భగవద్గీత 2-72
“ ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి | స్థిత్వా స్యామంతకాలేஉపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి || ” |
పదచ్ఛేదం
ఏషా – బ్రాహ్మీ – స్థితిః – పార్థ – న – ఏనాం – ప్రాప్య – విముహ్యతి – స్థిత్వా – అస్యాం – అంతకాలే – అపి – బ్రహ్మనిర్వాణం – బుచ్ఛతి
ప్రతిపదార్థం
పార్థ = ఓ అర్జునా ; ఏషా = ఇది ; బ్రాహ్మీ = బ్రహ్మనిష్ఠ ; స్థితి = స్థితి ; ఏనామ్ = దీనిని ; ప్రాప్య = పొంది ; న, విముహ్యతి = (యోగి ఎప్పుడు) మోహాన్ని పొందడు ; అంతకాలే = మరణ సమయంలో ; అపి = కూడా ; అస్యాం = ఈ బ్రాహ్మీస్థితిలో ; స్థిత్వా = ఉండి ; బ్రహ్మనిర్వాణం = బ్రహ్మానందాన్ని ; బుచ్ఛతి = పొందుతున్నాడు.
తాత్పర్యం
“ పార్థా ! దీనినే ‘ బ్రాహ్మీస్థితి ‘ అంటారు; ఈ జ్ఞానం పొందినవారు మోహాన్ని పొందరు; మరణకాలం లోపల, యెవడైతే ఈ జ్ఞానాన్ని సాధిస్తున్నాడో, వాడు బ్రహ్మనిర్వాణపదాన్ని పొందగల్గుతున్నాడు. ”
వివరణ
ఇంద్రియ విషయాలను, కోరికలను, అహంకార, మమకారాలను
సంపూర్ణంగా త్యజించి …
నిందాస్తుతి, సుఖదుఃఖాది ద్వంద్వాలలో సమత్వం కలిగి కర్మాచరణ చేస్తూ …
దేహభావాన్ని విడనాడి ఆత్మభావంలో స్థిరపడిన వాడికి …
తనకంటే భిన్నంగా ఏదీ లేదు అన్న ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది.
బ్రహ్మానందాన్ని పొందుతాడు …
బ్రాహ్మీస్థితిని పొందుతాడు …
బ్రహ్మనిష్ఠను పొందుతాడు.
బ్రహ్మనిష్ఠ అన్నది జ్ఞానయోగం యొక్క అంతిమ స్థితి.
బ్రహ్మనిష్ఠ స్థితిని పొందినవాడు ఇక మోహాన్ని పొందడు.
మరణ సమయంలో కూడా బ్రహ్మనిష్ఠ చలించదు.
మరణ సమయంలో కూడా బ్రాహ్మీస్థితిలో ఉండి …
బ్రహ్మానందాన్ని పొందుతాడు.
బ్రహ్మనిష్ఠ వున్నవాడికే యథార్థ జ్ఞానం కలుగుతుంది.
యథార్థ జ్ఞానం వల్ల “ వున్నది వున్నట్లు ” గా “ లేనిది లేనట్లుగా ” తెలుస్తుంది.
అంతకన్నా ఇక కావల్సిందేముంది?