ది గ్రేట్ లా ఆఫ్ కర్మ
‘లా’ అంటే ‘సిద్ధాంతం’ … మూలసృష్టి రహస్యానికి సంబందించిన సిద్ధాంతం. మూల సృష్టిలోని కార్యకలాపాలకు సంబంధించిన ధర్మ విశేషం. ‘గ్రేట్’ అంటే ‘గొప్ప’.
“సృష్టిశాస్త్రం” అన్నది కొన్ని అద్భుత ధర్మసూత్రాల అవగాహన మీద ఆధారపడి వుంది. ఎంచేతంటే సృష్టి అన్నది మౌలికంగా ఆయా ధర్మసూత్రాలకు ఆధారంగా రచించబడి వున్నది కనుక. అన్నింటికన్నా గొప్ప సృష్టి రహస్యం “యద్భావం తద్భవతి” అన్న సూత్రం. దీనినే ఇంగ్లీషులో “ది గ్రేట్ లా ఆఫ్ కర్మ” అని అన్నారు.
కర్మసిద్ధాంతం “కారణ కార్య సంబంధాన్ని” బట్టబయలు చేస్తుంది. కారణం లేకుండా ఏ కార్యమూ వుండదు. కారణం ‘భావం’ ; కార్యం ‘భవం’. కారణం కార్యంగా మారడానికి అవసరమైన ధాతువులే దేశకాల పరిస్థితులు + పురుష ప్రయత్నం + ధ్యేయం.
దేశకాల పరిస్థితులే “జగత్తు” ; జగత్తు అన్నది మూల చైతన్య కారణం యొక్క, “ప్రథమ ఇచ్ఛ” యొక్క, తక్షణ రూపాంతరం.
విస్తృత సృష్టి రచనలో ఏ విశేషాలు వున్నాయో, “మానవ సృష్టి” లో కూడా అవే విశేషాలు వున్నాయి. మానవ కార్యకలాపాలలో ఏ విశేషాలు వున్నాయో బ్రహ్మాండమైన సృష్టి విశేషాలలో కూడా అవే వున్నాయి. ఇదే మరొక “గ్రేట్ లా”. అంటే – “ఇక్కడ ఎలా వుందో అక్కడ అలానే వుంది” – అన్న సిద్ధాంతం. ‘ఇక్కడ’ వున్నదానిని విశేషాలను గమనిస్తే ‘అక్కడ’ వున్న విశేషాలను గమనించకనే గమనించవచ్చు.
మానవ జీవితం మానవ మనోసృష్టి. దేశ కాల పరిస్థితులు జగత్ సృష్టి. అంటే ‘విరాట్’ పురుషుని సృష్టి. విరాట్ పురుషుని అంశే మానవుడు. మానవుని శక్తి కూడా అనంతం, అనల్పం. జగత్ సృష్టి మానవ సృష్టికోసం నిర్దేశించబడి వుంది. మానవ సృష్టియొక్క రంగస్థలమే జగత్‌సృష్టి. మానవుని సృష్టి స్వంత మస్తిష్కంలోంచి ఏ క్షణానికి ఆ క్షణం ఉబుకుతుంది. బట్టబయలు అవుతుంది. ఏది భావిస్తే, దేనికి ప్రయత్నిస్తే, అది ‘భవం’ అవుతుంది; అనుభవానికి వస్తుంది. ప్రతి అనుభవం క్రొత్త భావానికి సహజంగానే దారి చూపిస్తుంది. ప్రతిక్రొత్త భావానికీ ‘యత్నం’ ను జోడిస్తే, ‘ఎన్నిక’ ను జోడిస్తే తత్ సంబంధమైన అనుభవాన్ని మళ్ళీ ప్రసాదిస్తుంది. ఇదే “ది గ్రేట్ లా ఆఫ్ కర్మ”.
ఈ విశేషాన్నీ, ఈ సూత్రాన్నీ అర్థం చేసుకున్న వారు ముక్తపురుషులు, బంధరహితులు. ఆనందసాగరంలో మునిగివున్నవారు. తమ ‘ తలా తోకా ‘ తెలిసినవారు. తమ ‘ తలే ‘ తమ ‘ తోక ‘ అనీ తెలిసినవారు. తమ ‘ భావమే ‘ తమ ‘ భవం ‘ అని తెలిసినవారు.
ఈ కర్మ విశేషమూ, కర్మ సూత్రమూ, తెలియనివారు – ముక్తిరహితులు, బంధజీవులు, దుఃఖసాగరంలో మునిగి వున్నారు.