పిరమిడ్ వంశ చరిత్ర

 

మనం అంతా కూడా మన ఆత్మ యొక్క పరిపూర్ణ పరిణామక్రమంలో భాగంగా .. మూడు రకాల వంశాలకు చెందిన దశలను దాటుతూ వెళ్తాం !

ఒకటి : చంద్రవంశ దశ
రెండు: సూర్యవంశ దశ
మూడు: నక్షత్ర వంశ దశ

“చంద్రవంశ దశ”

మనం అంతా కూడా ప్రాధమికంగా కొన్ని జన్మల్లో .. పరిమితి జ్ఞానంతో కూడిన “చంద్రవంశ దశ”  లో జన్మ తీసుకుంటాం ! చంద్రుడు అంటే “మనస్సు” “MOON” – “MAN” – “MIND”మనస్సు ఆధారంగా జీవించేవాళ్ళే “చంద్ర వంశీయులు”

చంద్రుడు స్వయంప్రకాశకుడు కాదు. కనుక చంద్రవంశ దశలో మన ఆత్మ కూడా తన స్వయంప్రకాశాన్ని కోల్పోయి వుంటుంది. “విదియ”, “తదియ” మొదలుకుని “పౌర్ణమి” లేదా “అమావాస్య” ల ప్రభావానికిలోనయ్యే చంద్రుడిలాగే మనం కూడా చంద్రవంశ దశలో రకరకాల హెచ్చుతగ్గులతో కూడిన రకరకాల మానసిక స్థితులలో వుంటూ వుంటాం.

ఒక్కోసారి పెరుగుతూ .. ఒక్కోసారి తరుగుతూ వున్న చంద్రుడిలాగా ఈ దశలో మనం కొన్ని జన్మలు పౌర్ణమి వెలుగులతో మరి కొన్ని జన్మలు ఆ అమావాస్య చీకట్లతో గడుపుతాం ! చావు-పుట్టుక .. రోగం-రొష్ఠు .. కలవడాలూ-విడిపోవడాలూ .. సుఖాలూ-దుఃఖాలూ వంటి ఆటుపోట్లు ఈ దశలో సర్వసాధారణం ! వీటన్నింటితో కూడిన రకరకాల అనుభవాల కలబోతగా జీవితాలను గడుపుతూ ఈ దశలో మనమంతా కూడా ” మనం అంటే దేహం ” అనే భ్రమలో వుంటాం.

“చంద్ర-సూర్య సంధి దశ” : అయితే జన్మపరంపరలో భాగంగా అనేకానేక అనుభవాల సారాంశాన్ని ఆకళింపు చేసుకుంటూ .. “ఆత్మ సూర్య” సత్యాన్ని ఎరుకలోకి తెచ్చుకుంటూ “చంద్ర వంశ” దశ నుంచి ఎదిగి కొంతకాలంపాటు “చంద్ర – సూర్య” దశల్లో జన్మలు తీసుకుంటాం ! దేహం-ఆత్మల మధ్య డోలాయమానంగా ఉండే ఈ దశలో అనేకానేక అనుభవాల జ్ఞానంతో కూడి చివరికి “ఆత్మ అన్నదే సత్యం” అన్న స్పష్టమైన నిర్ణయానికి వస్తాం. ఇక అక్కడి నుంచి మన ప్రయాణం .. ఖచ్ఛితమైన “సూర్య వంశ”దశ లోకి సాగుతుంది.

“సూర్య – చంద్ర సంధి దశ”
“సూర్యవంశ దశ”

సూర్యవంశ దశలోకి వచ్చాక మనం ఆత్మస్వరూపుల్లా మరిన్ని అనుభవాలను పొందుతూ ప్రత్యక్షదైవం అయిన సూర్యుడిలాగా సర్వకాల సర్వావస్థల్లో కూడా స్వయంప్రకాశకులుగా వెలుగుతూ ఉంటాం !

గౌతమబుద్ధుడు కూడా చంద్రవంశ దశలో వున్నప్పుడు ఒకానొక రోగినీ, ముసలివాడినీ, చనిపోయిన వాడినీ చూసి “అవి నాక్కూడా వస్తాయా?” అని తన రథసారధిని అడిగాడు. ” తప్పకుండా వస్తాయి “అని అతడి నుంచి సమాధానం రాగానే .. “తక్షణం వాటికి నివారణోపాయం కన్నుక్కుంటాను “అని చెప్పి అదేరాత్రి భార్యనూ, కొడుకునూ మరి సకల రాజ్య సంపదలనూ వదిలి .. సత్యాన్వేషణ చేస్తూ ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ క్రమంలో అతడు ” సూర్య-చంద్ర సంధి దశ “లో కొంతకాలం ఉండి తీవ్ర సాధన చేసాడు.

ఈ దశలో రకరకాల గురువులు అతనికి రకరకాల బోధలు చేశారు. అవేవీ అతనికి తృప్తిని ఇవ్వలేదు. అయినా తన అన్వేషణ మానలేదు. చిట్టచివరికి దేహం-ఆత్మల మధ్య ఉన్న డోలాయమానస్థితి నుంచి బయటపడి బుద్ధ గయలోని బోధివృక్షం క్రింద కూర్చుని .. తన జీవితానికి ఆధారమైన ” శ్వాస మీద ధ్యాస ” వుంచి ఒకరాత్రంతా “ఆనాపనసతి ధ్యానం” చేసాడు.

మొదటి జాములో .. “ఆత్మ అన్నదే సత్యం” అని తెలుసుకున్నాడు. రెండవ జాములో .. “ఆత్మ తన పరిణామంకోసం చేస్తోన్న అనంత యాత్రలో భాగంగానే రకరకాల కర్మఫలితాలను అనుసరించి రకరకాల జన్మలుతీసుకుంటూ సుఖదుఃఖాలను అనుభవిస్తోంది” అని తెలుసుకున్నాడు. మూడవ జాము లో .. “అందుకు నివారణోపాయం .. అష్టాంగ మార్గం” అని కనుగొన్నాడు.

దుఃఖానికి గలకారణాన్నీ మరి దుఃఖనివారణోపాయాన్నీ ఒకే రాత్రిలో కనుగొన్న బుద్ధుడు .. తెల్లవారేసరికి “ఆత్మసూర్యుని” వెలుగులతో కూడిన దివ్యజ్ఞానప్రకాశ సంపన్నుడయ్యాడు !

వెంటనే తాను తెలుసుకున్న సత్యాన్ని “చంద్రవంశదశ” లో ఉండి అనేక రకాల దుఃఖాలకు అనుభవిస్తోన్న మానవాళికి తెలియజేసి .. వారిని కూడా తనలాగే ఆత్మానంద సామ్రాజ్యం అయిన ” సూర్యవంశదశ ” లోకి తీసుకుని రావడానికై .. ఆనాపానసతి ధ్యానాన్ని ప్రచారం చేస్తూ బయలుదేరాడు !

“సూర్యవంశ దశ” లో “ఆత్మ” .. తన దేహధర్మాలపట్ల “సంసారనిర్వహణ” పట్ల శాస్త్రీయమైన ఎరుకతో వుంటుంది ! ఈ దశలో కూడా అన్ని రకాల మానసిక బంధాలూ – అనుబంధాలూ ఉంటాయి కానీ వాటిపట్ల సదా ముక్తస్థితిలో వుంటాం !

ఒకప్రక్క దేహంతో ప్రాపంచిక వ్యవహారాలను చక్కబెట్టుకుంటూనే మరో ప్రక్క ఆత్మ స్పృహతో పైలోకాలకు అనుసంధానం అయివుంటాం !

చంద్రవంశ దశలో వున్న వారికి జీవితం అన్నది కష్టాలూ-సమస్యలమయంగా మరి “చావు” అన్నది అంధకారమయంగా తోస్తే .. సూర్యవంశదశలు వున్న వారికి జీవితం అన్నది ఒక ఆటలా .. మరి “చావు” అన్నది ఇటు నుంచి అటు వెళ్ళే ఒక సహజ ప్రక్రియలా తెలుస్తుంది.

“నేను కేవలం దేహం మాత్రమే కాదు .. దేహంలో వున్న పరబ్రహ్మను” అని తెలుసుకుని ఆ రకంగా జీవిస్తున్న సూర్యవంశస్థులను చూస్తే .. దేహభ్రమచిత్తులుగా పరిమిత జ్ఞానంతో కూడుకుని ఉన్న చంద్రవంశ దశలో వున్న వారికి కపటంగా కనిపిస్తుంది. చంద్రవంశ దశలో వున్నవాళ్ళు ఈ కైలాసపురికి వచ్చి .. ఇక్కడ జరుగుతూన్న నూతన సృష్టినీ, అద్భుత కార్యక్రమాలనూ మరి ఇక్కడ ఉన్నవాళ్ళంతా హాయిగా ధ్యానం చేసుకోడాన్నీ చూసి విశేషంగా ఆశ్చర్యపోతారు.

అదృష్టం బాగుంటే వారు కూడా ధ్యానం చేసి “ఆత్మసూర్య” తత్త్వాన్ని తెలుసుకుని “సూర్యవంశదశ” లోకి చేరుకుంటారు ! ఆత్మజ్ఞాన సత్యాలను తెలుసుకుని తాము కూడా మరింత సాధన చేసి ఆత్మసూర్యుడిలా వెలిగిపోతారు.

“నక్షత్రవంశ దశ”

సత్యం ప్రకటించబడిన తరువాత స్వయంప్రకాశంతో వెలిగిపోతూన్న సూర్యవంశదశలో “ఆత్మసూర్యులం” అయిన మనం “నేను తెలుసుకున్న సత్యాన్ని అందరికీ అందించాలి” అన్న తపనతో అందరినీ వెతుక్కుంటూ బయలుదేరుతాం. అప్పుడు మనకన్నా ఇంకా బాగా ప్రకాశిస్తున్న ఇతర మాస్టర్లను తెలుసుకుంటాం ! సూర్యుని కంటే కూడా కొన్ని వేల రెట్లు ప్రకాశవంతమయిన “నక్షత్ర వంశీయులు” ఎంతగా సత్యాన్ని ప్రకటితం చేస్తూ వుంటారో .. అంతగా వారి ఆత్మ ప్రకాశిస్తూ వుంటుంది. నక్షత్రం వంశీయులుగా ఉండడం అంటే “గ్రాండ్ మాస్టర్” పదవిని పొందినట్లే !

మనస్సు యొక్క ఆధీనంలో వున్న చంద్రవంశీయులు “మిస్టర్” లు .. ఆత్మ సత్యం తెలుసుకున్న సూర్యవంశీయులు “మాస్టర్లు” .. ఆత్మ యొక్క విజయం తెలుసుకున్న నక్షత్రవంశీయులు “గ్రాండ్ మాస్టర్” లు !

నక్షత్రలోకవంశీయులైన “గ్రాండ్ మాస్టర్లు” గా ఎదిగిన తరువాత మనమంతా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మన స్వంత ఇచ్ఛానుసారం కార్యార్థులమై సూక్ష్మశరీరంతో అనేకానేక లోకాలకు వెళ్ళి వస్తూవుంటాం. అక్కడి జ్ఞానంతో ఇక్కడి లోకకల్యాణ కార్యక్రమాలను సమన్వయ పరుస్తూంటాం. ఈ విశాల విశ్వం అంతా కూడా మన స్వంత కుటుంబంలా యెంచి అంకిత భావంతో సకల కర్తవ్యాలనూ నిర్వహిస్తూ .. ఈ భూమి పై నవ్యయుగ స్థాపనకు కృషి చేస్తూంటాం !

పిరమిడ్ మాస్టర్లందరూ కూడా భూలోకానికి విచ్చేసినటువంటి నక్షత్రవంశీయులైన గ్రాండ్ మాస్టర్స్ ! వారందరి లక్ష్యం ధ్యాన-శాకాహార-అహింసామయ ప్రపంచాన్ని ఆవిష్కరించడం ! విస్తృత పిరమిడ్ నిర్మాణాలు గావిస్తూ ఈ భూమండలాన్ని ప్రకాశింపజేయడం ! వారందరికీ అభినందనలు !