ఐదు రకాల దుఃఖాలు
“మనం మన తోటి వారితో కలిసి మెలిసి జీవిస్తూవుంటాం. మన ప్రక్కవారి మొహం చూస్తూ రోజంతా గడిపేస్తాం. అందరినీ అభినందిస్తాం. అందరితోనూ కూడి వుంటాం. పైకి ఎంతో బాగున్నట్లుగా అనుకుంటాం. అయితే మనలో మాత్రం అశాంతి, అభద్రత, ఏదో తెలియని వెలితితో జీవిస్తూ వుంటాం. ఒక ఇంగ్లీష్ సామెత వుంది.”
“Face is the index of the Mind”
ముఖం మన మనస్సు యొక్క దర్పణం. ముఖకవళికలు మన స్థితిని తెలియస్తాయి. నోటిలోని మాటలు మన ఆత్మస్థితిని తెలియజేస్తాయి. కనుక మన ముఖకవళికలను బట్టి మనలోని ఆందోళనలు, గందరగోళం తెలుసుకోవచ్చు. ఎవరినైనా కదిలించి “ఏమిటి స్వామీజీ?” అని పలుకరిస్తే “ఏమోనండి! ఏదో దిగాలుగా వుంది. నాకు ఏమీ తెలియడం లేదు” అని ముఖాన్ని దీనంగా పెడతారు. అయితే, ధ్యానం చేసేవారి ముఖారవిందం కళకళలాడుతూ వుంటుంది! ప్రతిరోజూ పిరమిడ్‌లో ధ్యానం చేసేవారి ముఖం ఎంతో కాంతివంతంగా వెలిగిపోతూ వుంటుంది! వారి ముఖం ఇంకా ఇంకా చూసి చెప్పవచ్చు ఎంత సంతోషంగా వున్నారో!
గౌతమబుద్ధుడు తన నాలుగు ఆర్య సత్యాలలో .. “ప్రపంచం అంతా దుఃఖంలో వుంది”. ప్రపంచంలోని మనుష్యులు ముఖాలలో దుఃఖం తాండవిస్తోంది. ఎవరి ముఖం చూసినా దుఃఖమే, అశాంతే! ఎవరి ముఖంలోనూ సంతోషం కనిపించడం లేదు. అందుకే “ప్రపంచం అంతా దుఃఖమయం” అన్నారు.
గౌతమ బుద్ధుడు ఐదు రకాల దుఃఖాల గురించి చెప్పాడు.
* రోగం వస్తే దుఃఖం.
* ముసలితనం వస్తే దుఃఖం
* చావు వస్తే దుఃఖం
* మనకు కావలసినవి రాకపోతే దుఃఖం
* మనకు అవసరం లేనివి మన దగ్గర వుంటే దుఃఖం
ఇలా ఐదు రకాల దుఃఖాల గురించి ఆయన వివరించాడు.
ఎవరైతే ధ్యానం చెయ్యరో, ఎవరైతే శాకాహారులు కారో, ఎవరైతే హింసలో వుంటారో .. వారందరికీ ఈ ఐదు రకాల దుఃఖాలు వుంటాయి. ధ్యానం చేసేవారికి, ఆత్మజ్ఞానులకు ముసలితనం రాదు, చావు లేదు. కనుక దుఃఖం కూడా వుండదు.” అని బుద్ధుడు తెలుసుకున్నాడు. దుఃఖానికి కారణం అత్యాశ. ఉన్నది సరిపోలేదు అనుకునేవారు లేనిది కోరుతారు, అత్యాశకు పోతారు ” ఎందుకంటే ఉన్నదానిలో తృప్తిలేదు. అత్యాశే దుఃఖానికి హేతువు. అత్యాశకు మూలం అజ్ఞానం, అవిద్య.
పిరమిడ్ మాస్టర్లు అవిద్యనుంచి విద్యలోకి; తృష్ణ నుంచి తృష్ణ రాహిత్యంలోకి; దుఃఖం నుంచి ఆనందంలోకి వచ్చారు. ధ్యానం చేసి దుఃఖాన్ని పోగొట్టుకున్నవారే పిరమిడ్ మాస్టర్లు! పిరమిడ్ మాస్టర్లకు అభినందనలు! ‘చావు లేదు’ అని తెలుసుకుని జ్ఞానంలో జీవిస్తున్నవారు మాస్టర్లు! మాస్టర్ అయితే నో దుఃఖం, నో అత్యాశ, నో తృష్ణ!
చిన్నప్పుడు చదువుకున్నాం “అలెగ్జాండర్ ది గ్రేట్” అని. అలెగ్జాండర్ ఎన్నో యుద్ధాలు చేసి, ఎందరినో కొల్లగొట్టి ఎంతో సంపద మూటకట్టుకుని తన వూరికి వెళ్తూ మార్గమధ్యలో పర్ష్యాలో ఆగి “ఇక్కడ చూడదగినవి ఏమైనా వున్నాయా?” అని అడుగుతాడు. “అయ్యా! ఇక్కడికి దగ్గరలో ఒక ముసలివాడు వుంటున్నాడు. ఓ చెట్టు క్రింద కూర్చుంటాడు. నాలుగు దిక్కులలో నాలుగు కుక్కలు కూర్చుని వుంటాయి. అతను చాలా గొప్పవాడు” అని చెబుతారు.
“ఓహో! అలాగా! అయితే వెళ్ళి వాడిని తీసుకురండి” అంటాడు. ఊరి పెద్దలు “ఆయన రారండి! మనమే వెళ్ళాలి” అంటే అలెగ్జాండరు వెళ్ళతాడు. ఆయన తేరిపార చూసి అడుగుతాడు. “ఏమిటి నీ గొప్ప! ఏం సాధించావు జీవితంలో?” అని అడుగుతాడు. “నేను ఎన్నో యుద్ధాలు చేసాను, ఎంతో గడించాను, ఆ గడించిన దానితో నా రాజ్యానికి వెళుతున్నాను’ అంటాడు. “వాటితో ఏం చేస్తావు?” అని అడుగుతాడు. జీవితంలో కావలసినవన్నీ అనుభవించి బాగా ఆనందంగా వుంటాను అంటాడు అలెగ్జాండర్! అందుకు ఆ ముసలివాడు “ఏ యుద్ధాలు చెయ్యకుండానే మరి నేను ఆనందంగా వున్నాను” అంటాడు. ఆయన పేరే డయోజినీస్!
మై డియర్ ఫ్రెండ్స్! చివరి క్షణంలో అలెగ్జాండర్కి జ్ఞానోదయం అయింది. అందుకే తాను చనిపోయేటప్పుడు శవపేటికలోంచి తన రెండు చేతులు పైకి చూపించి “అలెగ్జాండర్ బిక్షగాడిగా చనిపోతున్నాడు” అని తన సందేశం ఇచ్చాడు. జీవితపు చివరి అధ్యాయంలో జ్ఞానోదయం కలగడం కాదు- ఇప్పుడు ఈ క్షణంలోనే జ్ఞానోదయం కలగాలి!
బుద్ధుడు అయినవాడే “ఈ క్షణమే ఆఖరి క్షణం” అని జీవిస్తాడు. రక్తపాతం సృష్టించిన అలెగ్జాండర్, హింస చేసినవాడిని “గ్రేట్” అని ఎలా అంటాం? “వరస్ట్” అంటాం. అంతేకానీ రక్తపాతం సలిపేవాడు “గ్రేట్” కాజాలడు.
“కనుక ధ్యానం గ్రేట్ ..
పిరమిడ్ మాస్టర్ గ్రేట్ ..
బుద్ధుడు గ్రేట్ ..”
“ఒక మహత్తరమైన ప్రక్రియతో శారీరక ఆరోగ్యం చేకూరటం అనేది ఎంతో గొప్ప విషయం. నాదంతో కూడిన ధ్యానం వలన ఒక ప్రకంపన కలిగింది. ఈ శబ్ద తరంగాలు మన ధ్యానప్రక్రియకు మరింత గాఢతను చేకూర్చాయి. శ్వాస మనతో నిరంతరమూ వుంది. దానిని ఎప్పుడైనా, ఎక్కడైనా గమనించవచ్చు. ప్రయాణం చేసేటప్పుడైనా చెయ్యవచ్చు. ఏ ఖర్చూ లేదు; ప్రయోగశాలలో వివిధ రసాయనిక ప్రక్రియలలాగా మన శరీరంలో వివిధ ప్రక్రియలు జరుగుతాయి. వాటికి ఆధారం శ్వాస. మన శరీరంలో జరిగే జీవక్రియలన్నింటినీ అదుపు చేసే ప్రక్రియే ధ్యానం. ధ్యానం శరీరపు మెటబాలిక్ వ్యవస్థను సరిచేస్తుంది. అది అసంకల్పిత చర్యలు అన్నింటినీ అదుపు చేస్తుంది. దానితో మెదుడు పని తీరు మెరుగవుతుంది. మెదడు నుంచి సరైన సంకేతాలు అంది అన్ని రకాల వ్యాధులూ అదుపుచేయబడతాయి. ఆరోగ్యం చేకూరుతుంది.
“దీనికి కావలసింది శ్వాస మీద ధ్యాస. మనం తీసుకునే ఆహారపదార్థాలు మన శ్వాసలోని ఆక్సిజన్‌తో కలిసి శక్తిని విడుదల చేస్తాయి. మనం శక్తిని పొందటానికి శ్వాసే ముఖ్యం. దాని మీద ధ్యాస మరింత శక్తిని ఇచ్చి శరీరపు పనితీరును మెరుగుపరుస్తుంది.” అని శాస్త్రీయంగా నిర్ధారించగలం. నేను ఒక వైద్యునిగా దీనిని చెప్తున్నాను. శ్వాస మీద ధ్యాసతో అందరూ సంపూర్ణ ఆరోగ్య, ఆనందాలతో విలసిల్లవచ్చు.
బ్రహ్మర్షి పత్రీజీ తమ సందేశంలో .. “మనకు ఏడు శరీరాలు ఉన్నాయి. అవి. 1. అన్నమయ కోశం, 2. ప్రాణమయ కోశం, 3. మనోమయ కోశం, 4. విజ్ఞానమయ కోశం, 5. ఆనందమయ కోశం, 6. విశ్వమయ కోశం, 7. నిర్వాణమయ కోశం. “
“భౌతికశరీరం .. అంటే అన్నమయకోశానికి .. ఆధారం ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశానికి ఆధారం మనోమయకోశం, మనోమయకోశానికి ఆధారం విజ్ఞానమయకోశం, విజ్ఞానమయకోశానికి ఆధారం ఆనందమయకోశం, ఆనందమయకోశానికి ఆధారం విశ్వమయకోశం, విశ్వమయకోశం, విశ్వమయకోశానికి ఆధారం నిర్వాణమయకోశం. ఈ విధంగా మనం ఏడు శరీరాల సముదాయం.
“వాటన్నింటి గురించీ తెలుసుకున్నప్పుడు మాత్రమే మన గురించి మనకు అవగాహన, ఆరోగ్యం, సంపూర్ణ జ్ఞానం లభిస్తుంది. ఏడు శరీరాలనూ తెలుసుకుంటేగానీ జీవితం అర్ధం కాదు. వాటి గురించి తెలుసుకోవాలంటే థియోసాఫికల్ సొసైటీ వారి పుస్తకాలు చదవాలి. వాటినన్నింటినీ చదివి నేను అదంతా తెలుసుకున్నాను. H.P.బ్లావాట్స్కీ గొప్ప యోగీశ్వరురాలు. మూడవ కన్ను, సూక్ష్మశరీరాలు, ఊర్ధ్వలోకాల గురించి విశేషంగా పరిశోదనలు చేసిన బ్రహ్మజ్ఞాని కల్నల్ ఆల్కాట్తో కలిసి ఆవిడ థియోసాఫికల్ సొసైటీ స్థాపించారు. వీరి ముఖ్యకేంద్రం చెన్నైలోని అడయార్‌లో వుంది. వీరితో పాటు లెడ్ బీటర్, అనీబిసెంట్ వారు థియోసాఫికల్ సొసైటీ నుంచి అమోఘమైన జ్ఞానాన్ని అందించారు. ఈ ఏడు శరీరాల గురించి తెలుసుకోవడానికి థియోసాఫికల్ సొసైటీ పుస్తకాలు అధ్యయనం చెయ్యండి. ఈ ప్రాతఃకాల సందేశం థియోసాఫికల్ సొసైటీకి అంకితం” అన్నారు.