మూడుధర్మాలు

 

“మనిషై పుట్టిన ప్రతి ఒక్కరూ మూడు ధర్మాలను తప్పక పాటించాలి!

“మొదటి దేహధర్మం”: మన దేహం పట్ల మన ధర్మాన్ని చక్కగా పాటించడం. ఈ భూమి మీద అనేకానేక అనుభవాల ద్వారా అనంతమైన జ్ఞానాన్ని పొందడానికి జన్మతీసుకున్న ఆత్మస్వరూపులమైన మనందరికీ దేహం ఒక ‘వాహనం’!

“ఈ వాహనాన్ని మనం ధర్మబద్ధంగా చూసుకుంటేనే అది మనకు చక్కగా సహకరిస్తుంది. వాహనం బాగుంటేనే మనం ఎక్కడికైనా ప్రయాణం చెయ్యగలం.. మరి మనం వచ్చిన పనిని చక్కబెట్టుకోగలం! కనుక శుద్ధ శాకాహారంతో దానికి పోషణను అందిస్తూ, ధ్యానంతో దానిని శక్తివంతం చేయాలి.

“మన శరీరంలో కోటానుకోట్ల కణాలు వున్నాయి. వాటన్నింటికీ మన గురించి బాగా తెలుసు కానీ.. మనకే వాటి గురించి ఏ మాత్రం తెలియదు. అందుకే సరికాని మాంసాహారంతో వాటిని బాధిస్తూ వాటిని వేదనకు గురిచేస్తున్నాం. పెట్రోలు కారులో డీజిల్‌పోసి నడిపి దాని ఇంజన్ పనితీరును దెబ్బతీసినట్లు.. మాంసాహారంతో మన దేహం యొక్క పనితీరు దెబ్బతీస్తూ మనం కూడా రోగాల పాలు అవుతున్నాం!

“ఈ కోటానుకోట్ల కణాల్లో ప్రతి ఒక్క కణం కూడా ఎంతో జ్ఞానవంతమైంది! మన కణజాలం అంతా కూడా ప్రతిక్షణం ఒకదానిని ఒకటి సమన్వయ పరచుకుంటూ క్రమక్రమంగా ఆత్మపరిణామ దిశగా సాగుతూంటుంది. కనుక వాటితో మనం సరియైన విధంగా ప్రవర్తించాలి అంటే.. మనకు నిరంతర ధ్యానసాధన మరి అహింసా ధర్మాచరణయే మార్గం!

“రెండవది సమాజధర్మం”: సమాజంలో మనం కూడా భాగస్వాములం కనుక ‘అందరూ సుఖంగా సంతోషంగా వుంటేనే మనం కూడా సంతోషంగా ఉంటాం’ అన్నది తెలుసుకోవాలి. అందుకు గాను మన దగ్గర ఉన్న ఆర్థక ఆధ్యాత్మిక సంపదను అందరితో పంచుకోవాలి. అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం వంటి అనేకానేక దానాలతో పాటు ధ్యానదానం కూడా చేయాలి. ధ్యానప్రచారం ద్వారా ధ్యానదానం చేయకపోతే.. మిగతా అన్నిదానాలు కూడా వ్యర్థమైపోతాయి.

“మూడవది ఆత్మధర్మం” : మనం ఏ పని కోసం ఈ భూమ్మీద జన్మతీసుకున్నామో.. ప్రతి క్షణం ఆ పని మీదే ధ్యాస ఉంచుకుంటూ .. మన దైనందిన కార్యక్రమాలను నిర్వహించు కోవాలి. వచ్చిన పనిని పూర్తిచేసుకోకపోతే.. ఇక్కడ గడిపిన మన జన్మకాలం మరి మనం సంపాదించిన సంపదలన్నీ కూడా ఎందుకూ కొరగావు”

“ధ్యానం -అహింస ..మనకు రెండు రెక్కలు”

“రెండు రెక్కలు ఉన్నంతవరకే పక్షి చక్కగా ఆకాశంలో ఎగురుతూ అద్భుతమైన జీవితాన్ని గడుపగలుగుతుంది. అందులో ఏ ఒక్క రెక్క లేకపోయినా పాపం దానిది వికలాంగ జీవితంలా మారి.. తన జీవితపైన ‘ఆకాశంలో ఎగరడం’ అన్న పనిని అది చేయలేదు. అలాగే ఆత్మ స్వరూపులమైన మనకు ‘ధ్యానం’- ‘శాకాహారం’ అన్నవి రెండు రెక్కల్లాంటివి. ఇందులో ఏ ఒక్కటి మనకు లేకపోయినా రెక్కలు కోల్పోయిన పక్షిలాగే మనం కూడా కుంటి బ్రతుకు బ్రతుకుతూ జీవితాన్ని ఈడ్చాల్సి వస్తుంది!

“కనుక ధ్యానం ద్వారా మన మనస్సును అరికట్టి సాటి జంతువుల పట్ల దయను చూపిస్తూ.. వాటితో మిత్రత్వం నెరుపుతూ.. సృష్టి సిద్ధాంతాలను గౌరవిస్తూ ఆనందంగా జీవించాలి! అంతేకానీ వాటిని చంపి శాకాహారంతో పోషించాల్సిన దేవాలయంలాంటి మన దేహాలను మాంసాహారంతో అపవిత్రం చేయవద్దు!

“ఒకవేళ శాకాహారం బొత్తిగా దొరకని ప్రదేశాల్లో వుండాల్సిన అవసరం వస్తే.. అది ఎంత గొప్ప ప్రదేశం అయినా సరే ఆ ప్రదేశాన్ని మనం నిర్ద్వంద్వంగా వదిలివేయాలి. అలాంటి దుర్భరప్రదేశాలు డాలర్ల ను కురిపిస్తూ మనల్ని మాయకు గురిచేసినా.. ఆత్మపరిణామక్రమంలో మాత్రం అవి మనకు గొప్ప ప్రతిబంధకాలు మరి మనకు అవి ఎంతమాత్రం అనువైన ప్రదేశాలు కావు!” అంటూ క్షీర-నీర న్యాయాన్ని పాటించే హంసల్లా మార్చాల్సిన అత్యవసరాన్ని తెలియజేసారు పత్రీజీ!

“ధ్యానశక్తి తరంగాలను విశ్వవ్యాప్తం చెయ్యాలి”

“చెడ్డవాళ్ళు చెడ్డపనులు చేస్తున్నారు. ఇతరులను దూషిస్తూ హింసిస్తూ, చంపుతూ ఆనందంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసేస్తున్నారు.

“మరి మంచి వాళ్ళేం చేస్తున్నారు? వారు ఇతరులను చంపలేరు, హింసించలేరు మరి దూషించలేరు! దేవాలయాలకు వెళ్ళి వాళ్ళు పూజలు చేస్తారు కానీ.. అక్కడ ఇంకా ఏం చేయాలో వాళ్ళకు తోచదు. చర్చిలకు, మసీదులకు వెళ్ళి ప్రార్థనలు చేస్తారు కానీ.. ఇంకా ఏం చెయ్యాలో వాళ్ళకు తెలియదు. ఇది సరిఅయిన పద్ధతి కాదు!

“చెడ్డవాళ్ళ చెడ్డ పనులవల్ల.. జరగాల్సిన అనర్థాలు జరుగుతోంటే.. మంచి వాళ్ళ నిష్క్రియాపర్వతం వల్ల రావాల్సిన మంచి మార్పు రావడం లేదు. కాబట్టి మంచి వాళ్ళంతా కూడా ధ్యానం చేసి సాధ్యమైనంత ఎక్కువ తమదైన ఆత్మశక్తిని సృష్టిస్తే.. ఆ శక్తి తరంగాలు ఈ భూమి మీద వ్యాపించి.. చెడ్డవాళ్ళలో మంచి మార్పును కలుగజేస్తాయి. గౌతమబుద్ధుని ధ్యానశక్తి తరంగాలు పరమ కిరాతకుడైన అంగుళీమాలుడిని పరిమార్చినట్లు.. భూమిపై వున్న అనేకానేక బుద్ధుళ్ళ ధ్యానశక్తితరంగాలు సమాజంలోని చెడునంతటినీ ప్రక్షాళనం చేస్తాయి! కనుక విస్తృత ధ్యాన జ్ఞానప్రచారాల ద్వారా కోట్లాది మంది బుద్ధుళ్ళను తట్టి లేపుతూ ధ్యానశక్తి తరంగాలను విశ్వవ్యాప్తం చెయ్యాలి.”

“40 రోజుల ధ్యానం తప్పనిసరి”

“ఒక రాయిని సుత్తితో గట్టిగా కొడుతూ ఉంటే పది పదెహేను దెబ్బలవరకు ఏమీ జరిగినట్లు కనపడదు. ఆ తరువాత కేవలం ఒక చిన్ని దెబ్బకే అది రెండుగా పగులుతుంది. అది ఆ చివరి దెబ్బ గొప్పతనం కాదు.. అంతవరకు శ్రమించి కొట్టిన పధ్నాలుగు దెబ్బల ఫలితమే అది!

“అలాగే ధ్యానం కూడా 40 రోజులు ఖచ్చితంగా చెయ్యాలి! ముందు కొన్ని రోజులు పాటు బయటికి ఏమీ కనపడకపోయినా ఒక్కొక్క దెబ్బకు రాయి లోపల ఉన్న కణ సంఘటితంలో మార్పు వచ్చినట్లే.. ఒక్కొక్క రోజు ధ్యానం వల్ల మన అంతరం లోపలి జన్మజన్మల చెడు కర్మ ఫలితాలు కూడా మననుంచి విడిపోతూ ఉంటాయి. తపనతో కూడిన శ్రద్ధతో ధ్యానసాధన చేస్తూ వుంటే.. 40 రోజుల లోపలే.. ఏదో ఒక క్షణంలో రాయి రెండుగా విడిపోయినట్లు.. మనం నరుడి నుంచి నారాయణుడిగా విడిపోతాం!

“రాయిలా ఉన్న మనం .. పగలక నరుడైన అర్జునుడిలా పదే దుఃఖానికి గురువుతూ ఉంటే ధ్యానంద్వారా పగిలి రెండుగా విడిపోయాక.. నారాయణుడైన కృష్ణుడిలా ఆత్మజ్ఞానంతో విలసిల్లుతూ ప్రతిక్షణం ఆనందంగా గడుపుతూంటాం! అంతకు ముందు అనేకనేక జన్మల సందేహాలతో నిండి ఉన్న మనకు 40రోజుల ధ్యాన సాధన తరువాత ప్రతి ఒక్క సందేహానికి మన అంతరంగం నుంచే సమాధానం వస్తుంది.

“రాబోయే సత్యయుగంలో జబ్బులు మరి వైద్యాలయాలు ఏవీ ఉండవు. కేవలం ధ్యానం మరి పిరమిడ్ శక్తి మాత్రమే వుంటుంది ‘నేను కేవలం శరీరాన్నే’ అనుకున్నంత కాలం మనం దుఃఖంలో పడిపోతూనే ఉంటాం! కర్మ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకున్న తరువాత మోక్షస్థితిలో ఉంటాం.. మరి మోక్షస్థితిలో మనకు ఏ కర్మ సిద్ధాంతం కూడా వర్తించదు. కాబట్టి ఆత్మ స్వరూపులమైన మనం ఆత్మలోకపు నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ ఉంటే ప్రతిక్షణం మోక్షస్థితిలో సంపూర్ణ ఆనందతో ఉంటాం!