భగవద్గీత 18-66
“ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ | అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః || ” |
పదచ్ఛేదం
సర్వధర్మాన్ – పరిత్యజ్య – మాం – ఏకం – శరణం – వ్రజ – అహం – త్వా – సర్వపాపేభ్యః – మోక్షయిష్యామి – మా – శుచః
ప్రతిపదార్థం
సర్వధర్మాన్ = సమస్త ధర్మాలనూ( అన్ని కర్తవ్యకర్మలనూ) ; పరిత్యజ్య = విడిచి ; “మాం” = “తనను తాను” ; ఏకం = మాత్రమే ; శరణం వ్రజ = శరణు వేడుకోవాలి ; అహం త్వా = నేను నిన్ను ; సర్వపాపేభ్యః =సమస్త పాపాలనుంచి ; మోక్షయిష్యామి = విముక్తుడిని చేస్తాను ; మా శుచః = శోకించకు
తాత్పర్యం
“ అన్ని ధర్మాలనూ వదిలేసి, ఎవరిని వారే శరణు వేడుకోవాలి ; అప్పుడు నిన్ను నేను సర్వపాపాలనుంచీ ఉద్ధరిస్తాను. ”
వివరణ
మరొకసారి … మరొకసారి … తెలుసుకుందాం
భగవద్గీతను అర్థం చేసుకోవడంలో అనుసరించవలసిన విధానం :
శ్లోకంలోని మొదటి పాదంలోని “ మామేకం శరణం వ్రజ ” లోని “ మామ్ ”
అన్నది ఎవరికి వారు తమకు తాముగా అన్వయించుకోవాలి.
రెండవ పాదంలోని “అహం” శ్రీకృష్ణుడికీ, శ్రీ వేదవ్యాసులవారికీ,
మరి స్వీయ పరమ ఆత్మకూ అన్వయించుకోవాలి.
“ శరీరం”, “ మనస్సు ”, “ బుద్ధి ”, “ కుటుంబం ” … ఇంకా సామాజికపరంగా
మనం నిర్వర్తించవలసిన అనేక ధర్మాలు ఉన్నాయి … ఉంటాయి.
ఆ సర్వధర్మాలనూ వదిలేసి కేవలం ఆత్మధర్మాన్నే నిర్వర్తించమంటున్నారు.
“ మాం ఏకం శరణం వ్రజ ” అంటే అర్థం “ ఎవరి ఆత్మను వారే శరణు వేడుకోవాలి. ”
ఎవరి ఆత్మను వారే శరణు కోరుకోవాలి … మన ధ్యానంలో మనం కూర్చోవాలి.
ఆకలి వేస్తుంది, భోంచెయ్యాలి … అది శరీరధర్మం.
నిద్రవస్తుంది, నిద్రపోవాలి … అది శరీరధర్మం.
నిద్దుర కొంత నిరాకరించాలి, ఆకలిని కొంత తిరస్కరించాలి … శ్వాసను
చేపట్టాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ధ్యానం చెయ్యాలి … ఇది ఆత్మధర్మం.
సర్వశారీరిక ధర్మాలనూ పరిత్యజించి,
మన ఆత్మధర్మంలో మనం యదావిధిగా ఉండాలి.
అప్పుడు “ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి ”,
“ నేను నీ సర్వ పాపాలనూ శుద్ధి చేస్తాను ;
అప్పుడు నేను నీకు సహాయం చేస్తాను ” అంటున్నారు శ్రీకృష్ణులవారు.
ఎవరినివారుఉద్ధరించుకోడానికిఎంతప్రయత్నంచేస్తే
అంత సహాయం మనకు పరమ ఆత్మల నుండి కూడా లభిస్తుంది.
“ ధ్యానం రక్షతి రక్షితం ”… “ ఎవరైతే ధ్యానాన్ని రక్షిస్తారో, వారి చేత రక్షింపబడిన ఆ ధ్యానమే తిరిగి వారిని రక్షిస్తుంది ”.
మన చేత రక్షింపబడిన ధ్యాన ధర్మమే మనల్ని తిరిగి రక్షిస్తుంది.
ప్రతిరోజు తప్పనిసరిగా శరీరధర్మం, కుటుంబ ధర్మం అన్నవాటిని
కొంతప్రక్కన పెట్టి ఆత్మధర్మం చూసుకోవడమే “ మామేకం శరణం వ్రజ ”.
మనచేతనేరక్షించబడినఆఆత్మధ్యానం
మన పాపాలన్నీ పోగొట్టి మోక్షాన్ని ప్రసాదిస్తుంది.