ఉత్తిష్ఠ కౌంతేయ, యుద్ధాయ కృతనిశ్చయః

 

 

భగవద్గీత ఓ గొప్ప జ్ఞాన భాండాగారం. అందులో లేనిది మరో చోట లేదు.

మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తత్ అనుగుణమైన, తత్ అనుకూలమైన జ్ఞాన విశేషం భగవద్గీతలో దొరికే తీరుతుంది.

యుద్ధ సమయం ఏతెంచినప్పుడు కృత నిశ్చయంతో యుద్ధం చెయ్యి, అన్నాడు కృష్ణుడు. యుద్ధానికి ఎప్పుడూ సుదూరంగా ఉండాలి. మానవులకు కావలసినది యుద్ధం కాదు, శాంతి. మానవులకు కావలసినవి కత్తుల పోటీలు కావు, ఆటల పోటీలు. మానవులకు కావలసినవి రణరంగాలు కావు – క్రీడారంగాలు, నాటకరంగాలు. కానీ ఇంక యుద్ధం అనివార్యమైనప్పుడు, ఇక వేరే గత్యంతరం ఏదీ లేనప్పుడు, శాంతి మాటలతో, వేదాంతపు చర్యలతో, యుద్ధానికి వెన్ను చూపడమనేది మూర్ఖుల లక్షణం.

సకల రాయబారాలు, సకల దాన భేదోపాయాలూ నిష్ఫలమై పోయినప్పుడు ఇక ముఖాముఖి ఘర్షణే శరణ్యం. తాడో, పేడో తేల్చుకోవడమే విధి. యుద్ధమే తక్షణ కర్తవ్యం. ప్రపంచంలోని ఆధ్యాత్మిక మానవాళి అంతా ఇక విసిగిపోయింది. రోత అయిన పాత ను మట్టుపెట్టడానికి ధ్యానం సమాధానాలను తయారు చేస్తుంది. నవ్య ధ్యాన యుగానికి నూతన హారతిని ఇస్తోంది.

పిరమిడ్ పార్టీ జ్ఞాన శంఖారాన్ని పూరిస్తోంది. ధ్యాన గర్జనలను చేస్తొంది. ఇంక రాయబారాలు పనికిరావు. బేరసారాలు నిన్నటి మాట. ఇక ప్రపంచాధిపత్యం కేవలం ఆత్మజ్ఞానులదే దేహ భ్రాంతి ఉన్న మూర్ఖజ్ఞానుల క్రింద ఆత్మజ్ఞాన పరాయణులు ఇక పనిచేయరు.

అరిషడ్ వర్గాలకు లోనైన అల్పాత్ములకు ఇక అరిషడ్ వర్గాలను జయించిన మహాత్ములు సలామ్‌లు కొట్టరు. రాజరికం నుంచి గద్దెలపై నుంచి అల్పాత్ములు, హీన చరిత్రులు, ఆత్మజ్ఞాన రహితులు ఇక చక చకా దిగి పోవలసిందే. మిద్దెలున్న వారిది ఇక గద్దె కాదు; మద్దెల వాయించే వారిది గద్దె కాదు. అక్షరం ముక్కలేని మొద్దు సుద్దలది గద్దె అంతకన్నా కాదు. గుహ్య విద్యను సాధించిన వాళ్ళకే గద్దె. గురువులైన వాళ్ళకే గద్దె. ధ్యానపరాయణులకే గద్దె. జ్ఞాన సోక్రటీస్‌లకే గద్దె. శ్రీ రామచంద్రుని లాంటి వారికే గద్దె.

ప్రప్రథమంగా మన ప్రపంచ చరిత్రలో ఒక అపూర్వ సంఘటన ఈ 1999 సంవత్సరంలో, ఈ ఆంధ్రరాష్ట్రంలో జరుగబోతోంది. కాదు జరగాలి అన్నది మన బంగారు కల. ఆ బంగారు కల పదహారణాల వాస్తవం కావాలంటే ఉత్తిష్ఠ కౌంతేయ, యుద్ధాయ కృత నిశ్చయః.

ధ్యానులందరూ ఇక లేవాలి. రామ రాజ్యస్థాపన అనే యుద్ధానికి సంసిద్ధులు కావాలి.

యుద్ధంలో విజయం సాధించాలి. రామరాజ్యం స్థాపించాలి. ఈ యుద్ధంలో చనిపోతే వీర స్వర్గం, విజయులమైతే ఈ భూమండలమంతా మనదే.