స్పిరిచ్యువల్ సైన్స్ – ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం
“మానవ మనస్సు” వేరే .. “మానవ జీవితం” వేరే
“మానవ మనస్సు” చుట్టుప్రక్కల సమాజం నుంచీ మరి చుట్టుప్రక్కల వాతావరణం నుంచీ ఉద్భవిస్తుంది
అంతేకాక అది భౌతికశరీరానికి చెందిన “జ్ఞానేంద్రియాల చట్రం” లో కూడా
అధికంగా తిరుగుతూ వుంటుంది
అంటే మనం ఏది ఎక్కువగా చూస్తామో .. ఏది ఎక్కువగా వింటామో ..
ఏది ఎక్కువగా రుచి చూస్తామో .. వాటి చుట్టే మన మనస్సు ఎక్కువగా పరిభ్రమిస్తూ వుంటుంది
అయితే “మానవ జీవితం” మటుకు గత జన్మల కర్మల మూలాల్లోంచి ఉద్భవిస్తుంది
ప్రస్తుత వర్తమాన జీవితం .. గత జన్మల “తరువాతి పుట” యే కనుక
“అంతకు ముందున్న పుటలు” అర్థం కాకపోతే “వర్తమాన పుట ” అర్థం కాజాలదు!
“మానవ ఆత్మవత్ – జీవితాన్ని” అర్థం చేసుకుంటేనే “మానవ మనస్సు” మీద ఆధిపత్యం లభిస్తుంది
ప్రతి మానవ జీవితం కూడా ఉపరితల లోకాల్లో ఉన్న ..
ఆత్మతలాల్లో వున్న .. “మూలాత్మ” యొక్క
“మరొక విహారయాత్ర ” గా, “మరొక విజ్ఞాన యాత్ర” గా అర్థం చేసుకున్నప్పుడే
మనస్సు యొక్క తీవ్రతర ప్రభావం నుంచి మనం క్షేమంగా, సురక్షితంగా బయటపడగలుగుతాం!
వాస్తవానికి ఇహలోకంలో తాత్కాలికంగా జీవిస్తూన్న “ఆత్మలోకవాసులమే” మనం
వాస్తవానికి ఇహలోకంలో భౌతికకాయంలో నివసిస్తున్న ఒకానొక “సనాతన మూలాత్మ” యే మనం
అనేకానేక జన్మల కర్మల, కర్మఫలాల సంస్కారాల జనిత సంకల్పాల ప్రభావాలతో కూడినదే
“ఈ వర్తమాన జీవితం”
రకరకాల వైవిధ్యాలతో నిండి వున్న “మూలాత్మ” యొక్క అసలైన తలాల్లోంచి
ప్రభవించిన ప్రతి వర్తమాన మానవ జీవితం ఒక త్రాసులోనూ ..
మరి మానవుల సగటు సామాజిక, మానసిక సామూహిక క్షేత్రం మరొక త్రాసులోనూ ..
ఈ రెంటికీ మధ్య అంతులేని సమరం!
“మనస్సు” యొక్క రకరకాల సంఘర్షణలలోంచి ..
“మనస్సు” యొక్క నిరంతర ఊగిసలాటలోంచి
ఎగిసిపడుతోన్న ఎడతెరిపి లేని ఉత్తుంగ తరంగాల భీకర సాగర స్థితిలోంచి
క్షేమంగా, సురక్షితంగా బయటపడాలంటే
“మానవ ఆత్మ – జీవితం” గురించి అర్థం చేసుకోవాలి
అందుకుగాను ప్రతి మానవుడు “ఆత్మశాస్త్రం”, ఆధ్యాత్మిక విజ్ఞానశాస్త్రం”
“ధ్యానశాస్త్రం” .. ఇత్యాది గురించి విధిగా తెలుసుకుని తీరవలసిందే!
మన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా ఆవిర్భవించిన
“జతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు (IFSS)” ద్వారా
“స్పిరిచ్యువల్ సైన్స్” ను .. “ఆధ్యాత్మిక శాస్త్రాన్ని” .. మనం దేశవ్యాప్తం, ప్రపంచవ్యాప్తం చేస్తున్నాం
ఈ దిశగా విస్తారంగా పనిచేస్తోన్న మన విశిష్ట పిరమిడ్ మాస్టర్లకు విశేష అభినందనలు!
ఇప్పటికే అయిదు ప్రపంచ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు (GCSS) లను
బెంగళూరు, పిరమిడ్ వ్యాలీ, లో నిర్వహించుకున్నాం!
ఇప్పటికే ఏడు జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు (IFSS)లను
దేశవ్యాప్తంగా .. ఏడు నగరాలలో .. నిర్వహించుకున్నాం!
ప్రతి ఒక్కరూ మానవ ఆత్మ- జీవితాన్ని ఇక అవగాహన చేసుకుందురు గాక
ప్రతి ఒక్కరూ మనస్సు మీద విజయాన్ని ఇక పుష్కలంగా పొందుదురు గాక
ప్రతి ప్రాపంచిక మేధావి కూడా ఇక ఒక ” స్పిరిచ్యువల్ సైంటిస్ట్ ” గా అవుగాక