భగవద్గీత 3-8
“ నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః | శరీరయాత్రాஉపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః || ” |
పదచ్ఛేదం
నియతం – కురు – కర్మ – త్వం – కర్మ – జ్యాయః – హి – అకర్మణః – శరీరయాత్రా – అపి – చ – తే – న – ప్రసిద్ధ్యేత్ – అకర్మణః
ప్రతిపదార్ధం
త్వం = నువ్వు ; నియతం = శాస్త్రవిహితమైన ; కర్మ = కర్తవ్యకర్మలను ; కురు = చెయ్యి ; హి = ఎంచేతంటే ; అకర్మణః = కర్మచేయకుండా వుండడం కన్నా ; కర్మ, జ్యాయః = కర్మ చేయడమే శ్రేష్ఠం ; చ= మరి ; అకర్మణః = కర్మచేయకపోతే ; శరీరయాత్ర = భౌతిక జీవనయాత్ర ; న, ప్రసిద్ధ్యేత్ = సిద్ధించదు
తాత్పర్యం
“ నువ్వు శాస్త్ర విహితమైన కర్తవ్య కర్మలను ఆచరించు ; కర్మలు చేయకుండా వుండడం కన్నా, కర్మలు చేయడమే ఉత్తమం ; కర్మలు చేయకపోతే నీ శరీర యాత్ర కూడా సిద్ధించదు. ”
వివరణ
జీవితం సజావుగా జరగడానికిగాను చెయ్యవలసిన కర్మలను
“ నియమిత కర్మలు ”, “ విహిత కర్మలు ”, “ కర్తవ్య కర్మలు ” అంటాం.
వారి వారి పరిస్థితులకు అనుగుణంగా ఎవరి “ కర్తవ్య కర్మలు ” వారికి ఉంటాయి.
అవి ఆచరించడం వాళ్ళ “ స్వధర్మం ” అవుతుంది.
కర్మలను చెయ్యక పోవడం “ అకర్మ ” అవుతుంది.
కర్మలను త్యజించడం కంటే కర్మలను చెయ్యడమే మేలు.
“ తక్కువ కర్మలు చేయడం ” కన్నా
“ ఎక్కువ కర్మలు చేయడం ” అన్నది ఉత్తమం.
“ ఎక్కువ కర్మలు చెయ్యడం ” కన్నా
“ ఇంకా ఎక్కువ కర్మలు చేయడం ” అన్నది ఉత్తమోత్తమం.
పనులు మానేసి కూర్చుంటే శరీరపోషణ జరిగేదెలా ? …
జీవనయాత్ర సాగేదెలా ?
కర్మాచరణ మానేస్తే బద్ధకం, సోమరితనం అలవాటై …
ఆరోగ్యమూ, బుద్ధీ కూడా చెడే అవకాశం ఉంది.
నిజానికి కర్మలు చేయకపోతే భౌతికకాయం కూడా నిలవదు.
కనుక కర్మలు చెయ్యటంలో సోమరితనం ఎప్పుడూ తగదు.
ఎలాంటి కర్మలు చేయాలో తెలుసుకుని అలాంటి కర్మలే చెయ్యాలి.
శాస్త్ర సమ్మతమైన కర్మలే చెయ్యాలి.
ఆ కర్మలు సత్కర్మలు, నిష్కామకర్మలు అయితే ఇంకా మంచిది.