మనో శక్తి
భూమి మీద నడయాడే బీజసదృశ్యమైన దేవుడే ఈ మానవుడు.
అత్యున్నత స్థితికి క్రమక్రమంగా ఎదిగి ఊర్ధ్వలోకాల కెగసిన మానవుడే ఆ దేవుడు.
సప్త శరీరాల శక్తిస్వరూపులే ఇద్దరూ,
సప్త శరీరాలూ సంపూర్తిగా క్రియాశీలకం కాకపోతే మానవుడు.
సప్త శరీరాలూ సంపూర్ణంగా క్రియాశీలకం అయితే దేవుడు.
మన సప్తశరీరాలూ సంపూర్తిగా క్రియాశీలకం అయితే మన మనోశక్తి అపరిమితం.
మన సప్తశరీరాలూ సంపూర్తిగా క్రియాశీలకం కాకపోతే మన మనోశక్తి పరిమితం.
పరిమితులున్న దేవుడే ఈ మానవుడు.
పరిమితులు లేని మానవుడే ఈ దేవుడు.
మనపై మనం విధించుకున్న పరిమితుల నుంచి శాశ్వతంగా బయటపడదాం.
కండరాలూ, ఎముకలూ, చర్మమూ, మెదడూ, వీటి కలయిక నేను – అనుకుంటే అంతకు మించిన అజ్ఞానమేముంది.
నేను ఈ భౌతిక శరీరం కాదు అత్యద్భుతమైన, శక్తి స్వరూపుణ్ణి, కాంతి పుంజాన్ని –
అనుకుంటే అంతకు మించిన సుజ్ఞాన మేముంది?
మన చైతన్యం నిత్యమైన ఆ విస్తృత సత్యంలో ఏకమైతే అన్నీ అవుతాయి అర్ధం.
అన్నీ అర్ధం చేసుకోవడం అంటే మన మనో శక్తిని ఎన్నో రెట్లు పెంపొందించుకోవడం అన్నమాట.
మనస్సు స్వచ్ఛంగా వుంటే మన మనోశక్తి పెంపొందించబడుతుంది.
అనుభవైక అత్మజ్ఞానం అన్నదే స్వచ్ఛమైన ఆలోచనలను ఉద్భవింప జేస్తుంది.
అందుకే మనం కార్మోన్ముఖులమవుదాం…
ఉన్నతమైన మానవులుగా ఎదగడానికీ.
ఆత్మజ్ఞాన పరాయణులుగా తయారవడానికీ.
తద్వారా శక్తివంతమైన ఆలోచనా – తరంగాలు గా
మనోశక్తి కాంతి పుంజాలుగా మారటానికీ …
అప్పుడే, మనం భూమ్మీద నడిచే దేవుళ్ళం గా అవుతాం.