సత్యమేవ జయతే, ధ్యానమేవ జయతే …

 

 

సత్యమేవ జయతే ; అన్నది ఉపనిషత్ సూక్తి. అంటే, సత్యమే ఎప్పుడూ జయిస్తూ ఉంటుంది ; అసత్యమే ఎప్పుడూ ఓడిపోతూ వుంటుంది.

అయితే – సత్యం మబ్బుల ద్వారా అప్పుడప్పుడూ కనుమరుగు కావచ్చు. కానీ సూర్యగోళం అయిన సత్యం వేంటనే దేదీప్యమానంగా కంటికి మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది.

ఏది సత్యం ? ఏది అసత్యం ?

నిత్యమైనదే సత్యం.

అనిత్యమైనదే అసత్యం.

మరి ఏది నిత్యం ? ఏది అనిత్యం ?

ఆత్మే నిత్యమైనది ; అనాత్మే అనిత్యమైనది.

ఆత్మ అన్నదే సత్యం. ఆత్మ అన్నదే స్వయంప్రకాశమైన సూర్యగోళం మనస్సులోని మాలిన్యాలే ఆత్మను కనుమరుగు చేసే కారుమబ్బులు ..

మాలిన్యం అంటే త్రికరణశుద్ధి రాహిత్యమే ; అంటే మనసా, వాచా, కర్మణా ఏకంగా వుండకపోవటమే.

అంతేగాక, నేను మేను ని అన్న అజ్ఞానమే ఆత్మ వెలుగుకి అడ్డు తెర కట్టేది.

తెర తీయగా రాదా ? – అని శ్రీ త్యాగరాజు స్వామి ఎంతగా మొరబెట్టుకున్నా, ఎంతగా ప్రార్థించినా, బయట నుంచి తెర తీసే నాధుడు ఎప్పుడూ వుండడు ; మనం మన తమో, రజో గుణాలతో జన్మజన్మలుగా అల్లుకున్న తెర ను మనమే స్వప్రయత్నంతో కరిగించుకోవాలి. మన తెర ను శూన్యం చేస్తేనే తప్ప మన ఆత్మ మళ్ళీ జ్వాజ్వల్యమానంగా ప్రకాశించదు. అందుకు ఒక్కటే మార్గం అదే ఆనాపానసతి – విపస్సన ధ్యాన విధానం.

అసతుల్యమై, నిత్య ఓటములతో, నిత్య నిరాశా నిస్పృహలకు లోనవుతూనే వుండాలా ? లేక సత్యులమై, నిత్య జయాలతో, నిత్య విజయాలతో, నిత్యానందులుగా విలసిల్లుతూ వుండాలా? అన్నది ఎవరికి వారే ఎప్పటికప్పుడూ నిర్ణయించుకుంటూ వుండాలి.

ఈ నిర్ణయం – అంటే సత్యమే ? అసత్యమా ? జయమా ? అపజయమా ?

ధ్యానమా, ప్రార్థనా ? … ఇప్పుడా ? తరువాతా?

అంతరంగమా, బహిరంగమా ? … ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఎవరికి వారే ఎప్పటికప్పుడు తమ తమ ఏకాంత స్థితుల్లో పూర్తిగా విశ్లేషించి సరైన నిర్ణయాలను తీసుకుంటూ వుండాలి.

కనుక పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్, ఇండియా అందరికీ ఇచ్చే సందేశం ఏమిటంటే సత్యమేవ జయతే ; ధ్యానమేవ జయతే.