తగినంత లాభాలనే దృష్టిలో పెట్టుకోవాలి

 

వ్యాపారులు, వ్యవసాయకులు, పారిశ్రామికవేత్తలు, శ్రామికులు, గృహస్థులు, పాలకులు, బోధకులు- వీరందరితో కూడి ఉన్నదే సమాజం.

మానవ శరీరంలో కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు- ఇలా ఏ అంగం చేసే పని అది చేయాలి. ప్రతి అంగానికి సరిసమానమైన విశిష్టత, సరిసమానమైన బాధ్యత, సరిసమానమైన దైవత్వం వున్నాయి. శరీరంలో ఏదో ఒక భాగం లేదా ఏదో ఒక అంగం ప్రధానమైనది- మిగిలినవి అప్రధానమైనవి కావు.

వ్యాపార దక్షత ఉన్నవారు వ్యాపారం చేయాలి. వ్యవసాయ దక్షత ఉన్నవారు వ్యవసాయం చేయాలి. పై దక్షత లేనివాళ్ళు శారీరక శ్రమలో అయినా దక్షతను చూపించాలి.

వ్యాపారులు మొట్టమొదటిసారిగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే సమాజానికి వారి వ్యాపారం అతి ముఖ్యమైనది అని! వ్యాపార వృత్తిలో ఉన్నవారు మొదట వ్యాపార దక్షత ను పెంచుకోవాలి. న్యాయంగా వ్యాపారం చేయాలి. కుటుంబ శ్రేయస్సుకు తగినంత లాభాలను మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి. అంతకుమించి వచ్చిన లాభాలను సంఘ శ్రేయస్సుకు వినియోగించాలి.

వ్యాపార దక్షత అనేది ఒక శాస్త్రం; దీన్నే ఇంగ్లీషులో “Business Management” అంటాం. దీనికి ప్రత్యేకంగా ప్రపంచమంతటా కళాశాలలు ఉన్నాయి. కనుక వ్యాపారం చేసే వాళ్ళు వ్యాపార దక్షతను సంపాదించుకోవాల్ంటే “Business Management” లాంటి కోర్సుల ద్వారా వ్యాపార దక్షతను సంపాదించుకోవాలి. అందులోని సూత్రాలను అవగాహన చేసుకోవాలి. తోటి వ్యాపారులతో నిరంతరం వ్యాపార విషయాలను పరస్పరం చర్చిస్తూ పరస్పరం పంచుకుంటూ వుండాలి. చేపట్టిన వృత్తికి తగిన సజ్జన సాంగత్యం తగిన స్వాధ్యాయం చేయాలి. స్వంత వ్యాపారం మీద పూర్తి ధ్యాస ఉంచాలి.

అదే విధంగా పాలకులు దక్షత ను కలిగి ఉండాలి; వ్యవసాయదారులు వ్యవసాయ దక్షత ను కలిగి వుండాలి..

గృహస్థులు అయినవారు గృహ నిర్వహణా దక్షత ను కలిగివుండాలి.

శ్రామికులు శ్రామిక దక్షత ను కలిగి వుండాలి. ఇవన్నీ వెరసి వృత్తి దక్షత అనబడుతుంది.

అయితే, వారి వారి వృత్తి దక్షతలను వారు చూసుకుంటూనే మరి అందరూ ఆత్మజ్ఞాన పరాయణులు కూడా కావాలి అది తప్పనిసరి.. అంటే, ఒక త్రాటి మీద వృత్తి దక్షత, మరి మరొక త్రాటి మీద ఆత్మజ్ఞాన దక్షత ను కలిగి ఉండాలి.