భగవద్గీత 2-29
“ ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనమ్ ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః |ఆశ్చర్య వచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాஉప్యేనం వేద న చైవ కశ్చిత్ || ” |
పదచ్ఛేదం
ఆశ్చర్యవత్ – పశ్యతి – కశ్చిత్ – ఏనం – ఆశ్చర్యవత్ – వదతి – తథా – ఏవ– చ – అన్యః – ఆశ్చర్యవత్ – చ – ఏనం – అన్యః – శృణోతి – శ్రుత్వా– అపి – ఏనం – వేద –న – చ – ఏవ – కశ్చిత్
ప్రతిపదార్థం
కశ్చిత్ = ఒకడు ; ఏనం = దీనిని (ఈ ఆత్మను) ; ఆశ్చర్యవత్ = ఆశ్చర్యమైనదిగా; పశ్యతి = చూస్తాడు ; చ = మరి ; తథా, ఏవ = అలాగే ; అన్యః = మరొకడు ; ఆశ్చర్యవత్ = ఆశ్చర్యకరంగా ; వదతి = చెపుతాడు ; చ = అలాగే ; అన్యః = మరొకడు ; ఏనం = దీనిని ; ఆశ్చర్యవత్ = ఆశ్చర్యంగా ; శృణోతి = వింటాడు ; చ = మరి ; కశ్చిత్ = ఒకడు ; శ్రుత్వా, అపి = విన్నప్పటికీ ; ఏనం = దీనిని ; న, ఏవ, వేద = తెలుసుకోలేడు.
తాత్పర్యం
“ ఒకానొకడు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు ; మరొకడు ఆశ్చర్యంగా చెపుతున్నాడు; ఇంకొకడు ఆశ్చర్యంగా వింటున్నాడు; కానీ – వినటం చేత – ఆత్మను గురించి తెలుసుకోలేరు. ”
వివరణ
ఈ లోకంలో యోగులు, జ్ఞానులు, ముముక్షువులు, అయోగ్యులు …
అని నాలుగు రకాలైన మనుషులు ఉంటారు.
మనం మన కంటికి కనిపించే భౌతిక వస్తువులను
మనస్సు, బుద్ధి, ఇంద్రియాల సముదాయం ద్వారా గ్రహిస్తాం.
“ ఆత్మ” అనేది భౌతికంగా కంటికి కనిపించే వస్తువు కాదు.
ఆత్మను చూడగలిగే వాళ్ళు జగత్తులో చాలా అరుదుగా ఉంటారు.
ఒక్క ఆత్మకే తప్ప మరి దేనికీ ఉనికి అనేది లేనప్పుడు …
ఆత్మ తనకు తానే స్వయంగా దర్శించేటప్పుడు … ఆత్మ ఒక్కటే ఉంటుంది.
“ చూసేవాడు ” అని గానీ .. “ చూడబడేది ” అని గానీ .. వేరు వేరుగా ఏమీ ఉండవు.
అది ఒక అలౌకికమైన, అద్భుతమైన, అరుదైన అనుభూతి.
జ్ఞానచక్షువును సంతరించుకున్న యోగులు …
ఆత్మజ్ఞానం కలిగిన యోగులు …
బయటనుండి చూసేవారికి కళ్ళు మూసుకున్నట్టు కనిపిస్తారు.
కానీ లోపల మాత్రం ఆశ్చర్యకరమైన ఆత్మానుభూతిని
తన్మయత్వంతో దర్శిస్తూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు.
బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు.
అటువంటి ఆత్మదర్శన అనుభూతిని మాటలలో వర్ణించడం దుర్లభం.
ఎందుకంటే ఆత్మకు సమానమైన వస్తువేదీ ఈ లోకంలోనే లేదు
కనుక దానిని వర్ణించలేము.
అందుకే ఆత్మజ్ఞానులైన వాళ్ళు దానిని వర్ణించడానికి ప్రయత్నించినప్పుడు కూడా తన్మయత్వంతో వివరించగలిగినంత మాత్రమే వివరిస్తూంటారు.
వారు దివ్యచక్షువు ద్వారా చేసిన ఇతర లోక సంచార విశేషాలను
ఆశ్చర్యకరంగా వివరిస్తూంటే … ముముక్షువులైన వాళ్ళు …
ఆత్మజ్ఞానుల చుట్టూ చేరి .. అంతే ఆశ్చర్యంతో, ఆనందంతో వింటూ ఉంటారు.
అటువంటి అనుభవాలకై తాము కూడా తహతహలాడుతూ ఉంటారు.
అయితే ఆ జ్ఞానులు చూసినది, చెప్పింది వింటే మాత్రమే
ఆత్మ గురించి తెలుసుకోలేమని వారికి ఖచ్చితంగా తెలుసు.
ఆత్మ గురించి తెలుసుకోవాలంటే …
తమ ప్రయత్నం తాము చెయ్యాలని ముముక్షువులకు తెలుసు.
కనుక వారు ధ్యానసాధన ద్వారా ఆత్మజ్ఞానాన్ని సంపాదించగలరు.
అయితే కొంతమంది అయోగ్యులు మాత్రం ఇవన్నీ వింటూ కూడా …
ఏ మాత్రం తెలుసుకోలేరు … తెలుసుకోవాలని ప్రయత్నమూ చేయరు.
చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా !