భగవద్గీత 2-23
“ నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః | న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః || ” |
పదచ్ఛేదం
న – ఏనం – ఛిందంతి – శస్త్రాణి – న – ఏనం – దహతి – పావకః – న – చ – ఏనం – క్లేదయంతి – ఆపః – న – శోషయతి – మారుతః
ప్రతి పదార్థం
ఏనం = ఈ ఆత్మను ; శస్త్రాణి = శస్త్రాలు ; న ఛిందంతి = ఛేదింపలేవు ; ఏనం = ఈ ఆత్మను ; పావకః = అగ్ని ; న దహతి = దహింపలేదు ; ఏనం = ఈ ఆత్మను ; ఆపః = నీరు ; న క్లేదయంతి = తడుపలేదు ; చ = మరి ; మారుతః = గాలి ; న శోషయతి = ఎండింపలేదు.
తాత్పర్యం
“ ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు ; అగ్ని దహించలేదు ; నీరు తడపలేదు ; గాలి ఆరబెట్టనూ లేదు. ”
వివరణ
పంచమహాభూతాలతో తయారైంది మన భౌతిక శరీరం.
“ దహ్యతే ఇతి దేహః ” … దహింపబడేది కనుక …
ఈ శరీరాన్ని “ దేహం ” అన్నారు.
భౌతిక శరీరం నీటితో తడిచి, చివికి, నాని పోతుంది …
గాలి భౌతిక శరీరాన్ని ఎండించ గలదు …
భౌతిక శరీరం శస్త్రాలతో ఛేదింపబడుతుంది …
కానీ “ఆత్మ” అనేది శస్త్రాలతో ఛేదింపబడదు … అగ్నిచేత దహింపబడదు …
నీటి చేత ఏమాత్రం తడుపబడదు.
పాంచభౌతిక శరీరాన్ని నాశనం చెయ్యగలవి అన్నీ కూడానూ …
ఆత్మను ఏమీ చేయలేవు !
అంటే … దేహం యొక్క ధర్మం వేరు .. ఆత్మ యొక్క ధర్మం వేరు.
దేహం యొక్క గుణం వేరు … ఆత్మ యొక్క గుణం వేరు.
ఈ భౌతిక శరీరం వేరు … ఆత్మపదార్థం వేరు.
దేహం వేరు … దేహి వేరు!
రెండూ వేరు వేరు!
ఒకటి నశించేది ;
ఇంకొకటి నిత్యమైనది … నశించనిది.
శరీరం పుడుతుంది, చస్తుంది.
కానీ ఆత్మపుట్టదు, చావదు.
“ ఆత్మ ” అన్నది నిత్యమైనది …
మార్పులు చెందనిది …
సర్వవ్యాప్తమైనది … సత్యమైనది.
ఇదంతా తెలుసుకోవాలంటే
ధ్యానం చెయ్యాలి …
అనుదిన ధ్యానాభ్యాసం చేయాలి.
ప్రతి రోజూ … ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి … ఎప్పుడైనా సరే! కళ్ళు రెండూ మూసుకోవాలి !
శ్వాస మీద ధ్యాస ఉంచుకోవాలి … చిత్తవృత్తులను నిరోధించుకోవాలి !
అప్పుడే మనకు తెలుస్తుంది…
మనం శరీరాలం కాదు, ఆత్మపదార్థం అని !