శివతత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి
ఇహలోకంలో శివపుత్రతత్వం మరి పరలోకంలో శివతత్వం ఉంటాయి. కనుక శివపుత్రులమైన మనం ఇహలోకంలో ఉంటూనే పరలోకంలోని శివతత్వంలోని పరవశత్వాన్ని పొందితీరాలి. ఇది సాధ్యం కావాలంటే మనకు నిరంతర ధ్యానజ్ఞాన సాధన ఒక్కటే మార్గం.
సంగీతం, నృత్యం, ధ్యానం .. ఈ మూడూ కలిస్తేనే ఆత్మవికాసం ఆకాశాన్ని అంటుతుంది. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవిస్తూ .. అనాగరికుల్లా మాంసాహారాన్ని భుజించే వారంతా కూడా .. ‘శివరాత్రి పూజలూ, జాగరణలూ చేయడం వల్ల లాభం ఏమీ ఉండదు’ అన్న సంగతి గ్రహించాలి.
ఒక ముక్కంటి మాత్రమే మరొక ముక్కంటిని గుర్తించగలడు. కనుక శ్వాస మీద విశ్వాసంతో శివతత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి, మరి శివుడు ఎంతటివాడో మనం కూడా అంతటివాళ్ళం కావాలి. అంతేకాదు మనం ‘శివోహం’ .. ‘సత్యోహం’ .. ‘నిత్యోహం’ .. ‘ఆత్మోహం’ .. ‘అనంతోహం’ మరి ‘శాశ్వతోహం’ .. అని కూడా తెలుసుకోవాలి.
ఆ పరమ శివుడు చెప్పింది ధ్యానం, చేసింది ధ్యానం. ఆయన ధ్యానంలో నిష్ణాతుడై తన మూడవకంటిని తెరిపించుకుని దివ్యదర్శనాలన్నీ చేసాడు. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ వారి ఏకైక లక్ష్యం మరి వారి జన్మకారణం .. ‘మనకూ శివుడికీ ఏ మాత్రం తేడా లేదు’ అంటూ ప్రతి ఒక్కరికీ చాటి చెప్పడమే మరి అది వాళ్ళకు స్వానుభవం అయ్యేంతవరకు వారిని ధ్యానం చేసేలా ప్రోత్సహించడమే.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు కావలసింది ‘పాహిమాం’, ‘పాహిమాం’ అంటూ అర్థించే దేవాలయాలు కావు. ధ్యానం చేసి తమలో ఉన్న ఆత్మశక్తిని వెలికి తీసుకుని తమను తామే ఉద్ధరించుకోగలిగే ధ్యాన పిరమిడ్లు కావాలి. ఇది ఏ మతానికో, ఏ ఇజానికో సంబంధించినవి కావు. ఇది కేవలం శక్తిక్షేత్రాలు మాత్రమే. మనం ఇంకా ఇంకా ఎక్కువ పిరమిడ్లను నిర్మిస్తూ ఈ భూమిని శక్తిమయం చేయాలి .. మరి రాబోయే సత్యయుగంలోకి శక్తివంతుల్లా ప్రవేశించాలి.