భగవద్గీత 2-47
“ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన | మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోஉస్త్వకర్మణి || ” |
పదచ్ఛేదం
కర్మణి – ఏవ – అధికారః – తే – మా – ఫలేషు – కదాచన – మా – కర్మఫలహేతుః – భూః – మా – తే – సంగః – అస్తు – అకర్మణి
ప్రతిపదార్థం
తే = నీకు ; కర్మణి ఏవ = కర్మాచరణలోనే ; అధికారః = అధికారం వుంది ; ఫలేషు = దాని ఫలితాల మీద ; కదాచన మా = ఎన్నడూ లేదు ; మా కర్మఫలహేతుః భూః = కర్మఫలానికి హేతువు కావద్దు ; తే = నీకు ; అకర్మణి = కర్మను మానడంలో ; సంగః = ఆసక్తి ; మా అస్తు = ఉండకూడదు
తాత్పర్యం
“ నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగానీ, ఆ కర్మఫలానికి అధికారివి కాదు ; ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు ; అలాగని కర్మలు చేయడం మానకు. ”
వివరణ
కర్మలను చేయడానికే మనకు హక్కు ఉంది !
కర్మలను సదా అప్రమత్తతతో చేస్తూ ఉండాలి !
ఎప్పుడూ “ కర్మిష్ఠి ”గానే ఉండాలి !
‘ అకర్మణ్యత్వం ’ అన్నది ఎప్పుడూ వుండకూడదు !
నెల మొత్తం పూర్తిగా పనిచేసిన తరువాతనే జీతం వస్తుంది …
ఫలితాన్ని తరువాతి నెలలోనే అనుభవించ గలుగుతాం.
వర్తమానంలో దుక్కిదున్ని, విత్తుచల్లి, చేనుకు సంరక్షణ చేస్తేనే …
భవిష్యత్తులో పంట చేతికి వస్తుంది.
విత్తనాలు చల్లగానే పంట పండి ధాన్యం చేతికి రాదు !
అలాంటివే మనం పొందే కర్మఫలాలు కూడా !
వర్తమానంలోని సుఖసంతోషాలు గత జన్మల మంచి కర్మల ఫలితాలు …
కష్టాలు, నష్టాలు చెడు కర్మల ఫలితాలు.
అలాగే వర్తమానంలోని కర్మఫలాలను భవిష్యత్తులో అనుభవిస్తాం.
ఈ వర్తమాన జన్మకు సంబంధించిన పరిమితమైన జ్ఞానంతో …
ఇప్పుడు అనుభవిస్తున్న కర్మఫలాలు …
మన యొక్క అనేకానేక గత జన్మలలోని … ఏ జన్మకు సంబంధించినవి …
ఏ కర్మఫలం అనేది అవగాహనకు రాదు … మనం నిర్దేశించలేము కూడా !
అందుకే చేస్తున్న కర్మలకు ఎప్పుడూ “ లెక్కలు ” కట్టకూడదు !
“ లెక్కలు ” కట్టడానికి మన దగ్గర సరి అయిన “ విషయజ్ఞానం ”
ఏమీ లేదు ! లెక్కలను, ఫలితాలనూ పూర్ణ సృష్టికే వదిలేయాలి !
సృష్టికి మాత్రమే తెలుసు “ సరి అయిన లెక్కలు ” కట్టడం !
జన్మజన్మల లెక్కల ప్రకారం రావల్సింది అంతా వచ్చే తీరుతుంది !
జన్మజన్మల లెక్కల ప్రకారం పోవల్సిందంతా పోయే తీరుతుంది !
“ కర్మఫలాసక్తి ” ఉంటే …
ఫల ‘ సిద్ధి ’, ‘ అసిద్ధు ’ ల పట్ల రాగద్వేషాలను కలిగించి …
కర్మాచరణ పూర్తి సామర్థ్యంతో నిర్వహించబడదు.
కర్మలు చెయ్యడం మాని అకర్ముడిగా మారిపోతే …
భవిష్యత్తుకు పునాది వేసే వర్తమానాన్ని వ్యర్థం చేస్తే …
భవిష్యత్తును సంపూర్ణంగా నష్టపోతాం.
కనుక మనం కర్మలను చేస్తూనే ఉండాలి.
అకర్ములుగా ఎన్నటికీ కారాదు.
దేనినైతే మనం “ధర్మం” అనుకుంటున్నామో ఆ ధర్మం నిర్వర్తిస్తూనే ఉండాలి.
ఆ రకమైన ధర్మ కర్మలు చేస్తూనే ఉండాలి.