సంగీత ధ్యానయజ్ఞం

 

 

“శ్రీ సాయిరామ్, మనమందరం కూడానూ ధ్యాన నిమగ్నులమై మనలో నుంచి ధ్యానశక్తిని ప్రపంచానికి అందించ వలసిందిగా ప్రార్ధిస్తున్నాను. 

“మనం భగవాన్ సత్యసాయికి ఎంతైనా రుణపడి వున్నాం. అత్యంత అభిమానాలను చవిచూస్తున్నాం పుట్టపర్తి స్వామి వారి నుంచి. ఒకరికొకరు సహాయం చేసుకోవటమే ప్రపంచానికి సహాయం చేసుకోవటం.”

“పుట్టపర్తి అపూర్వ శక్తిక్షేత్రం” – పత్రీజీ

“పుట్టపర్తిలో మూడురోజుల సంగీత ధ్యానయజ్ఞం జరుపుకోవటం పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌కు గర్వకారణం. ఇది అపూర్వమైన శక్తిక్షేత్రం. ఈ శక్తిక్షేత్రంలో ధ్యానం చేసుకుంటే మనకు ధ్యానం మూడింతలు ఎక్కువ శక్తివంతం అవుతుంది. ఈ మూడురోజుల ధ్యానయజ్ఞాన్ని ఎక్కువ ఉపయోగించుకోవాలి.”

“ధ్యాన జీవితంలో అతిముఖ్యమైనది. ఎంత ఎక్కువ ధ్యానంలో వుంటామో అంత శక్తివంతులం, యుక్తివంతులం అవుతాం. If you involve yourself in meditation every day, you will acquire passion for your life, wisdom for your life. When you are with soul & natural breath Cosmic energy flooded into the body. Body becomes happy healthy. The body will be forever.

 

“ధ్యానం వలన ఆత్మజ్ఞానం వస్తుంది. ధ్యానం యొక్క ధ్యేయం ఆత్మానుభవం. శరీరానికి అనుభవం వుంది కానీ మనకు ఆత్మానుభవం అదనంగా కావాలి. ఆ ఆత్మానుభవానికి చేయవలసిన కార్యక్రమమే ధ్యానం. భగవద్గీతలో కృష్ణుడిని ‘ ఎవరయ్యా నువ్వు? ఏమిటయ్యా నువ్వు? నువ్వు నాకు అర్థం కావట్లేదు ‘ అని అర్జునుడు అడిగాడు. ‘ అహం ఆత్మా గుదాకేశ ‘ అని సమాధానం ఇచ్చాడు కృష్ణుడు. ‘ గుడాకేశ ‘ అంటే నిద్రను జయించినవాడు. వాడే ఆత్మను తెలుసుకుంటాడు.

” డస్సిపోయిన శరీరానికి నిద్ర ఎంత అవసరమో, డస్సి పోయిన ఆత్మకు ధ్యానం అంత అవసరం. అర్జునిడి శరీరం బావుంది. కానీ ఆత్మ డస్సిపోయి వుంది. విషాదభరితమై వుంది. ‘ నా గురువును, తాతగారిని, అన్నదమ్ములను చంపాలా? వాళ్ళు అన్యాయం చేసారని చంపాలా? ‘ అనుకుంటూ అక్కడ అర్జునుడి ఆత్మ డస్సిపోయి వుంది. అదే సమయంలో కృష్ణుడి ఆత్మ అలసిపోలేదు, నీరసంగా లేదు, సాహసంగా వుంది. సరసంగా వుంది.

” శరీరం ఇక్కడే వుంటుంది. ఆ నేను మాత్రమే వెళ్తుంది. ఈ మేను వేరు, ఆ నేను వేరు. ఈ మేనుకు చావుంది. ఆ నేను కు చావు లేదు. ఆ నేను ఇక్కడ చక్కగా ఆటలాడి పైకి వెళ్తుంది. ఒకవేళ నువ్వు జయించావా ఇది అంతా నీకే, అందుకే ‘ యుద్ధాయ కృతనిశ్చయః ‘ అని అర్జునుడికి ఉపదేశించాడు. శ్రీకృష్ణుడు డస్సిపోని, అలసిపోని, నీరసపడని ఆత్మ. అర్జునుడు ఒకప్పుడు బాగానే వుంటాడు. ఒకప్పుడు డస్సిపోతాడు. మామూలు సమయాల్లో బావుంటాడు. కీలక్ సమయాల్లో డస్సిపోతాడు. ఎందుకంటే ధ్యానం లేదు కనుక, తాను ఆత్మ అని సైద్ధాంతికంగా తెలిసినా, ప్రాక్టికల్‍గా ధ్యాన అనుభవం లేదు. ఆత్మానుభవం లేదు. శ్రీకృష్ణుడికి ప్రాక్టికల్‌గా ధ్యానానుభవం వుంది. ఆత్మానుభవం వుంది. ధర్మంలో వీరిద్దరికీ తేడా లేదు. ధ్యానంలో తేడా వుంది. ధర్మం అంటే చేయవలసిన కర్తవ్యం. నీ కర్తవ్యం ఇప్పుడు అందరినీ చంపాలి. ధర్మానికి రక్త సంబంధాలతో పనిలేదు …”

“ఇక్కడ … ఈ భూమండలంలో … ఏ నష్టం జరిగినా, పరువు పోయినా, శుభం జరిగినా, అశుభం జరిగినా, ‘ ఆత్మ ‘ హాయిగా వుంటుంది. భౌతికజన్మ ఆత్మ యొక్క ఆట కదా. ఈ జగత్తు సర్వాత్మ యొక్క ఆట కదా. ఆటలో ఒకసారి ఓడిపోతాం. ఒకసారి గెలుస్తాం. ఓడిపోని, గెలవని ఆట వుంటుందా? పాటలో ఒక్కొక్కసారి అపస్వరం వస్తుంది. ఎవ్వరికైనా వస్తుంది. కానీ ఆ అపస్వరానికీ, ఆ ఓడిపోవడానికీ, ఆత్మ నవ్వుకుంటుంది. ఏడవదు, మనం ఓడిపోయాం ఆటలో … “ఎంతో బాగా ఆడావయ్యా, నీదగ్గర్ నేర్చుకోవలసింది ఇంకా చాలా వుంది.” అనుకుంటాడు. ఓడిపోయినవాడు. పాటలో అపస్వరం వస్తే, ఇంకా అభ్యాసం బాగా చేయాలని కోరుకుంటాం, అంతేగానీ ఒక అపస్వరం వస్తే, “నేను ఆత్మ” అని తెలుసుకున్నవాడు ఆత్మహత్య చేసుకోడు. ఎందుకంటే ఆత్మకు హత్య లేదు.”

“సకల ప్రాణికోటిలో ఆత్మగా మొట్టమొదట ఉన్నవాడిని, మధ్యలో ఉన్నవాడిని, అంతంలోనూ ఉన్నవాడిని అని శ్రీకృష్ణుడు తెలిపాడు. ఆత్మ ఆది, అనాది. ఆత్మ అంతం, అనంతం, మధ్యమం, అది మనందరం అయివున్నాం. సకల ప్రాణికోటి … ప్రతి చెట్టు … ప్రతి పుట్ట … ప్రతి దోమ … ప్రతి ఏనుగు … ప్రతి మనిషి ఆత్మయై వున్నాయి. ఈ సంగతి ప్రతి పుట్టకూ తెలుసు. ప్రతి జంతువుకూ తెలుసు. ప్రతి చెట్టుకూ తెలుసు – కేవలం మానవుడికి తప్ప. కనుక ఎక్కడా ఏ చెట్టూ ఏడ్వదు. అక్కడ ఆత్మ డస్సిపోదు. అలసిపోదు. తాను ఆత్మ అని తెలుసుకునే వుంది. శరీరవత్ జీవితాన్ని జీవిస్తుంది … గెలిచినా, ఓడిపోయినా, ఏ జంతువు కూడా ఏడ్వదుఏ జంతువు ఆత్మ అయినా అది డస్సిపోని, అలసిపోని ఆత్మ. నిరామయమైన ఆత్మ.”

“ధ్యానం చేయని అర్జునుడు ‘ మొగ్గ ‘ లాంటివాడు. ధ్యానం చేసిన ఆ కృష్ణుడు ఒక మహా వికసిత పుష్పం. పుష్పం ఫలమై ప్రసాదం వస్తుంది. మనం విన్న గీతాశ్లోకాలు కృష్ణప్రసాదమే. ఆయన ఫలమైతే మనం దాన్ని భుజిస్తున్నాం కదా. పచ్చి కాయలైతే మనం భుజిస్తామేమిటి? ఓ మొగ్గ ముకుళించుకుని వుంది. ఓ పుష్పం వికసితమై వుంది. ధ్యానం చేయని ఆత్మ ముకుళించుకుని వుంది. ఎంతెంత ధ్యానం చేస్తామో అంతంత విప్పారుతాం. ఈ విప్పారటానికి అంతం లేదు. ఆ సహాస్ర దళకమల రేకులు సతతం విచ్చుకుంటూనే వుంటాం. సహస్రదళ కమలమంటే ‘ వేయి రేకులు ‘ అనికాదు. ‘ అనంతకోటి ‘ అని అర్థం. ఎంతెంతగా ధ్యానం చేస్తామో అంతంతగా రేకులు విచ్చుకుంటూనే వుంటాయి. అంతంత మనమ్ విస్తారంగా, విశాలంగా, ప్రకాశంగా అవుతూనే వుంటాం.”

“పుట్టపర్తి ఎంతో విశేషమైన స్థలం. ఇక్కడ మనం కలుసుకోవడం, ధ్యానం చేయటం మరింత విప్పారడం కోసం. మరింత వికాసం కోసం. ఎంతగా విప్పారుతామో అంత శోభ మనకు వస్తుంది. పువ్వుకు శోభ వుంది. పరిమళం వుంది. అంత పరిమళభరితం అవుతాం. అంత శోభాయమానంగా విరాజిల్లుతాం. ధ్యాన అభ్యాసం అనంతం. ఆత్మానుభవం అనంతం. ఆత్మ యొక్క శోభ, పరిమళం, వికాసం … అనంతం.”

“శరీరవత్ రెండు రొట్టెలు చేసుకోవాలి, తినాలి. పొద్దునొక రొట్టె, రాత్రి ఒక రొట్టె. మిగతా సమయాల్లో ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆటలు, పాటలు, విద్యలు, కళలు … ఆత్మను తెలుసుకున్నవాడికి భవిష్యత్తు చింత పోతుంది. ఎందుకంటే భవిష్యత్తు అంతా బంగారమే. పుట్టక ముందంతా బంగారం నుంచే వచ్చాం. ధ్యానులకు రేపటి గురించి చింతలేదు. నిన్నటి గురించి బాధ లేదు. వర్తమానంలో నేర్చుకోవడాలు, వర్తమానంలో జీవించడాలు. మనం అందరి నుంచి నేర్చుకోవాలి.

 

“ఈ జన్మలో నాకు ఏ రోగం రాలేదు. దుఃఖం కలగలేదు. వీటిని పోగొట్టుకోవడం కోసం నేను ద్యానం చేయలేదు. మోక్షం కోసం నేను ధ్యానం చేయలేదు. పుట్టుకతోనే నాకు మోక్షం వుంది. ధ్యానం రాకముందే నాకు అన్ని విద్యలూ వచ్చు. కానీ ధ్యానం వలన ప్రపంచమంతా మిత్రులయ్యారు. ఇదే నా స్వంత అనుభవం. అసలు లాభం. పిరమిడ్ ధ్యానం ద్వారా మాంసం తినేవాళ్ళందరూ ధ్యానం వలన శాకాహారులయ్యారు. అది నాకు అన్నిటికన్నా ముఖ్యమైన లాభం. నేను పుట్టింది మానవుల కోసం కాదు. జంతువుల కోసం. ఆఖరి జంతువు హాయిగా జీవించేంతవరకు నేను ఈ శరీరం వదిలిపెట్టను.”

“నేను 2095 వరకు శరీరం వదిలిపెట్టను. అంతలోపల ఈ ప్రపంచంలో అన్ని జంతువులు శాశ్వతంగా, హాయిగా జీవించి ఉండేవిధంగా ఎలాంటి దౌర్జన్యాలు చేయకుండా మానవులందరినీ సౌజన్యమూర్తులుగా తయారుచేయడం కోసమే నేను వున్నాను.”

“నేను అనుకున్నది సాధిస్తాను. ఈ భూమండలన్ని శాకాహారం చేయటానికి నేనొక్కణ్ణి చాలు. ఏ రోజు భూమండలం అంతా శాకాహారం అవుతుందో ఆ రోజు నేను వేరే సౌర మండలంలోకి వెళ్ళాలి. మరి అది నా ప్రోగ్రామ్. మనందరి ప్రోగ్రామ్.”

“పక్షిజాతి బట్టి పరగ హింసలబెట్టి, కుక్షినిండ కూడు కూరుటకును, వండి తినెడివాడు వసుధ ఛండాలుడు, విశ్వదాభిరామ వినుర వేమ”

“నా జన్మ కారణం ఈ యొక్క పద్యం.” ఇక్కడ జంతుహింస జరుగుతోంది. ఈ భూలోకంలో స్త్రీల పట్ల పురుషులు అత్యాచారాలు చేస్తున్నారు. చిన్నపిల్లలను తల్లిదండ్రులు బలవంతపు చదువులు చదివించి, వేధించి పీక్కుతింటున్నారు. “చావు పుట్టుక లేని చదువులు అంటే ఆత్మజ్ఞానం చదువవలయు”. “భగవాను సత్యసాయిబాబా వారు ఏ చదువులూ చదవలేదు. కానీ మనందరికీ చదువులు చెప్తున్నారు. ఆయన చదివింది ఆత్మ చదువు. ప్రపంచాన్నంతా ఏలుతున్నారు. ఆయన ఏం చదివారు?. ఆయన చదివింది ఆత్మ చదువు. జ్ఞాన చదువు. వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, రమణమహర్షి … అందరూ ఆత్మచదువులే చదివారు. ఈ ఆత్మ చదువులు నేర్పించటం కోసమే మనం ఊరూరా తిరుగుతున్నాం.”

“మనిషి జీవితం ‘రోటి, కపడా, మకాన్’ కోసం కాదు, ‘ సంగీత్, నృత్య్ ఏవం ధ్యాన్’ అందుకోసం జీవితం. రోటీ, కపడా, మకాన్ … అంటే భౌతికం. సంగీత్, నృత్య్, ధ్యాన్ అంటే అది ఆధ్యాత్మికం. శివుడి చేతిలోని ఢమరుకం – అదే మృదంగం – సంగీతం – ఆయన నృత్యం చాలా బాగా చేస్తాడు – ధ్యానం చేస్తాడు. పరమశివుడు పరమ మానవ జీవితానికి దర్శనం – పరమశివుడి జీవితం ఆదర్శం. ఆయన శరీరంలో సగం పార్వతి. పార్వతి శరీరంలో శివుడు సగం కాదు కదా, మగవాడు ఆడలక్షణాలు లేకుంటే పూర్ణం కాదు. ఆడవాళ్ళు తమలో తాము సంపూర్ణం. మగవాళ్ళే చాలా తక్కువ. ఆడవాళ్ళ నుంచి శాంతం, సహనం, అంగీకారం, వాత్సల్యం అనే గుణాలు సంపాదించుకుంటేనే మగవాళ్ళు సంపూర్ణం కాగలరు. ఇది అర్ధనారీశ్వరతత్వమంటే. ఏ స్త్రీకి కూడా మగలక్షణాలు అక్కరలేదు. అలాగే మనం శివుడిలాగా సంగీతం, నృత్యం, ధ్యానం నేర్చుకోవాలి.”