భగవద్గీత 3-9 “ యజ్ఞార్థాత్కర్మణోஉన్యత్ర లోకోஉయం కర్మబంధనః | తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర || ” |
పదచ్ఛేదం
యజ్ఞార్థాత్ – కర్మణః – అన్యత్ర – లోకః – అయం – కర్మబంధనః – తదర్థం – కర్మ – కౌంతేయ – ముక్తసంగః – సమాచర
ప్రతిపదార్థం
కౌంతేయ = ఓ కుంతీపుత్రుడా ; యజ్ఞార్థాత్ = యజ్ఞం కోసం చేసే ; కర్మణః = కర్మలకంటే ; అన్యత్ర = ఇతరాలైన కర్మలలో ; అయం = ఈ ; లోకః = లోకం ; కర్మబంధనః = కర్మలచే బంధింపబడి వుంటుంది ; ముక్తసంగః = ఎలాంటి ఆపేక్ష, ఆసక్తి లేని వాడవై ; తదర్థం = ఆ ‘యజ్ఞం’ కోసం ; కర్మ = నీ కర్తవ్యకర్మలను ; సమాచర = ఆచరించు.
తాత్పర్యం
“ ‘యజ్ఞం’ కోసం చేసే కర్మలు తప్ప, ఇతరాలైన కర్మలలో ఆసక్తి గల ఈ లోకం కర్మలచే బంధింపబడి వుంటుంది ; కనుక ఓ కుంతీపుత్రుడా ! నువ్వు ఆసక్తిలేనివాడవై ‘యజ్ఞం’ కోసం చక్కగా నీ కర్తవ్యకర్మలను ఆచరించు. ”
వివరణ
రెండు రకాల కర్మలున్నాయి.
ఒకటి – మనకోసం మనం చేసుకునే కర్మలు.
రెండు – లోకకళ్యాణార్థం చేసే కర్మలు.
లోకకళ్యాణార్థం చేసే కర్మలను “ యజ్ఞం ” అంటాం.
“ యజ్ఞం ” ఎప్పుడూ బంధ విమోచనం కలిగిస్తుంది.
కర్మ … ముఖ్యంగా వివేక రహితమైన కర్మ … బంధాన్ని కలిగిస్తుంది.
కానీ … స్వార్థరహితంగా, ఆత్మార్పణ బుద్ధితో చేసే “ కర్మ ” …
ఎప్పుడూ బంధ విమోచనాన్ని కలిగిస్తుంది.
కృష్ణుడి ఆదేశం యజ్ఞాలను మాత్రమే చేపట్టమని.
స్వార్థపూరిత కర్మలను మానివేయమని.
ఒకవేళ స్వార్థపూరిత కర్మలను చేసినా పూర్తిగా వివేక సహితంగా చెయ్యాలి.
అంటే … స్వార్థ రహిత కర్తవ్య కర్మలనే ఆచరించాలి …
నిస్వార్థకర ధర్మయుత కర్మలనే చేపట్టాలి !