‘సవరణ’ శరణం గచ్ఛామి
ఈ రోజు డా|| శారద గారు ఓ చక్కటి పదం వాడారు. ఆవిడ ఉపయోగించిన పదం చాలా గొప్ప పదం “సవరణ” నేను గత ౩౦ సం||ల నుంచి నన్ను కలిసినవారందరినీ “సవరణ” చేస్తూనే వున్నాను. అందరి మాటలూ, అందరి చేతలూ .. ఇలా ప్రతి విషయాన్ని సవరణ చేస్తూనే ఉన్నాను. ౩౦ సం|| క్రితం నన్ను నేను పూర్తిగా ‘సవరణ’ చేసుకున్నాను మరి అప్పటి నుండి నా దగ్గరకు వచ్చే వారందరినీ ‘సవరణ’ చేస్తున్నాను .. సదా ఇంకా చేస్తూనే వుంటాను.
నన్ను చూడగానే అందరూ”బాగున్నారా?” అంటారు. నేను ఏమైనా రోగిష్టివాడినా? హాస్పిటల్ లో వున్నానా ..”బాగున్నారా?” అని కేవలం రొగులనే, అస్వస్థతులనే అడుగుతారు. ఓ బుద్ధుడిని ఎవరైనా “బాగున్నారా?” అని అడుగుతారా?
అందుకే “నీ బుద్ధి మందగించింది” అని వారి మాటలను ‘సవరణ’ చేసి సరిచేస్తాను
నా దగ్గరికి వచ్చినవాళ్ళను రాగానే, “ఏమిటి స్వామీ సంగతులు?” అని అడుగుతాను.
“మీరే చెప్పండి సార్” అంటారు. “నన్ను చెప్పమని అంటావేమిటి? నేను ‘ఏమిటి సంగతి?’ అన్నప్పుడు నీ విషయాలు చెప్పాలి” అన్నప్పుడు పళ్ళన్నీ బయటపెట్టి వెకలిగా నవ్వుతారు. అదేం చోద్యమో నాకూ అర్థం కాదు. గురువుల దగ్గరికి వచ్చి ఆ వెకిలి నవ్వు ఏమిటో? నాకు మా చెడ్డ చిరాకు వస్తుంది వెకిలిగా నవ్వడాన్ని ‘సవరణ’ చేసి సరిచేస్తాను.. అది సరికాని ప్రవర్తన.
మీ ఆలోచనలు ఎలా వున్నా .. ఎంత మూర్ఖంగా వున్నా .. నాకు అనవసరం. మీ ఆలోచనలు ఎదుటి వారికి చెడు చెయ్యవు. మీ మూర్ఖపు చేష్టలు మాత్రం ఇతరులకు ఇబ్బంది కలిగిస్తాయి. మీ అజ్ఞానపు మాటలు ఇతరులకు చెడు చేస్తాయి .. కనుక వెంటనే నేను మీ మాటలను ‘సవరణ’ చేసి తీరుతాను. మీ చేష్టలను సవరణ చేస్తాను.
ప్రతిసారీ ధ్యానం క్లాసుకు తల్లులందరూ పిల్లల్ని తీసుకుని వస్తారు. క్లాసు ప్రారంభమైతే చాలు పిల్లలు ఏడుపులు. చిన్న పిల్లల ఏడుపు వింటే నాకు చాలా కోపం వచ్చేస్తుంది. పిల్లల్ని పార్కుకి తీసుకువెళ్ళాలే కానీ ధ్యానం క్లాసులకి తీసుకురాకూడదు. తల్లి కళ్ళు మూసుకుంటుంది మరి ఆ చిన్న పాప ప్రక్కవాళ్ళని ఇబ్బంది పెడుతూ వుంటుంది. చిన్నపిల్లలను చూస్తే చాలు వెంటనే ఆ తల్లిని బయటికి పంపేస్తాను. అలా వాళ్ళను ‘సవరణ’ చేస్తాను.
ధ్యానం క్లాసుకు వస్తారు .. సెల్ ఫోన్లు మ్రోగుతాయి .. ప్రక్కన వంగి మాట్లడుతూ తోటివారి ఇబ్బందిని పెడతారు “ఇక్కడ కూడా వ్యాపారమేనా?” అని వెంటనే ‘సవరణ’ చేస్తాను. ధ్యాన సభలలో తోటి వారిని ఇబ్బంది పెట్టేవారంటే నాకు మా చెడ్డ కోపం .. అది కూడా ‘సవరణ’ చేయాలి.
కొంత మంది వేదిక ముందువరసలో కుర్చీలలో కూర్చుని కాళ్ళు ఊపుతూ వుంటారు. వేదిక పైన కూర్చుని నేను సందేశం ఇస్తూవుంటాను .. మరి వాళ్ళ కాళ్ళు అలా ఊపుతూ నన్ను ఇబ్బంది పెడతారు .. ఇక నేను వెంటనే వాళ్ళని ‘సవరణ’ చేస్తాను.
వంట వండే విధానం, వడ్డించే విధానం, భోజనం తినే విధానం, ఇంటికి వచ్చిన వారిని ఆదరించే విధానం, నలుగురిలో వున్నప్పుడు మాట్లాడే విధానం, ఇతరత్రా చెప్పే విధానం, ఇతరులు చెప్తున్నప్పుడు వినే విధానం .. ఇలా అన్నింట్లోనూ ప్రొద్దున్న లేచిన దగ్గర్నుంచి ప్రొద్దు గ్రుంకేవరకు నా డ్యూటీ ‘సవరణలు’ చేయడమే.
నాకు ‘కంప్లైంట్స్’ అంటే మా చెడ్డ చిరాకు. ఎవరైనా ఇతరుల మీద కంప్లైంట్స్ తీసుకువచ్చారు అంటే .. నేను వెంటనే ఆ కంప్లైంట్లు తెచ్చినవారిని సరిచేస్తాను. పాజిటివ్ మాటలే మాట్లాడాలి .. మరి పాజిటివ్ మాటలే వినాలి.
నా దగ్గరకు వచ్చిన ప్రతి వారికీ కరచాలనం ఇస్తాను. వెంటనే వాళ్ళు నా కాళ్ళకు మ్రొక్కుతారు. ఏం బానిస బ్రతుకులో తెలియదు వాళ్ళు మ్రొక్కితే .. నేను వాళ్ళకు మళ్ళీ మ్రొక్కాలి ఎందుకంటే వారూ ఆత్మపదార్థమే మరి నేను కూడా ఆత్మ పదార్థమే కదా వారు దేవుడే నేనూ దేవుడే .. వాళ్ళు మ్రొక్కితే అప్పటివరకు హాయిగా కూర్చున్ననేను.. లేచి వాళ్ళ కాళ్ళకు మ్రొక్కాలి.
అది సరికాదు ; ఇలా కాళ్ళకు మ్రొక్కడం నాకు ససేమిరా ఇష్టం వుండదు. కాబట్టి నేను ఇది కూడా ‘సవరణ’ చేస్తూ ఉంటాను.