చేయవలసినవి చేస్తే .. పొందవలసినవి పొందుతాం
ప్రతిక్షణం మనం మన ఆత్మతో మనం మమేకమై వుంటూ మనతో మనం స్నేహం చెయ్యాలి. మనతో ఎలా స్నేహంగా ఉంటామో అలాగే ఇతరులతో కూడా స్నేహం చెయ్యాలి.
ఇతరులతో స్నేహం చేస్తే అది “సంసారం” ! మరి మనతో మనం స్నేహం చేస్తే అది “నిర్వాణం” ! మనకు సంసారం కావాలి; “నిర్వాణం” కూడా కావాలి ! ఇవి రెండూ ఏకకాలంలో కావాలి !
మరొకరితో కలిసి చక్కగా జీవిస్తూ సుఖమయ సంసారాన్ని పొందుతూనే మనం మనతో కూడా కలిసి జీవిస్తూ ఆత్మానందమయ నిర్వాణాన్ని పొందాలి అంటే .. ధ్యానసాధన అన్నది ప్రతి ఒక్కరికీ చిన్నతనం నుంచే అలవడాలి. లేకపోతే ” ఆదిలోనే హంసపాదు ” అన్నట్లుగా జీవితం అపశృతులతోనే మొదలవుతుంది.
నా చిన్నతనంలో నాకు ధ్యానసాధన గురించి తెలియదు. మా అమ్మ పూజలు చేసుకుంటూ .. మా నాన్న ఉద్యోగం చేసుకుంటూ ఎవరి జీవితంలో వారుండేవారు. అయితే, బహుశః నేను అంతకు ముందు జన్మల్లో చేసిన ధ్యానసాధనా ఫలితం వల్లనేమో నాకు అందరిలా వుండే మామూలు జీవితం నచ్చేది కాదు. కాలక్రమేణా ధ్యానం గురించి తెలుసుకుని .. ధ్యానం చేస్తూ మెల్లమెల్లగా నా స్వస్థితిలో స్థితమవుతూ వచ్చాను. నా పాత జన్మల్లో గుప్తంగా ఉండిపోయిన జ్ఞానాన్నంతా వెలికి తెచ్చుకున్నాను.
భార్యా పిల్లలను ప్రేమగా చూసుకుంటూనే, ఉద్యోగ ధర్మాన్ని బాధ్యతగా నిర్వహిస్తూనే ఇతరులకు ధ్యానప్రచారం చేస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడిని.
ఒక్కోసారి కేవలం ఒక్క వ్యక్తికి ధ్యానం నేర్పడానికి కూడా నేను ఎన్నెన్నో కిలోమీటర్ల దూరం వెళ్ళి మరీ .. వారికోసం గంటలు గంటలు వేచి చూసేవాడిని. వాళ్ళు తమ తమ స్వంత ప్రాపంచిక పనులను ముగించుకుని వచ్చాక .. వారికి ధ్యానం నేర్పి వచ్చేవాడిని. అప్పుడే నా మనస్సు శాంతించేది.
ఇదంతా ఎవరికోసం చేశాను ?? నా కోసమే !! నన్ను నేను ఉద్ధరించుకోవడానికి చేశాను ! నెమ్మది నెమ్మదిగా ధ్యానం విలువ తెలుసుకుని నా దగ్గరికి ” పది మంది ” రావడం మొదలయ్యింది. ఇప్పుడు వేలూ .. లక్షలమంది !
మీరంతా నా దగ్గరికి ఎందుకు వచ్చారు?? మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి వచ్చారు !! ధ్యానసాధన ద్వారా మీ దగ్గర ఉన్న పరమాత్మ తత్త్వాన్ని గుర్తించుకోవడానికి వచ్చారు. మీలో వున్న సహనాన్నీ, శ్రద్ధనూ, సబూరీనీ, ఎరుకనూ పెంపొందించు కోవడానికి వచ్చారు. ఇవన్నీ దైవీలక్షణాలు !
ఈ దైవీ లక్షణాలు లేనివాడు .. బాధకలిగితే .. ఆ బాధను తనకంటే బలహీనులయిన వాళ్ళమీద వెళ్ళగ్రక్కుతూ వాళ్ళను హింసిస్తూంటాడు. పై అధికారి ఆఫీసులో తనను ఏదో అన్నాడన్న ఉక్రోషాన్ని ఇంటికి వచ్చి భార్యమీద చూపిస్తాడు .. అది జీర్ణించుకోలేని ఆ దొడ్డఇల్లాలు కోపంతో తన చిన్న పిల్లల్ని చావబాదుతుంది. ఇదొక అసంకల్పిత చైన్ రియాక్షన్! ఇలాంటి ఎరుకలేని అసంకల్పిత గొలుసు – కట్టు చర్యల్లోంచి బయటపడాలి అంటే .. మనలో ధ్యాన చైతన్యాన్ని పెంచుకోవడం ఒక్కటే మార్గం !
ముప్పై సంవత్సరాల క్రితం .. ఒక్కరికే ధ్యానం నేర్పుతూన్నప్పుడు కూడా “లక్షలాది మంది నా సమక్షంలో ధ్యానం చేయాలి” అని నేను సంకల్పించుకున్నాను. నా కలలు నా సంకల్పాలు అద్భుతంగా నెరవేరాయి. ఇదంతా కూడా మన సమిష్టి కృషికి నిదర్శనం ! ఒక ప్రణాళిక ప్రకారం “ధ్యానాంధ్రప్రదేశ్” .. “ధ్యానభారత్” .. “ధ్యానజగత్” లు ప్రారంభం చేశాం !
2012 డిసెంబర్ 21 వ తేదీన పైలోకాల గ్రాండ్ మాస్టర్ల సూచనతో మహేశ్వర మహాపిరమిడ్ శక్తి ప్రాంగణంలో కాస్మిక్ సంబరాలను జరుపుకున్నాం !
మన స్వంత కల్యాణం కోసం చేసే ప్రాపంచిక కార్యాలు మనకు కర్మల్లా పరిణమించేందుకు అవకాశాలు కలిగి వుంటే సమిష్టి కృషితో ఇలా అందరికోసం చేసే యజ్ఞాలు లోకకల్యాణానికి కారణభూతం అవుతూ, కొద్దో, గొప్పో మిగిలిన కర్మభారాలను పూర్తిగా దగ్ధం చేసేస్తాయి ! ఇంకేం ?! ఇంకా ముందుకు పోదాం !!