తన కోసం సృష్టి చేయడు …
లోకకళ్యాణం కోసమే సృష్టి జరిగేది !
అంటే ప్రతి అంశాత్మ పుట్టుక ‘ కర్మ ’ లోంచి జరగదు …
“ యజ్ఞం ” లోంచి జరుగుతుంది !
జీవాత్మలకు పూర్ణాత్మలు ఇచ్చే సందేశం ఏమిటి ?
“ మీరు కూడా మాలాగే ‘ యజ్ఞాలు ’ చేసి అభివృద్ధిని పొందండి ! ”
“ ‘కర్మలను’ చేస్తూ అభివృద్ధిని పొందకుండా ఉండవద్దు ! ”
“ యజ్ఞాచరణ ద్వారానే కోరుకున్న భోగాలు సిద్ధిస్తాయి …
కర్మాచరణ ద్వారా కాదు ”… అని.