భగవద్గీత 2-37
“ హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ | తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః || ” |
పదచ్ఛేదం
హతః – వా – ప్రాప్స్యసి – స్వర్గం – జిత్వా – వా – భోక్ష్యసే – మహీం – తస్మాత్ – ఉత్తిష్ఠ – కౌంతేయ – యుద్ధాయ – కృతనిశ్చయః
ప్రతి పదార్థం
వా = ఒకవేళ ; హతః = (నువ్వు) చంపబడితే ; స్వర్గం = స్వర్గాన్ని ; ప్రాప్స్యసి = పొందుతావు ; వా = లేక ; జిత్వా = (నువ్వు యుద్ధంలో) జయిస్తే ; మహీం = రాజ్యాన్ని ; భోక్ష్యసే = అనుభవిస్తావు ; తస్మాత్ = అందువల్ల ; కౌంతేయ = కుంతీకుమారా ; యుద్ధాయ = యుద్ధం చేయడానికి ; కృతనిశ్చయః = తిరుగులేని నిశ్చయంతో ; ఉత్తిష్ఠ = లే.
తాత్పర్యం
“ అర్జునా ! యుద్ధంలో ఒకవేళ మరణిస్తే స్వర్గం పొందుతావు; లేదా గెలిస్తే ఈ భూలోక రాజ్యాన్ని అనుభవిస్తావు ; కనుక, యుద్ధం చేయాలనే దృఢనిశ్చయం గలవాడవై, కార్యోన్ముఖుడివికా ! ”
వివరణ
వీరుడైనవాడు యుద్ధం చేస్తూ మరణిస్తే దానిని “ వీరమరణం ” అంటాం.
వీరమరణం పొందినవాడు ఉత్తమ స్వర్గం చేరుకుంటాడు. స్వర్గ సుఖాలను అనుభవిస్తాడు. కనుక యుద్ధం చేస్తూ మరణిస్తే చింతించాల్సిన అవసరం లేదు.
యుద్ధంలో జయిస్తే ఎలాగూ రాజ్యాధికారం, రాజ్యభోగాలు అన్నీ మన వశమే.
ఏరకంగా చూసినా వీరుడైన వాడికి యుద్ధం చెయ్యడమే సరైన నిర్ణయం.
కనుక “ ధర్మసంస్థాపన కోసం యుద్ధం చెయ్యాల్సిందే ”నని శ్రీకృష్ణపరమాత్మ అర్జునుడికి ఉద్బోధిస్తున్నారు.
ప్రతి మనిషీ ఈ జీవితం అనే రణరంగంలో ప్రతిక్షణం
తన ధ్యేయ సాధన కోసం యుద్ధం చేస్తూనే ఉన్నాడు.
పుట్టుక ద్వారా ఈ జీవిత కురుక్షేత్రంలోకి ప్రవేశించాం.
ధ్యేయసాధన అనే యుద్ధం కృతనిశ్చయంతో చెయ్యవలసిందే.
ధ్యేయసాధనలో మధ్యలో ఎప్పుడూ వెన్ను చూపరాదు …
వెనుకంజ వేయరాదు … భయంతో వెనుకకు తిరిగి పోకూడదు.
ముందే బాగా ఆలోచించుకోవాలి;
కృతనిశ్చయం తీసుకోవాలి.
తరువాత ఆ నిర్ణయాన్ని కర్మగా
మార్చుకోవాలి.
సమత్వంలో ఉండి … యోగత్వంలో
ఉండి …
చెయ్యదల్చుకున్న పనిని కృతనిశ్చయంతో చెయ్యాలి.
ఇది ముముక్షువులకూ, ధ్యాన సాధకులకూ మహామంత్రం వంటిది.
సాధనలో ఎన్ని అవాంతరాలు వచ్చినా … మరి నిరాశ, నిస్పృహ,
అధైర్యం వంటివి చుట్టుముట్టినప్పుడంతా …
ఇది గుర్తుకు తెచ్చుకుంటే తిరిగి క్రొత్త ఉత్సాహం కలుగుతుంది …
సాధన కొనసాగించే పరిస్ఫూర్తి తిరిగి చేకూరుతుంది.
మన యోగసాధన అనే సంగ్రామంలో ధైర్యంతో కృతనిశ్చయులమై …
ఎల్లప్పుడూ ముందుకు సాగాలి.
Recent Comments