“పిరమిడ్ ధ్యానుల ఆదర్శ సూత్రాలు”
1. సరియైన ధ్యానం చేయటం : అందరి చేతా సరియైన ధ్యానాన్నే చేయించడం
మనం ఏది సాధించాలనుకున్నా మనకు ఉండవలసింది దాని మీద పూర్తి అవగాహన ! సరియైన అవగాహనతో చేసే సాధనలోనే పూర్తి ఫలితం దాగి వుంటుంది. ” శ్వాస మీద ధ్యాస ” ద్వారా ” ఆలోచనా రహితస్థితి ” ని చేరుకున్న క్షణంతోనే ఆత్మజ్ఞాన ఉషోదయమౌతుంది. ” ఇదే సరియైన ధ్యానం ” అని శ్వాస మీద ధ్యాస ప్రయత్నం చేసిన ప్రతి ముముక్షువుకూ … వెంటనే అర్థమయి తీరుతుంది. మరి సత్యం అవగతమైన వెంటనే సమస్త లోకాలకూ విజయ రహస్యం ఎలుగెత్తి చాటాలనిపిస్తుంది. అదే ” ధ్యానప్రచారం ” పేరుతో ప్రతి పిరమిడ్ మాస్టర్ చేసే పని !
2. సరియైన ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం : అందరిచేతా సరియైన పుస్తకాలనే చదివించడం
” సరియైన ధ్యానం ” తో పండిన ధ్యానుల, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల అనుభవసారానికి ప్రతిరూపాలే సరియైన ఆధ్యాత్మిక పుస్తకాలు. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మాస్టర్లకు ఈ ” స్వాధ్యాయం ” అన్నది అత్యంత ముఖ్యమైనది. ముఖ్యంగా అనీబీసెంట్, లెడ్‌బీటర్, థియోసోఫికల్ సొసైటీ పుస్తకాలు .. అలాగే మరి లోబ్‌సాంగ్ రాంపా, స్వామి రామా, యోగానంద పరమహంస, ఎక్కిరాల కృష్ణమచార్య, దీపక్ చోప్రా, లిండా గుడ్‌మాన్, షెర్లీ మెక్‌లీన్, జేన్ రాబర్ట్స్, రిచార్డ్ బాక్, కార్లోస్ కాస్టానెడా, రూత్ మాంట్‌గోమెరీ పుస్తకాలు .. ఇంకా ఎందరో, ఎందరో మాహానుభావులు! అందరి ఉద్గ్రంధాలకూ వందనాలు !
మనం స్వయంగా ” స్వాధ్యాయ అభ్యాసం ” చేస్తూ మరి అందరిచేతా కూడా ఇలాంటి పుస్తకాలనే చదివించాలి. ” ఓల్డ్ ఏజ్ మాస్టర్స్ ” ను కొంత వదిలిపెట్టేసి ” న్యూ ఏజ్ మాస్టర్స్ ” పుస్తకాలను మనం కొంత ఎక్కువగా చదవాలి .. చదివించాలి. ఎందుకంటే అధునాతన మాస్టర్లు సనాతన యోగులకన్నా మరింత విస్తృత శాస్త్రీయపరమైన జ్ఞానాన్ని కలిగివున్నవారు కనుక.
3. ధ్యానానుభవాలను పరస్పరం పంచుకోవడం : సజ్జనసాంగత్యం విధిగా చేయడం
” సజ్జన సాంగత్యం ” అంటే ” సత్యం తెలుసుకున్న మాస్టర్లతో సాంగత్యం ! ” ధ్యానంలో రకరకాల ధ్యానానుభవాలు వస్తాయి. శరీరం తేలికగా అయిపోవడం .. శరీరం బరువుగా కావడం .. మరి అనేక రంగులు కనపడడం .. విపరీతమైన వెన్నునొప్పి రావడం .. లోపల ఇంకొక శరీరం ఊగిసలాడుతున్నట్లు అనుభవానికి రావడం .. ఎక్కడికో ఎగిరిపోతున్నట్లు మీకు తెలియడం .. అనేక ప్రకృతి దృశ్యాలు కనపడడం .. కొండలు, కోనలు, లోయలు .. ఆ తరువాత మనకు గురువులు కనబడతారు. మరి ఆ యా గురువులతో మనం సంభాషిస్తాం ; వాళ్ళ దగ్గర ఎన్నో సందేశాలు తీసుకుంటాం .. ఇలాంటి అనుభవాలన్నీ మనకు కలిగితే తోటి ధ్యానులతో పంచుకోవాలి ; తోటి ధ్యానులకు కలిగితే తోటి ధ్యానుల దగ్గర శ్రద్ధగా కూర్చుని ఆ యా అనుభవాలను వినాలి.
అంతేకాకుండా ఈ యొక్క ధ్యానసాధన ద్వారా సీనియర్ ధ్యానులు వాళ్ళు వాళ్ళ జీవితాలలో ఎలాంటి పెను మార్పులు సాధించారో .. మరి మందులు ఎలా ఎలా మానేశారో .. మరి జీవితాలలో చెడు అలవాట్లు ఎలా ఎలా పోయాయో .. మరి మంచి దృక్పథాలు ఎలా ఎలా వచ్చాయో .. వారి జీవిత గమ్యం ఎలా సుగమమైందీ .. ఈ విధంగా వారి యొక్క జీవన క్రియలో, జీవితంలో కలిగిన మౌలికమైన మార్పుల గురించి కూడా మనం వినడం .. దాన్నే ” సజ్జనసాంగత్యం ” అంటాం.
ధ్యానం ఎంత ముఖ్యమో .. ” స్వాధ్యాయం ” ఎంత ముఖ్యమో .. ” సజ్జనసాంగత్యం ” అన్నదీ అంతే.
4. వీలయినంత వరకూ మౌనాన్ని అలవరచుకోవడం : ప్రజల్పరాహిత్యం అన్న దానిని అభ్యసించడం
అందరూ విధిగా మౌన సాధన చేయాలి. ధ్యాన సాధన అన్నది ఎలాగో .. ” మౌన సాధన ” అన్నది కూడానూ అలాగే మౌలికం. వారానికి ఒక రోజో, రెండు రోజులో, రోజుకి రెండు గంటలో మూడు గంటలో నాలుగు గంటలో మౌనదీక్ష వహించాలి. మౌనం గురించి .. మౌనంగా వుంటేనే తెలుసుకుంటాం. ధ్యానం గురించి ధ్యానం చేస్తేనే తెలుసుకుంటాం. మౌనంలో అపారమైన శక్తి మనకు ఆదా అవుతుంది. మౌనం చేసినప్పుడు తెలుస్తుంది మనం మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఎన్ని వృథా మాటలు మాట్లాడుతున్నామో !
” ప్రజల్పం ” అంటే ” పనికిరాని మాటలు మాట్లాడటం ” .. ” ఉబుసుపోక కబుర్లతో సమయాన్ని వృథా చేయడం ” మరి ” ప్రజల్ప రాహిత్యం ” అన్నది పిరమిడ్ మాస్టర్లకు చాలా చాలా ప్రధానమైన విషయం.
5. పౌర్ణమి రోజుల్లో విశేషంగా ధ్యానం చేయడం
ధ్యానులకు ప్రతి పౌర్ణమి కూడా ఒక ఖగోళవింత! మన భూమిమీదకు విశ్వశక్తి తీవ్రతలు విపరీతంగా ఉండే పౌర్ణమి రోజులను ధ్యానం కోసం విశేషంగా వినియోగించుకోవాలి ; విశేషమైన, ధ్యాన అనుభవాలను సొంతం చేసుకోవాలి. పౌర్ణమి రాత్రుల్లో ఎవ్వరూ ఇళ్ళల్లో వుండకూడదు .. ఎవ్వరూ నగరాల్లో ఉండకూడదు .. నగరం బయటికి పోవాలి .. చక్కగా ప్రకృతితో సామీప్యం చేయాలి .. అక్కడ అద్భుతమైన ధ్యానం చేయాలి .. పౌర్ణమిధ్యానం మూడింతలు అధికంగా శక్తివంతమయిన ధ్యానం.
6. వీలయినప్పుడల్లా ‘ పిరమిడ్ శక్తి ’ ని ధ్యానం కోసం వినియోగించుకోవడం
ప్రతి ఒక్కరిలోనూ దాగివిన్న అద్వితీయ శక్తులను బయల్పరచడానికి ” పిరమిడ్ ” అసలైన ఉత్ప్రేరకంగా ఉపకరిస్తుంది. ధ్యానంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని అనుకునే ప్రతివారూ పిరమిడ్‌ను పరిశోధనాత్మకంగా పరిశీలించి దాని అవసరాన్ని సంపూర్ణంగా గుర్తించాలి.
” గ్రేట్ పిరమిడ్ ” అనేది ఈజిప్ట్‌లో ఇతరగ్రహాంతర వాసులు .. సుమారు 10,000 సంవత్సరాల క్రింద కన్నా పూర్వమే .. ధ్యానం కోసమే కట్టించారు ! కర్నూలు ” బుద్ధా పిరమిడ్ ధ్యానకేంద్రం ” అన్నది మొట్టమొదటి భారతదేశపు పిరమిడ్ ధ్యాన కేంద్రం ! ఇప్పుడు ఎన్నో పిరమిడ్ ధ్యానకేంద్రాలు వచ్చాయి. మరి పిరమిడ్‌లను టోపీల్లా చేసుకుని మనం ధ్యానం చేసుకోవచ్చు. అలాగే ఇళ్ళపై ” రూఫ్ టాప్ ” లో మనం పిరమిడ్ లను కట్టుకోవచ్చు.
ఇక రాబోయే కాలాల్లో ఎక్కడ చూసినా పిరమిడ్లే వుంటాయి ! ఎంత తొందరగా ” పిరమిడ్ సంస్కృతి ” లో ప్రవేశిస్తే అంత తొందరగా మనం అసలు సిసలైన ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులమవుతాం!
7.అల్లోపతి మందులు ఏ మాత్రం వాడకపోవడం: వాటిని పూర్తిగా వ్యతిరేకించడం
ఏదైనా రోగం వస్తే ఎవరికి వారు తమ స్వంత ఆత్మశక్తిని ఉపయోగించే నయం చేసుకోవాలి. ఏ శారీరక సమస్యనైనా మన అంతర్ జ్ఞానాన్ని అనుసరించి నయం చేసుకునే నైపుణ్యం కలిగి ఉన్నప్పుడు మందుల మీద .. అదీ .. అల్లోపతి మందుల మీద .. ధ్యానులు అయినవారు అస్సలు ఆధారపడరు !
ప్రతి చిన్న సమస్యకూ … డాక్టర్ల మీదా .. మందుల మీదా ఆధారపడకుండా తమ ” స్వంతధ్యానశక్తి ” మీద నమ్మకం వుంచేలా తమ తోటి వారిని తీర్చిదిద్దడమన్నది నిజమైన సామాజిక సేవ ! ఆ సేవలో పిరమిడ్ మాస్టర్లు పరమ నిష్ణాతులు !
8. ఏ మాత్రం మాంసం తినక పోవడం : దానిని పూర్తిగా వ్యతిరేకించడం
శాకాహారి కాకుండా ఎవ్వరూ ” మానవత్త్వం వున్న మానవుడు ” కాలేరు ! కనుక శాకాహారి కావడమనేది చాలా మౌలికమైన సూత్రం. ” గ్రుడ్లు శాకాహారమా? లేక మాంసాహారమా? ” అని అడుగుతారు. మొక్కల నుంచి వచ్చేదైతే అది శాకాహారం, జంతువుల నుంచి వచ్చేదైతే అది మాంసాహారం ! కనుక గ్రుడ్లు సుతరామూ పనికిరావు!
ఏ జంతువూ మానవుల కోసం పుట్టలేదు! ప్రతి జంతువూ తన కోసమే, తన స్వంత కళ్యాణం కోసమే పుడ్తుంది ! దాని కళ్యాణాన్ని పరిరక్షించడమే మానవుడి యొక్క అసలైన బాధ్యత! మానవులు బుద్ధిమంతులైనప్పుడు మరి తమ చిన్నతమ్ముళ్ళైన .. పక్షి సామ్రాజ్యాన్నీ, మత్స్యసామ్రాజ్యాన్నీ .. జంతు సామ్రాజ్యాన్నీ పరిరక్షించడమే మానవ సామ్రాజ్యం యొక్క ప్రధాన కర్తవ్యం. అంతేకానీ జంతుసామ్రాజ్యాన్ని భక్షించడం తగదు.
కూరగాయలను, పళ్ళ చెట్లను బాగా పెంచుతూ, శాకాహారాన్నే స్వీకరిస్తూ .. జంతువులను పరిరక్షిస్తూ, జంతువులతో ఆడుకుంటూ .. మరి ఆ విధంగా వుండడమే మానవాళి యొక్క సౌభాగ్యానికీ, కళ్యాణానికీ మూలకారణం అవుతుంది.
9. ప్రకృతితో సహజీవనం గడుపుతూ వుండడం: అడవుల్లో ట్రెక్కింగ్‌లు చేస్తూ వుండడం
” పురుషుడు “, ” ప్రకృతి ” .. రెండు మౌలిక సత్యాలు. ప్రకృతితో కలయిక పురుషుడికి పరమశక్తిదాయకం! పురుషుడిలో ” నేను ” అనేది వుండడం వలన ప్రకృతితో తాదాత్మ్యం చెందకుండా వుంటాడు. ” నేను ” అనేది పోగొట్టుకోవడం ద్వారా మాత్రమే అతడు ప్రకృతిలో లీనం అవుతాడు. ఇంకోవిధంగా చెప్పాలంటే ప్రకృతిలో అంతగా ” నేను ” ని పోగొట్టుకుంటాడు. కనుక, ధ్యానులందరూ అడవులలో, కొండచరియలలో, పర్వతసానువులలో వీలయినంత ఎక్కువగా జీవించడం నేర్చుకోవాలి. ఆ విధంగా ” ట్రెక్కింగ్ ” అన్నది చాలా ముఖ్యమయిన విషయం.
10. ప్రత్యేక వేషధారణ అన్నది లేకపోవడం : కర్మకాండలు చేయకపోవడం
ఆధ్యాత్మికత కోసం ” కాషాయం లేదా తెల్లని దుస్తులు లేదా ‘ ఫలానా ’ దుస్తులు ధరించడం ” అన్న సాంప్రదాయాలు ఆధ్యాత్మిక సాంఘిక జీవనవిధానంలో వ్యర్థపోకడలు!
ఆధ్యాత్మిక జీవనానికీ, సామాన్య ప్రజానీకానికీ మధ్య అగాధాలు ఏర్పడడానికి కారణం ఇలాంటి అశాస్త్రీయ, అర్ధరహిత సాంప్రదాయాలే. ఒక వ్యక్తి ‘ తన ’ ను తాను తెలుసుకునే ప్రక్రియలో నేను ‘ ఫలానా ’ అని అందరికీ తెలియపరచనవసరం లేదు! ” వ్యక్తిగతమైన సాధన ” అవసరం – ” సంఘానికి వ్యక్తపరచడం ” అనవసరం ! ధ్యానులు సాధారణమైన జీవితం గడుపుతూనే సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు. వీరికి ఎలాంటి ‘ వేషం ’ అవసరం లేదు.
ఇక ” కర్మకాండ ” అన్నది .. చనిపోయిన తరువాత చనిపోయిన వాళ్ళేదో ” అశాంతి ” గా ఉన్నారని చెప్పేసి మనం ఇక్కడేదేదో చేసేస్తూంటాం. వాళ్ళు అశాంతిగా ఉన్నారో లేక శాంతిగా ఉన్నారో మనకేం తెలుసు?! మనకేమి తెలియదు. ఒకవేళ వాళ్ళు అశాంతిగా ఉన్నా ఇక్కడేం చేసినా వాళ్ళకేం చెందదు అది ! ఈ కర్మకాండ అంతా కూడా నూటికి తొంభై తొమ్మిదిపాళ్ళు వ్యాపారం. కనుక దీన్ని రూపుమాపాలి. అందుకోసమే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ యొక్క ఆవిర్భావం, అవతరణ జరిగింది !
11. చిన్న వయస్సు నుండే ప్రతి ఒక్కరికీ ధ్యానశిక్షణ ఇవ్వడం
మ్రొక్కై వంగనిది మ్రానై వంగదు కదా ! చిన్న పిల్లలకు చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక శాస్త్ర, ఆధ్యాత్మిక అభ్యాస క్రమశిక్షణను మనం ప్రసాదించాలి ; అప్పుడే ప్రపంచమంతా బాగుపడుతుంది.
చిన్నప్పటినుంచే అందరికీ ఈ ” ధ్యాన అభ్యాసం ” .. ” మౌన అభ్యాసం ” .. ” స్వాధ్యాయ అభ్యాసం ” .. ” సజ్జన సాంగత్య అభ్యాసం ” ప్రశిక్షణలు మొదలుపెట్టాలి.
శ్రీ ఆంజనేయస్వామి తల్లి అయిన అంజనాదేవి రెండేళ్ళకే .. ఆంజనేయస్వామికి ధ్యాన శిక్షణ మొదలుపెట్టింది. ప్రతి స్కూలు లోనూ, ప్రతి కాలేజీ లోనూ ధ్యానశిక్షణ విధిగా వుండాలి. ప్రతి స్కూలులోనూ, ప్రతి కాలేజీలోనూ ” ఆధ్యాత్మికశాస్త్రం” .. ” స్పిరిచ్యువల్‌సైన్స్ ” .. అన్నది ఒక తప్పనిసరి అధ్యయనా విషయంగా ఉండాలి.
12. ‘ శిష్యరికం ’ అన్నది లేకుండా అందరూ ‘ మాస్టర్లు ’ గా విలసిల్లడం
నేర్చుకోదగిన వారితో నేర్చుకోవలసినదంతా నేర్చుకోవాలి! నేర్చుకోవాలనుకునే వారికి నేర్చుకోవలసింది నేర్పించడం ఎలాగో నేర్చుకోవాలి. నేర్చుకోలేనివారికి మెల్లిమెల్లిగా వారు నేర్చుకునేలా నేర్పించడం ఎలాగో నేర్చుకోవాలి. నేర్చుకున్నామనుకునే వారికి .. నేర్చుకోవలసొంది ఇంకా ఉందని నేర్పించడం ఎలాగో నేర్చుకోవాలి.
ఒకరు నేర్చుకోవడంలో ” మాస్టర్ ” అయితే ఇంకొకరు నేర్పించడంలో ” మాస్టర్ ” అవుతారు. ” గురు-శిష్య ” సంబంధాల్లో పక్షపాతాలు, ఈర్ష్యలూ చోటుచేసుకుంటాయి. అయితే ” మాస్టర్-మాస్టర్ ” సంబంధాల్లో ఇచ్చిపుచ్చుకోవడాలు వుంటాయి. మైత్రీభావం వుంటుంది ; సమైఖ్యభావం వుంటుంది.
13. ధ్యాన శిక్షణా కార్యక్రమాలు ఎప్పుడూ నిశ్శుల్కమే, ఉచితమే
ఎవరి సామాన్య సాధారణ వృత్తుల్లో వాళ్ళుండి ఎవరి జీవన భృతి వాళ్ళు సంపాయించుకుంటూ, మరి ” ధ్యానం ” అన్నది మాత్రం ఉచితంగా నేర్పించాలి!
” కట్టెలు కొట్టుకుని బ్రతకాలి .. ధ్యానం నేర్పించాలి ” ; ” భిక్షం ఎత్తుకోవాలి .. ధ్యానం నేర్పించాలి ” ; గౌతమ బుద్ధుడు భిక్ష మెత్తుకున్నాడు. అన్నం పెట్టమని అడిగాడు ; తానూ తిన్నాడు ; శరీరానికి అన్నం కావాలి మరి. ఆత్మకు కావలసిన ధ్యాన విధానం అందరికీ బోధించాడు ; తన శరీరానికి కావలసిన రెండు మెతుకులూ అడుక్కున్నాడు.
ధ్యాన శిక్షణలో పైకం ససేమిరా తిసుకోకూడదు
14. విగ్రహరాధన తగదు : దేవాలయాలను ధ్యానాలయాలుగా మార్చడం
” మూర్తి పూజ మెట్టు కాదు అగడ్త ” అన్నారు ఆర్య సమాజ స్థాపకులు స్వామి దయానంద సరస్వతి. కనుక ఈ విగ్రహారాధన, వ్యక్తి యొక్క ఆరాధన, వ్యక్తి కాళ్ళకు మొక్కడాలు … ఇవన్నీ కూడానూ ఆధ్యాత్మిక శాస్త్ర పరంగా వ్యర్థపు చేష్టలు. అలాగే ” గురువుల ఆశీర్వాదం పొందడం ” అని చెప్పేసి .. కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిమీద పోసుకోవడం అనేది … ఎంతైనా అనారోగ్యకరమైన విషయం. ఇలాంటి కర్మకాండలన్నీ విసర్జించాలి ; దేవాలయాల్లో విధిగా ధ్యానవిధ్యను ప్రబోధించాలి. ” ధ్యానవిద్య ” మాత్రమే ” దైవవిద్య ” అనబడుతుంది .. దేవాలయాలన్నీ ధ్యానవిద్యాలయాలు అవ్వాలి.
15. ధ్యానశక్తితో ఎవరి జివన సమస్యలను వారే పరిష్కరించుకోవడం
ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకోవాలి ! మరి ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, మరి సజ్జన సాంగత్యం ద్వారా అపారమైన శక్తి మనకు వుంది అని తెలుసుకుంటే మన సమస్యలను మనమే పరిష్కరించుకుంటాం. పై లోక వాసులెవ్వరూ మన సమస్యలను పరిష్కరించరు ! మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి! అంత శక్తి వుంది మన దగ్గర ! అనంతమైన శక్తి మన దగ్గర వుంది !
16. సాధారణ వృత్తులలో వుంటూ మహత్తరమైన గృహస్థ జీవితాన్ని గడపడం
… ఎవ్వరూ సన్యాసాశ్రమం తిసుకోకూడదు ! సృష్టి యొక్క అద్భుతాలనూ, విచిత్రాలనూ, మరి అందాలనూ తెలుసుకుంటూ .. అందరూ గృహస్థులుగా వుండాలి! మన గృహస్థ జీవితాన్ని, మన యొక్క జీవితాన్ని .. అంటే ఆ స్వంత ‘ ఆడ ’, ‘ మగ ’ జీవితాన్ని .. చక్కగా అనుభవించాలి. కామి గాని వాడు మోక్ష గామి కాలేదు కదా!
17. ప్రతి పట్టణంలోనూ, పల్లెలోనూ పిరమిడ్ ధ్యాన కేంద్రాలను నెలకొల్పడం
సృష్టిలో ప్రతి జీవీ ప్రదర్శించే అద్భుతమైన కళ .. ” పరస్పరం తమకున్నది పంచుకోవడం ? ” .. పంచే గుణమే లేకపోతే ప్రపంచమే శూన్యం !
ధ్యానం చేయకపోతే ” రోగం ” .. ధ్యానం చేస్తే ” భోగం ” .. రోగమయ జీవితానికి తిలోదకాలు ఇచ్చి భోగమయ జీవితాన్ని అందుకోవాలి. భోగమయ జీవితం నుంచి ‘ వైభోగ ’ మయ జీవితాన్ని అందుకోవాలి. ” వైభోగం ” అందుకోవాలంటే విశేషంగా ధ్యానప్రచారం చేయాలి .. ” ధ్యాన జీవితం ” అందరికీ పంచితే ” వైభోగం ” ! కాబట్టి ప్రతి పట్టణంలోనూ, పల్లెలోనూ పిరమిడ్ ధ్యానకేంద్రాలను విరివిగా నెలకొల్పాలి ; ఇది ప్రతి ఒక్కరి బాధ్యత.
18. స్వీయ ధ్యానానుభవాలనూ, ఇతర ఆధ్యాత్మిక విశేషాలనూ పుస్తకాల రూపంలో ప్రచురించడం
ప్రతి ఒక్కరూ కూడానూ వాళ్ళ వాళ్ళ ధ్యానానుభవాలను గ్రంధస్థం చేయాలి ; స్వీయ అనుభవాలను వ్రాయాలి, వ్రాసి ప్రచురించాలి ; కరపత్రాలు ముద్రించాలి. సర్ ఫ్రాన్సిస్ బేకన్ ఏం చెప్పరంటే, ” Reading maketh a full man .. conference a ready man .. and writing an exact man ” .. కనుక, పిరమిడ్ మాస్టర్లందరూ విధిగా వారి వారి అనుభవాలను వ్రాసి ప్రచురిస్తూ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని త్వరగతిలో వ్యాపింపచేయాలి.