సాహసం .. సాహసవంతులు
“సాహసం సేయరా డింభకా .. కోరుకున్నది లభిస్తుంది!” అంటూ “పాతాళభైరవి” సినిమా ద్వారా ఆ సినిమాలోని విలన్ అయిన “మాయల మరాఠీ” .. మనకు ఒక గొప్ప ప్రబోధాత్మకమైన సందేశం ఇచ్చాడు!
కేవలం “పాతాళభైరవి” సినిమానే కాదు .. ఏ సినిమా చూసినా అందులో “సాహసం” అన్నదే మూల కథావస్తువుగా హీరో హీరోయిన్ల చుట్టూ అల్లబడి .. ప్రేక్షకులకు రక్తి కట్టిస్తూవుంటుంది. అలాంటి సాహసకృత్యాల నేపథ్యంలో వాళ్ళు నటించకపోతే ఆ సినిమా చప్పగా మారి దానిని ప్రేక్షకులెవ్వరూ సరికదా .. మరి అది బాక్సాఫీసుదగ్గర బోల్తా కొట్టేస్తుంది.
అలాగే మన జీవితం కూడా! ఈ భూమ్మీద జన్మ తీసుకున్న మన అందరి జీవితాలు కూడా “సాహసం” తో కూడుకున్నవే! సినిమాల్లో సాహసకథావస్తువు ఎంత పటిష్టంగా మలచబడి వుంటుందో అంతే పటిష్టంగా మన జీవితాల్లో కూడా “సాహసం” అన్నది అంతర్లీనంగా వుంటుంది. కేవలం తిండి, నిద్ర, బట్ట కోసమే జీవితాన్ని పణంగా పెట్టకుండా .. పది మందికీ ఉపయోగపడే లోకకల్యాణ కార్యక్రమాలను చేపట్టి .. వాటి అమలు కోసం త్రికరణశుద్ధిగా మన జీవితాన్ని అంకితం చేయడమే .. మన జీవితాల్లో అంతర్లీనంగా ఉండే “సాహసం”!
ఏసు ప్రభువు .. “కేవలం రొట్టె తిని మాత్రమే మానవుడు జీవించలేడు” అంటూ సమస్త మానవాళికి గొప్ప సందేశం ఇచ్చారు కదా!
నాలుగు రాళ్ళు సంపాదించి వెనకేసేసి .. పెళ్ళి చేసుకుని, పిల్లల్ని కనేసి వాళ్ళను పెంచి పెద్దచేసేసి .. వాళ్ళు కూడా పిల్లల్ని కంటూంటే చూసి “నేను తాతనయ్యాను .. నేను అమ్మమ్మను అయ్యాను” .. నేను నానమ్మను అయ్యాను” అని మురిసిపోతూ “ఘనకార్యాన్ని సాధించేశాం” అనుకుంటే లాభంలేదు! ఈ మాత్రం ఘనకార్యాలు నోరు వాయిలేని పశుపక్ష్యాదులు కూడా చేయగలవు!
“నిర్వీర్య పెంపకం”
చాలామంది ఆత్మజ్ఞానం దరికి చేరని వాళ్ళు “పెద్ద పెద్ద సాహసోపేతమైన పనులు చెయ్యడానికి మేము పుట్టలేదు! సాధారణ మానవుల్లాగే ఏవో చిన్న చిన్న పనులు చేసి చచ్చిపోతాం. ఆ పైన అన్నింటికీ ఆ భగవంతుడే వున్నాడు” అనుకుంటూ తమ పిల్లలను పరిమిత భావాలతో పెంచుతూ .. “ఏదో ఒకలా చదువుకుని .. డాక్టర్ లేదా ఇంజనీయర్ కా! పెళ్ళాం పిల్లలతో సుఖంగా జీవిస్తూ మా కళ్ళముందే పడివుండు” అంటూంటారు.
ఆత్మస్వరూపులమైన మనం ఇతరలోకాల్లో ఉన్నప్పుడే .. భూమ్మీద పుట్టిన తరువాత ఏమేం సాహసకార్యాలు చేయాలో ప్రణాళికలు వేసుకుంటాం. అందుకు తగ్గట్లుగానే ఊహ తెలిసినప్పటినుంచీ సాహసోపేతమైన కార్యక్రమాలను చెయ్యడానికి ఉవ్విళ్ళూరుతూంటాం. కానీ .. తల్లితండ్రులూ, బంధువర్గాలూ మరి మిత్రులూ అందరూ కలిసి మనల్ని ఆ సాహసకృత్యాలు చెయ్యకుండా ఆపి మనలో భయాన్ని పెంచి పోషిస్తూంటారు.
“అవన్నీ పెద్ద పెద్ద విషయాలు .. నీ వల్ల కావురా! పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు ఎవరినో చూసి నువ్వేవో గొప్పపనులు చేస్తానంటే నిన్ను నమ్ముకున్న నీ పెళ్ళాం బిడ్డల పరిస్థితి ఏం గాను? కోరి కష్టాలు తెచ్చుకోవడానికి నువ్వేం పెద్ద గొప్పోడిననుకుంటున్నావా?” అంటూ “వారికి మేం సరియైన జీవినవిధానాన్ని ప్రబోధిస్తున్నాం” అని తృప్తి చెందుతూంటారు.
“తిరిగి ఇచ్చినది ఎంత?”
మనం గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే .. “సమాజం నుంచి తీసుకున్న మేలు కంటే ఒకింత ఎక్కువ మేలును తిరిగి సమాజానికి అందించడానికే నేను పుట్టాను” అని తెలుసుకుని జీవితాన్ని ఆ దిశగా సాగించాలి! అదీ “సాహసం” అంటే!
ఒక ఏసుప్రభువు సమాజం నుంచి తీసుకున్నది ఎంత? మరి సమాజానికి తిరిగి ఇచ్చింది ఎంత?! ఒక గౌతమబుద్ధుడు, మధర్ థెరిస్సా, మహాత్మాగాంధీ, షిరిడీ సాయి వంటి మహామహాధీరులు సమాజం నుంచి తీసుకున్నది ఎంత? మరి వారు సమాజానికి తిరిగి ఇచ్చింది ఎంత?! పరిశీలించి చూస్తే ఆ ఇచ్చిపుచ్చుకోవడాల మధ్య వారు చూపించిన వ్యత్యాసం మనకు తెలుస్తుంది.
అయితే మన చుట్టూ ఉన్న ప్రపంచం అతి చిన్న వయస్సు నుంచే ధ్యానం చేసి అవధూతగా మారిన ముమ్మిడివరం బాలయోగిని పూజిస్తూ .. మనల్ని మాత్రం “ఈ చిన్ని వయస్సులో ధ్యానం ఏంటిరా? ముసలి వయస్సులో చేసుకోవాలి గానీ” .. అంటుంది!
చుట్టుప్రక్కల వున్న సగటు సాధారణ మనుష్యులు చేసిందే మనమూ చేస్తూ .. “నేను కేవలం శరీరధారుడినే” అనుకుంటే అది బ్రతుకు ఈడ్వడమే అవుతుంది కానీ .. సాహసోపేతమైన జీవితం ఎంత మాత్రం కానేరదు.
“ధ్యానం” ద్వారా “నేను ఆత్మను” అన్న సత్యాన్ని తెలుసుకుని .. ఆత్మశక్తికి అనుగుణమైన సాహసోపేతమైన పనులను చేపట్టి .. “ఆత్మవత్ జీవితాన్ని” గడుపుతూ ఉంటే .. సహజంగానే మనం “సాహసవంతులు”గా మారుతాం! అప్పుడు అనుదిన సాహసమే మన దినచర్యగా, అనుదినసాహసమే దైనందిన కార్యక్రమంగా మారుతుంది.
కనుక మన ఆత్మశక్తిని మనకు తెలియజేసే ధ్యానసాధన అన్నది చిన్నప్పటి నుంచే మన జీవితంలో ఒక భాగం కావాలి.
“రకరకాల సాహసాలు”
మన పిల్లలను భయరహితులుగా, నిర్భయులుగా పెంచాలి. “చీకట్లో దయ్యాలూ, భూతాలూ వుంటాయి” అని వారికి చెప్పకుండా .. “కాస్సేపు అలా చీకట్లో తిరిగిరా” అంటూ వారిని వదిలిపెట్టెయ్యాలి! స్మశానంలో వారిని స్వేచ్ఛగా త్రిప్పుతూ “ఇక్కడ మీ తాతగారు తమ శరీరాన్ని వదిలిపెట్టారు” అంటూ చిన్నప్పుడే స్మశానం అంటే వారిలో భయాలను పోగొట్టాలి! తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే .. నదిలో ఈదడం, కొండలు, చెట్లు ఎక్కడం వంటి సాహసోపేతమైన పనులకు వాళ్ళను ప్రోత్సహించాలి!
సాహసాలు రకరకాలుగా ఉంటాయి. చదువుల్లో సాహసం .. ఆటల్లో సాహసం .. పాటల్లో సాహసం .. మాటల్లో సాహసం .. పనుల్లో సాహసం ..! రకరకాల సాహసాలు చెయ్యాలి. సంగీతంలో క్రొత్తక్రొత్త రాగాలను కనిపెట్టాలి .. చదువుల్లో క్రొత్తక్రొత్త ప్రయోగాలు చెయ్యాలి. “మనకెందుకులే?” అనుకోకుండా ప్రక్కవాళ్ళెవ్వరూ చేపట్టని పనులను చేపట్టి .. నీలాపనిందలకు గురి అయినా వెరవకుండా .. ప్రాణాలకు తెగించి మరీ ఆ పనులను పూర్తిచెయ్యాలి. ఇలా మన ఆత్మకు తోచిందీ, మన హృదయం చెప్పిందీ నిర్భయంగా చేయడమే సాహసం!
“స్వాతంత్ర్య యోద్ధులు”
ఒకరి సాహసం మరొకరికి స్ఫూర్తినిస్తుంది .. మరి ఒకరి సాహసాన్ని చూసి ఇంకొకరు సాహసం చేయ పూనుకుంటారు. “తెల్లదొరల దాస్యశృంఖలాల నుంచి భరతమాతను విముక్తి చేయాలి” అన్న గాంధీజీ యొక్క సాహసం .. గత రెండు వందల సంవత్సరాలుగా స్వంతదేశంలోనే బానిసలుగా బ్రతుకుతూన్న ప్రతి ఒక్క భారతీయుడిలోని సాహసం చేసే నైజాన్ని తట్టిలేపింది. దాంతో దేశం అంతా కూడా దేశభక్తితో సాహసవంతం అయిపోయి .. అచిరకాలంలోనే స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంది!!
దక్షిణాఫ్రికా స్వాతంత్ర్య సమర యోద్ధుడు నెల్సన్ మండేలా రెండు దశాబ్ధాలపాటు జైలులో ఉండే తన పోరాటాన్ని సాగించారు. వీర్ సావర్కర్ ఇరవై అయిదు సంవత్సరాల పాటు అండమాన్ జైలులోనే మ్రగ్గిపోతూ .. ఎన్నెన్నో వ్యక్తిగత బాధలు అనుభవించారు. అక్కడి నుంచే ఆ వీరుడు దేశ ప్రజలను ఉత్తేజితం చేసాడు. అదీ “సాహసం” అంటే!
“అగ్నిప్రవేశం చెయ్యి”
“ప్రాణాలు పోతే పోనీ .. ఈ పని మాత్రం పూర్తి చెయ్యి” అని ఎవరైనా మరొకరికి చెప్పడం అన్నది వారు చేసే అత్యంత సాహసోపేతమైన ప్రబోధం! లంకా విజయం తరువాత శ్రీరాముడు తన ధర్మపత్ని సీతమ్మను “అగ్నిప్రవేశం చెయ్యి” అని ఆజ్ఞాపించాడు. అది “సాహసం”! మారు మాట్లాడకుండా సీతాదేవి భర్తచుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి అగ్నిప్రవేశం చేయడం అంతకంటే గొప్ప “సాహసం”!
“పైలోకాల్లో మార్కులు”
ఇలా సాహసాలు చేసేవాళ్ళకు పై లోకాల్లో ఎన్నో మార్కులు వస్తాయి!! రేపో మాపో మనం కూడా పై లోకాలకు వెళ్ళిపోతాం! అప్పుడు అక్కడి ఉన్నత ఆత్మలు మనల్ని “ఏమయ్యా! భూమ్మీద వున్నప్పుడు ఏమేం సాహస కార్యాలు చేసావేంటి?!” అని అడుగుతారు కుతూహలంగా ..!
అప్పుడు మనం దేభ్య మొహం వేసుకుని “లేదండీ !! పెళ్ళాం – పిల్లలు .. ఉద్యోగం – సద్యోగం .. బరువులు – బాధ్యతలు .. వీటితోనే జన్మంతా సరిపోయే! ఇక సాహసాలు చేయడానికి టైమెక్కడిదీ?! అసలు వాటి గురించి ఆలోచించే వెసులుబాటే లేకపాయె” అని సర్దిచెప్పబోతున్నప్పుడు వాళ్ళు నవ్వుతారు. ఎందుకంటే భూలోకంలో వున్నప్పుడు అలాంటి స్థితిలో ఉండికూడా బోలెడన్ని సాహసాలు చేసి వచ్చిన వాళ్ళ పై లోకాల్లో కోకొల్లలుగా వుంటారు! కేవలం భూలోకం అన్న ఈ పాఠశాలలోనే మనకు అనేకానేక కర్మల ద్వారా సాహసాలు చేసే అవకాశం వుంటుంది.
“ధ్యానం అన్నది మహాసాహసం”
బాహ్య ప్రపంచంలో కర్మలు చేస్తూనే ఆత్మస్వరూపుల్లా వెలగడం ఒక “మహాసాహసం”. నిరంతర ధ్యానసాధన ద్వారా స్వీయ ఆత్మతత్వం పట్ల ఎరుకతో ఉండడం “మహాసాహసం”! ఆలోచనల పట్ల ఎరుకతో ఉండడం “మహాసాహసం”! ఆలోచనల పుట్ట అయిన మనస్సును నిర్మూలనం చేసుకోవడం “మహాసాహసం”. మూడవ కన్ను తెరచుకుని గతజన్మలను చూసుకుని కర్మసిద్ధాంతాన్ని అవగతం చేసుకోవడం అన్నింటికన్నా గొప్ప “మహాసాహసం”!
“ధ్యానం” అన్నది ఆషామాషీ వ్యవహారం ఎంతమాత్రం కాదు. “ఒక మహాసాహస కార్యక్రమం చేయడానికే నేను పూనుకుంటున్నాను; తలపులు బోడి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ నా ఆత్మమూల ప్రకృతి గురించి నేను తెలుసుకుంటున్నాను” అనుకుని ధ్యానానికి కూర్చుని మనస్సు అనే సరస్సులోకి దిగి మొసళ్ళు అనే ఆలోచనలను ఒక్కొక్కటిగా మట్టుపెట్టడం అన్నది ఒక గొప్ప సాహసం! ఇది ఒకానొక బుద్ధుడు మాత్రమే చేపట్టగలిగే మహాసాహస కార్యం!
నిజానికి బాంబులు విసిరో, కత్తితో దాడి చేసో లేక తుపాకితో కాల్చో మంచి మనిషిని చంపడం కంటే మన మనస్సును మనం చంపడం చాలా కష్టం! కళ్ళు రెండూ మూసేసుకుని శరీరాన్ని స్థిమితపరచి, మనస్సును శూన్యం చేసుకుని గంటలు గంటలు ధ్యానంలో కూర్చోవడం “పరమ సాహసం” తో కూడిన “పరమ సాహసం”!
జయాపజయాలతో సంబంధం లేకుండా పనిచేయడం అన్నది ఒకానొక సాహసి యొక్క లక్షణం! వారు ప్రక్కవాళ్ళు వెలిబుచ్చే అపరిపక్వ అభిప్రాయాలను ఎంతమాత్రం లెక్కపెట్టకుండా ఎంచుకున్న పనిలోనే నిమగ్నమై తమకోసం తాము ఆత్మవత్ జీవితాలను జీవిస్తూంటారు.
ఈ భూమ్మీద మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా సాహసాల్లో కెల్లా అత్యంత సాహసమైన ధ్యానాన్ని తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి.