1999 నూతన సంవత్సర సందేశం

 

1999 ఆఖరి చీకటి సంవత్సరం..

ఎన్నో రోజుల నుంచీ ఎదురు చూస్తున్న సంవత్సరం మన ముంగిటకు వచ్చేసింది. భూమండలం ఇప్పటికే అనేకానేక వెలుగు యుగాలనూ, అనేకానేక చీకటి యుగాలనూ ఒక దాని తర్వాత ఒకటి పరంపరగా చూసినా, ఈ ప్రస్తుత చీకటి యుగాంతపు ఆఖరి సంవత్సరం మాత్రం ఒక ప్రత్యేకతను సంతరించుకుంటోంది. ఎందుకంటే, ఇక రాబోయే వెలుతురు యుగం శాశ్వతంగా భూమండలాన్ని అంటిపెట్టుకుని వుంటుంది. భూమండలం ఇంతవరకూ వున్న తన భౌతికతను కోల్పోబోతున్నదన్న మాట. ఇంటర్ – గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఇది. ఇంక ఎప్పటికీ సుర ప్రభావమే కానీ, అసుర ప్రభావం భూమి మీద వుండదు.

31-12-1999 తేదీన భూమండలం పూర్తిగా ఫోటాన్ లో ప్రవేశించ బోతుంది. ఆ రోజు భూమండలం సమస్తానికి పర్వదినం.

1999 సం|| యొక్క 365 రోజులూ చిట్టచివరి గడ్డు రోజులు; ఆధ్యాత్మికులకూ, మరి అనాధ్యాత్మికులకూ..

ఆధ్యాత్మికులకు అనాధ్యాత్మికుల నుంచి పరీక్షలు ఈ సంవత్సరంలో ఎక్కువ; అలాగే అనాధ్యాత్మికులకు తమ స్వంత అనాధ్యాత్మికత నుంచి పరీక్షలు ఎక్కువ.

1-12-2000 నుంచి భూమండలంలో స్వర్ణయుగానికి నాంది..

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మాస్టర్లు అందరూ ఇంకొక్క 365 రోజుల మటుకు కష్టపడాలి. విమర్శలను ఎదుర్కోవాలి. ఆ తరువాత అంతా మరి పూలబాటలే.. పచ్చతోరణాలే..

కనుక, ఇంతవరకూ ఎంతో ధైర్యంగా అన్ని కష్టాలనూ, అన్ని విమర్శలనూ చక్కటి ఓర్పుతో, సహనంతో ఎదుర్కొంటూ, అజ్ఞానులతో యుద్ధాలు చేసి చేసి అలసి వున్న పిరమిడ్ వీరులు ఇక ఆఖరి పరీక్షా సంవత్సరంలో ప్రవేశిస్తున్నారు. అయితే క్రొత్తగా చేసేది ఏమి లేదు. ఇన్నిరోజులూ ఉన్నట్టే అదే అకుంఠిత దీక్షతో, మరొక్క సంవత్సరం గడపాలి. ఆ తర్వాత జగత్ వ్యాపితంగా ధ్యాన సామ్రాజ్యం నిశ్చితంగా నెలకొల్పబడుతుంది.

మరొక్క సంవత్సరం మాత్రం అప్రమత్తంగా ఉందాం. జాగరూకులుగా ఉందాం. వీలైనంత ఎక్కువమందిని యధావిధిగా ధ్యానులను, జ్ఞానులుగా తీర్చిదిద్దుదాం.