మహాస్వామి వివేకానంద
స్వామి అనే చిన్న బిరుదు అంతటి మహాత్ముడికి ఎలా వచ్చిందో అర్థం కాదు.
అయితే, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ధ్యానులకు మటుకు ఆయన మహాస్వామి.
ఊర్థ్వ, మహాకారణ లోకాలలో ఉండి, తన ప్రధాన శిష్యులలో ఒకరైన శ్రీ రామకృష్ణ పరమహంసను ముందుగా భూలోకానికి పంపి, తరువాత శ్రీ రామకృష్ణ పరమహంసకు శిష్యుడుగా తానే అవతరించిన సిద్ధ పురుషుడే మహాస్వామి వివేకానంద.
వివేకానంద మహాస్వామి హిందూమతంలోని అసలైన, సిసలైన ఆధ్యాత్మికతను ఎలుగెత్తి చాటిన మహాత్ముడు. సనాతన ఋషి విజ్ఞానాన్ని ఆధునిక పరిభాషలో ప్రప్రథమంగా విస్తారంగా వ్యాఖ్యానించిన ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు. ఎంతోమంది అనుయాయులను సుశిక్షితులైన ఆధ్యాత్మిక శాస్త్ర విధ్యార్ధుల్లా, యోగాభ్యాసకుల్లా, కర్మయోగ వీరుల్లా తీర్చిదిద్దిన సాటిలేని నాయకుడు. అద్వైతమృతాన్ని దశదిశలా గుబాళింప చేసిన పరమ ఆచార్యుడు.
తన ఏడు చక్రాలలో ఆజ్ఞా చక్రాన్ని, అంటే దివ్యచక్షువు ను, మినహాయించి మిగతా అన్ని చక్రాలనూ అమోఘంగా ఉత్తేజపరచుకున్నవాడు. ఆ ఒక్క చక్రాన్నీ కనుక ఉత్తేజింప చేసుకుని వుంటే అపర బుద్ధుడు అయి వుండేవాడు.
వివిధ కోశాలలో మొదటిదైన అన్నమయ కోశ పరంగా, రెండవదైన ప్రాణమయ కోశ పరంగా, మూడవదైన భావనామయ కోశ పరంగా, నాల్గవదైన విజ్ఞానమయ కోశ పరంగా, ఐదవదైన ఆనందమయ కోశ పరంగా, మరి ఏడవదైన నిర్వాణమయ కోశ పరంగా, మనమందరం కూడా ఆయనలాగా అపార బల సంపన్నులం గా అయి తీరాలి.
ఆరవ చక్ర విషయంలో మటుకు ధియోసాఫికల్ సొసైటీ మాస్టర్స్ లాంటి వారు, లోబ్సాంగ్ రాంపా లాంటివారు మనకు ఆదర్శప్రాయులు.
ఈ విషయాలను గుర్తుంచుకుని మనం అందరం కూడా వివేకానంద స్వామిలా, ఇంకా గొప్పగా, కావడానికి కృషి చేద్దాం. అప్పుడే ఊర్థ్వ లోకాలలో మనల్ని చూసి గర్విస్తాడు, సంతోషిస్తాడు. మరి ఆయన్ని సంతోషపరుద్దామా? నిర్విరామ కృషి వల్లనే, సునిశిత వివేక సంపత్తి వల్లనే, నిత్య ఆనంద సాధన వల్లనే ఇది సాధ్యం.