భగవద్గీత 6-29
“ సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని | ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః || ” |
పదచ్ఛేదం
సర్వభూతస్థం – ఆత్మానం – సర్వభూతాని – చ – ఆత్మని – ఈక్షతే – యోగయుక్తాత్మా – సర్వత్ర – సమదర్శనః
ప్రతిపదార్థం
యోగయుక్తాత్మా = యోగయుక్తమైన ఆత్మగలవాడు ; సర్వత్ర = అన్నింటినీ ; సమదర్శనః = సమభావంతో చూసే యోగి ; ఆత్మానం = తన ఆత్మను ; సర్వభూతస్థం = సర్వప్రాణులలో స్థితమైనట్లు ; చ = మరి ; సర్వభూతాని = ప్రాణులను అన్నింటినీ ; ఆత్మని, ఈక్షతే = తన ఆత్మలోనే చూస్తాడు
తాత్పర్యం
“ ఆత్మైక్యం చెందిన యోగి సమస్త ప్రాణికోటి పట్ల సమదృష్టి కలిగి, తనలో సర్వభూతాలనూ, సమస్త భూతాలలో తననూ దర్శిస్తాడు. ”
వివరణ
ధ్యానసాధనలో పరిపూర్ణత సిద్ధించిన స్థితిలో ఒకానొక ధ్యాని మనోబుద్ధులను
అధిగమించి ఆత్మతో ఏకత్వం … యోగత్వం పొంది తాను ఆత్మే అవుతాడు.
అంటే ఒకానొక ధ్యానయోగి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు … ఆత్మే అవుతున్నాడు.
అప్పుడు సమస్త చరాచర ప్రాణికోటిలో ఒకే అఖండ చైతన్యాన్ని దర్శించగలడు.
“ నేను ఆత్మయే కానీ ఈ దేహం కాదు ” అని అనుభవంలో గ్రహించినప్పుడు …
సర్వత్రా ఆత్మ తప్ప ఇంకేమీ కనపడదు.
సమస్త నామరూపాలలో పరమాత్మ ఆధారభూతంగా ఉంది అన్న …
‘ సర్వాత్మస్థితి ’ అనుభవం అవుతుంది.
తనను తాను దేహానికి పరిమితం చేసుకున్నంతవరకూ ఈ స్థితి కలుగదు.
కనుక ధ్యానసాధనలో ఎవరు తనను తాను ఆత్మగా తెలుసుకుంటారో …
వానికి ఆత్మయొక్క సర్వవ్యాపకత్వం అర్థమవుతుంది.
అప్పుడు జగత్తులోని ప్రతిదానిలోనూ ఆ చైతన్యాన్నే … ఆ ఆత్మనే చూస్తాడు.
తనకంటే భిన్నంగా ఏదీ లేదని తెలుస్తుంది.
సర్వత్ర సమంగా వ్యాపించి ఉన్న ఆత్మతత్త్వం అవగతమైన వానికి …
తనకూ ఈ ప్రపంచానికీ ఉన్న అభేద భావం … ఏకత్వం … అర్థమవుతుంది.
సమస్తంలో తనను … తనలో సమస్తాన్నీ చూస్తాడు.