భగవద్గీత 2-22
“ వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోஉపరాణి | తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ || ” |
పదచ్ఛేదం
వాసాంసి – జీర్ణాని – యథా – విహాయ – నవాని – గృహ్ణాతి – నరః – అపరాణి – తథా – శరీరాణి – విహాయ – జీర్ణాని – అన్యాని – సంయాతి – నవాని – దేహీ
ప్రతిపదార్థం
యథా = ఏ విధంగా ; నరః = (ఒకానొక) మానవుడు ; జీర్ణాని = శిథిలమయిన ; వాసాంసి = వస్త్రాలను ; విహాయ = వదిలిపెట్టి; అపరాణి = వేరే ; నవాని = క్రొత్త వస్త్రాలను ; గృహ్ణాతి = గ్రహిస్తాడో ; తథా = అదే విధంగా ; దేహీ = జీవాత్మ ; జీర్ణాని = శిథిలమయిన ; శరీరాణి = శరీరాలను ; విహాయ = విడిచి ; అన్యాని = ఇంకొక ; నవాని = క్రొత్త (శరీరాన్ని) ; సంయాతి = పొందుతుంది
తాత్పర్యం
“ చిరిగిపోయిన బట్టలను వదిలి, మనం నూతన వస్త్రాలు ధరిస్తున్నట్టే, నిరుపయోగమైన శరీరాన్ని వదిలి, ఆత్మ క్రొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది. ”
వివరణ
ఈ భౌతిక శరీరాన్ని మనం వేసుకునే దుస్తులతో పోల్చారు వేదవ్యాసులవారు.
బట్టలు పాతవై చినిగిపోతూ ఉంటే …
వాటిని తీసి అవతల పారేసి …
వేరేవి క్రొత్తవాటిని తొడుక్కుంటాం కదా !
శరీరానికి కూడా అలాగే వయస్సు అయిపోయి …
ముసలితనం వచ్చేసి … శిథిలమైపోయి …
మరణం ద్వారా రాలిపోయినప్పుడు …
ఆత్మ వేరొక క్రొత్త శరీరాన్ని ధరిస్తుంది.
ఈ దేహం ఒక వస్త్రం … మనం దేహధారులం.
“ మరణం ” అంటే … “ పాతబడిన ఈ భౌతిక శరీరాన్ని వదిలి పెట్టెయ్యడం ”,
క్రొత్తదయిన … తేజోమయమైన ఆత్మతో … విహరించడమే,
ఆపైన వేరొక అనువైన భౌతిక శరీరంతో నూతన జన్మను తీసుకోవడమే !
భౌతికమైన స్థూలశరీరం యొక్క తత్వం అందరికీ తెలుసు ;
కానీ సూక్ష్మశరీరం యొక్క తత్వం …
ఆత్మపదార్థం యొక్క తత్వం … కేవలం యోగులకే తెలుసు.
దేహంలో ఉన్నప్పుడు ఆత్మపదార్థాన్ని “ దేహి ” అంటాం.
దేహం నుండి బయటకు వచ్చేసిన “ విదేహి ” అంటాం.
మనస్సుతో కూడుకున్నప్పుడు …
సంకల్ప వికల్పాలతో కూడుకున్నప్పుడు …
“ నేను ”, “ నాది ” అనే తత్వాలతో కూడుకున్నప్పుడు …
మంచి చెడులతో కూడుకున్నప్పుడు …
ఇదే ఆత్మను “ జీవాత్మ ” అంటాం.
ఆ జీవాత్మలో ఎప్పుడైతే “ మంచి, చెడు ” అనే భావన నశిస్తుందో …
ఎప్పుడైతే “ నువ్వు ”, “ నేను ” అనే భావన పోతుందో …
ఎప్పుడైతే అహంకారం నశిస్తుందో …
అలాంటి జీవాత్మను “ విముక్తాత్మ ” అంటాం.
ప్రతి జీవాత్మ కూడానూ జన్మపరంపరాక్రమంలో “ విముక్తాత్మ ” కావలసిందే !
ఒకానొక “ విముక్తాత్మ ” ఇక అందరినీ విముక్తస్థితికి తీసుకువెళ్ళడానికి
కంకణం కట్టుకున్నప్పుడు ఆ విముక్తాత్మలు ఇక … “ పరమాత్మలు ”గా
ఉదహరించ బడతాయి !
అర్జునుడిని “ జీవాత్మ ” అనీ,
శ్రీకృష్ణుడినీ, వేదవ్యాసులవారినీ “పరమాత్మలు” అనీ అంటాం.
“పరమాత్మ” అంటే …
“అత్యున్నత స్థాయికి పరిణితి చెందిన జీవాత్మ” అన్నమాట.
ఒకానొక జీవాత్మ మొట్టమొదటి జన్మలలో …
ఒకానొక “అమాయకపు ఆత్మగా” ఉంటుంది.
దుష్ట సాంగత్యాలు, దుష్ట ప్రభావాల వల్ల “దుష్టాత్మగా” మారుతుంది.
సజ్జన సాంగత్యం వల్లా,
పరోపకార పరాయణత్వం వంటి సేవాభావాల వల్లా
“ శుభాత్మ ” గా మారుతుంది.
తత్త్వచింతన కలిగి, ధ్యానసాధన ద్వారా …
ఆధ్యాత్మిక పురోభివృద్ధి పొందుతూ, పొందుతూ …
చివరకు “ విముక్తాత్మ ”గా విరాజిల్లుతుంది.
ఇక విముక్తాత్మ లోకకళ్యాణం కోసం “ పరమాత్మ ” అవుతుంది.
“పరమాత్మ” గా కాకపోతే ఆ యొక్క జీవాత్మ పూర్ణ వికాసం చెందినట్లు కాదు.
పూర్ణ వికాసం వరకు మనం మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాం …
“ పునరపి జననం – పునరపి మరణం ”.
ఈ విధంగా “ ఎంతవరకు ? ” అంటే …
“ పరమాత్మగా అయ్యేంత వరకు ”.