చక్రభ్రమణం

 

ఇక్కడ ఈ భూలోకంలో శరీరధారణ చేసి ఉన్న ఆత్మస్వరూపులమైన మనం అంతా కూడా మన జీవితాలకు మనమే అధిపతులం. ఈ సత్యాన్ని మరింత శాస్త్రీయంగా తెలుసుకోవాలంటే మనం మన ప్రాణమయకోశంలో “కుండలినీ” రూపంలో ఉన్న చక్రాలను గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మూలాధారం – స్వాధిష్టానం – మణిపూరకం – అనాహతం – విశుద్ధం – ఆజ్ఞా .. అన్నవి ఆరు చక్రస్థితులు.

రకరకాల జీవితాల అనుభవజ్ఞానంతో మనల్ని మనం పరిపూర్ణత నొందించుకోవడానికి మనం అంతా ఒకానొక పూర్ణాత్మనుంచి వివిధ అంశాత్మలుగా వెలువడి అనేకానేక జన్మలు తీసుకుంటూ మొట్టమొదట “శైశవదశ”లో ఉంటాం.

అక్కడ “నేను” అంటే “కేవలం శరీరం మాత్రమే” అన్న స్థాయి జ్ఞానంతో మూలాధార చక్రంలో తిరుగుతూ జీవితాన్ని గడుపుతాం. ఆ తరువాత “నాది, నా ఇల్లు, నా పిల్లలు, నేను బ్రాహ్మణుడను, నేను శూద్రడును, నీది ఆ మతం .. నాది ఈ మతం” .. అంటూ హడావిడి చేస్తూ .. “స్వ-అధిష్టానం” అంటే స్వాధిష్టాన చక్రంలో గిరగిరా తిరుగుతూ ఉంటాం.

ఈ చక్రస్థాయిలో మనం రకరకాల పాత్రల్లో జన్మలు తీసుకుంటూ అనుభవజ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానసారంతో మణిలా వెలుగుతూ “మణిపూరక చక్రం”లోకి ప్రవేశిస్తాం. అక్కడ “నేను ఒక పండితుడిని” .. “నేను ఒక శాస్త్రజ్ఞుడిని” .. “నేను ఒక గొప్ప కళాకారుడిని” అనుకుంటూ బాహ్యంగా మణిలా ప్రకాశిస్తూ ఉంటాం. శ్లోకాలన్నీ వల్లె వేస్తూంటాం కానీ మన అంతరంగంలో వున్న శోకాలను మాత్రం పోగుట్టుకోలేం. పాండిత్య ప్రదర్శనలతోనే కాలం గడుపుతూ మణిపూరక చక్రస్థితిలో గిరగిరా తిరుగుతూ ఉంటాం.

ఈ మూడు చక్రాలు కర్మ సంబంధమైన భూలోక, భువర్లోక మరి సువర్లోకాలకు చెందినవి. ఇక్కడ మనం ఎన్నో కర్మలు చేస్తూ వాటికి సంబంధించిన మంచి-చెడు కర్మ ఫలితాలను మూటగట్టుకుంటూ ఉంటాం. దానివలన మన నాడీమండలం అంతా రకరకాలుగా మలమై .. అశుద్ధంగా మారిపోతుంది.

అలా అశుద్ధమై ఉన్న నాడీమండలంతో మనం ఉన్నత చక్రాలలో మొట్టమొదటి అయిన “అనాహతం”లోకి ప్రవేశిస్తాం. అక్కడ అంతా శూన్యం .. మహాశూన్యం! మౌనం .. మహామౌనం!

ఈ మహామౌనంలో మనం .. అంతకు ముందు కూడగట్టుకున్న కర్మలన్నింటినీ దగ్ధం చేసుకుని మహా పరిశుద్ధులుగా మారి “విశుద్ధ చక్రం”లోకి ప్రవేశిస్తాం. విశుద్ధ చక్ర పరిభ్రమణలో మనం ఇతరులకు భౌతికపరమైన సేవలు చేస్తూ విశుద్ధులుగా పరిమారుతాం. అప్పుడే మనకు “ఆజ్ఞాచక్రం”లోకి ప్రవేశించి ధ్యానం చేసుకునే అర్హత వస్తుంది. ఆజ్ఞాచక్రంలో మనం చేసేదే ధ్యానం! ధ్యానంలో మనకు దివ్యచక్షువు ఉత్తేజితం అవుతుంది. సూక్ష్మశరీరం విడుదల అయి సూక్ష్మశరీరయానాలు చేస్తూ అంతవరకూ మనం నేర్చుకున్న పాండిత్యంలోని విశేషాలన్నింటినీ అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం .. ఆ బ్రహ్మ-భువన లోకాలన్ని స్వయంగా తిరిగివస్తాం. దివ్యచక్షువుతో మన జన్మలన్నీ స్వయంగా చూసుకుని ఆశ్చర్యంతో ఇతరులకు చెబుతూంటాం. ఇతరులు చెప్పే దివ్యచక్షువు అనుభవాలను ఆశ్చర్యంతో వింటూంటాం. అక్కడ నుంచి మనం “సహస్రార స్థితి”లోకి చేరుకుంటాం. సహస్రారస్థితిలో మాత్రమే మనకు “నిజమైన ఆధ్యాత్మిక సేవ” చేసే అర్హత వస్తుంది. ఆధ్యాత్మిక సేవలో ముఖ్యంగా మనం ధ్యాన, శాకాహార ప్రచారాలు చేస్తాం.

భారతదేశ స్వాతంత్రోద్యమం ముమ్మరంగా జరుగుతూన్న రోజుల్లో ఒకసారి ప్రముఖ హిమాలయ యోగి స్వామి రామా తమ గురువుగారిని “స్వామీ! నేను కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొని దేశానికి సేవ చేస్తాను; నాకు అనుమతి ఇవ్వండి” అని అడిగారు. దానికి వాళ్ళ గురువుగారు నవ్వి “నీ స్థాయి అది కాదు నాయనా! నువ్వు అంతకంటే వేరే స్థితిలో ఉన్నవాడివి! ఆత్మస్వాతంత్రోద్యమంలో పాల్గొని ఆధ్యాత్మిక సేవ చెయ్యి” అని చెప్పారు.

ఇలా పిరమిడ్ మాస్టర్లందరూ కూడా నిజమైన “ఆధ్యాత్మిక సేవ చేయడానికే ఈ భూలోకంలో జన్మ తీసుకున్న నక్షత్రలోకవాసులు. వాళ్ళంతా కూడా ధ్యానం ద్వారా ఆరు చక్రస్థితులను స్థితులను ఒకే జన్మలో దాటి పరిపక్వంగా మారి .. మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా తమను తాము మలచుకున్నారు.

ఈ భూమండలంలోని పరీక్షలనన్నింటినీ తమ సహజ అంతరావబోధ సహాయంతో ఉత్తీర్ణులైన వీళ్ళంతా కూడా విజయవంతంగా పై లోకాలకు చేరి “సహసృష్టికర్తలు”గా అక్కడ ఇంకా ఇంకా అనేకానేక ఇతర లోకాలనూ మరి క్రొత్త క్రొత్త జంతువులనూ, సరిక్రొత్త మానవులనూ సృష్టిస్తూ “నారాయణుడి”లా జీవిస్తూ ఉంటారు!