సమత్వం యోగ ఉచ్యతే

 

మనం అందరం అంతా పరస్పర మిత్రులం! “మనం అందరం అంటే ‘దైవాళి’.. ‘మానవాళి’ – ‘జంతుజాలం’ .. ‘వృక్షజాలం’!

ఇలా సమస్త సృష్టితో కూడి మిత్రత్వంలో జీవించే వాళ్ళంతా కూడా తమ తమ జీవితాలకు చెందిన భూత భవిష్యత్ వర్తమానాలకు స్వయంగా సృష్టి, స్థితి, లయకర్తలుగా తెలుసుకుంటూ ఆ విధంగా విరాజిల్లుతూంటారు.

తమ జీవితానికి తామే అధిపతులుగా జీవించే వాళ్ళు వేరెవరి కోసమో తమ తమ జీవన విధులను నిర్వహించరు, మరి వేరెవరి మీదో తమ పెత్తనాలను చలాయించరు. ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా మెలగుతూ .. ప్రతి ఒక్కరి దగ్గరినుంచి తమకు తెలియంది నేర్చుకుంటూంటారు; మరి తమకు తెలిసింది ప్రతి ఒక్కరికీ నేర్పుతూ వుంటూంటారు.

ఒకానొక జ్ఞాని యొక్క దృష్టిలో .. ఏ సంఘటన, ఏ పరిస్థితి మరి ఏ మనిషి పట్ల కూడా “మంచి-చెడు” అన్న ద్వంద్వ ప్రవృత్తి ఉండదు, ఏది జరిగినా తన మంచికే” అనుకుంటాడు. చైనా దేశంలో .. ఒకానొక కుగ్రామంలో .. ఒక రైతు దగ్గర ఒక గుర్రం ఉండేది. అదికాస్తా ఒక్కసారి అడవిలోకి పారిపోయింది. అది చూసి ఊళ్ళో ఉన్న వాళ్ళంతా “అయ్యో పాపం! నీకు ఉన్న ఒక్క గుర్రం కూడా అడవిలోకి పారిపోయింది. నువ్వెంత దురదృష్టవంతుడియ్యా” అని గేలిగా పరామర్శించారు.

రైతు మాత్రం “ఏమో?! అది అదృష్టమో .. దురదృష్టమో” ఎవరు చెప్పొచ్చారు? అది మీకేం తెలుసు? మరి నాకేం తెలుసు?” అన్నాడు నిబ్బరంగా.

అడవిలోకి పారిపోయిన ఆ గుర్రం నాలుగురోజుల్లో ఇంకో పది అడవి గుర్రాలను వెంటేసుకుని రైతు దగ్గరకు తిరిగి వచ్చింది! అది చూసి ఆశ్చర్యపోయిన గ్రామస్థులంతా “నువ్వు ఎంత అదృష్టవంతుడివి! వాస్తవానికి మేమే ఎంతో దురదృష్టవంతులం! మా గుర్రం కూడా అడవికి పోయి వుంటే బావుండేది!” అని వాపోతూండగా రైతు మాత్రం “ఏమో?! అది అదృష్టమో .. దురదృష్టమో ఎవరు చెప్పొచ్చారు? అది మీకేం తెలుసు? మరి నాకేం తెలుసు?” అన్నాడు మరింత నిబ్బరంగా.

కొన్నాళ్ళకు, అడవిలోంచి వచ్చిన ఒకానొక అడవి గుర్రంపై ఎక్కి అడుకుంటూన్న రైతు కొడుకు ప్రమాదవశాత్తు జారిపడిపోవడంతో అతని కాలు విరిగిపోయింది. అది చూసిన గ్రామంలోని ఇతర రైతులంతా “అయ్యో పాపం! రైతు ఎంత దురదృష్టవంతుడు! అతని ఉన్న ఒక్కగానొక్క కొడుకు గుర్రం మీద నుంచి పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. మొత్తం మీద మేమే అదృష్టవంతులం! మా పిల్లలు మాత్రం క్షేమంగా ఉన్నారు!” అనుకుని తృప్తిపడ్డారు.

రైతు మాత్రం “ఏమో?! అది దురదృష్టమో, అదృష్టమో ఎవరు చెప్పొచ్చారు? అది మీకేం తెలుసు? మరి నాకేం తెలుసు?” అన్నాడు మళ్ళీ ఎంతో, ఎంతో నిబ్బరంగా ..

ఈ లోపల పొరుగుదేశంతో యుద్ధం కారణంగా దేశంలో యుద్ధవాతావరణం నెలకొంది. ప్రతి ఊళ్ళో ఆరోగ్యంగా ఉన్న యువకులందరినీ సైన్యంలోకి బలవంతంగా తీసుకోవడం మొదలయ్యింది. ఈ క్రమంలో అధికారులు గ్రామంలోని యువకులందరినీ యుద్ధంలో చేర్చుకుంటూ కాలు విరిగి మంచంలో పడి ఉన్న కారణంగా రైతు కొడుకును మాత్రం వదిలిపెట్టారు. అప్పుడు గ్రామస్థులు “మేమే నిజమైన దురదృష్టవంతులం” అని వాపోయారు.

ఇలా జరిగే ప్రతి ఒక్క సంఘటననూ మన అల్పజ్ఞానం లోంచి “ఏదో ఒక విధంగా” అర్థం చేసుకోడానికి ప్రయత్నించకుండా .. జరిగే ప్రతి ఒక్క సంఘటననూ సాక్షిలా గమనిస్తూ .. స్థితప్రజ్ఞత్వంతో ఉంటూ వచ్చే సారాన్ని “అనుభవజ్ఞానం”లా స్వీకరించడమే ఎన్‌లైటెన్‌మెంట్!

కొంతమంది “సార్! నాకు ఇంకా ఉద్యోగం రాలేదు” అంటూ నా దగ్గరికి వస్తూంటారు” అయితే బాగా ధ్యానం చేసుకోండి! ఉద్యోగం వస్తే ధ్యానం చేసుకోవడానికి టైమ్ ఉండదు కదా!” అని చెబుతూంటాను. ఇంకొందరు “సార్ మాకు ఇంకా పిల్లలు పుట్టలేదు” అంటూంటారు. “మంచిది! చక్కగా ధ్యానం చేసుకోండి. పిల్లలు పుట్టాక వాళ్ళ బాగోగులు చూసుకోవడానికే మీకు టైమ్ సరిపోదు” అని చెప్తూంటాను. జరిగే ప్రతి ఒక్క సంఘటన కూడా ఇంకొక సరిక్రొత్త మార్పును తీసుకుని వస్తుంది! ఆ మార్పుకు అనుగుణంగా మనకు సుఖాల్లో ఒక విధమైన మార్పు ఉంటుంది; మరి కష్టాల్లో ఇంకో విధమైన అభివృద్ధి కలుగుతుంది.

బాలగంగాధర్ తిలక్ గారికి బ్రిటిష్ ప్రభుత్వం అయిదు సంవత్సరాల జైలు శిక్ష విధించి .. అండమాన్ జైలుకి పంపింది. అక్కడ జైలులో వుండి ఆయన చక్కగా భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాశారు. దాని వల్ల ఆయనకీ మంచి జరిగింది, మరి అది చదివిన మనకూ మంచి జరిగింది.

చూసే దృష్టిని బట్టే చూడబడేది ఉంటుంది! “The mark of your ignorance is the depth of your belief in injustice and tragedy” అన్నాడు రిఛార్డ్ బాక్! “ప్రపంచంలో మనం ఎంతటి అన్యాయం, ఎంతటి బాధలను చూస్తున్నామో మనకు మౌలికంగా అంతకు అంత అజ్ఞానం వుంటుందన్నమాట” అని అర్థం.

“జరిగే ప్రతి ఒక్క సంఘటన కూడా ఒకానొక సరిక్రొత్త మార్పుని తీసుకువస్తుంది” అని తెలుసుకుని శాస్త్రీయంగా జీవించాలి. వెయ్యి పేజీల నవల మధ్యలో ఒక పేజీని మాత్రమే చదివితే కథంతా అర్థం కాదు! అటూ ఇటూ కలిపి మిగతా తొమ్మిది వందల తొంభై పేజీలను కూడా చదివితే “అసలు కథ” అర్థం అవుతుంది.

అనేకానేక జన్మల పరంపరలో కేవలం ఒక్క జన్మలోని కొన్ని సంఘటనలను పట్టుకుని వ్రేళ్ళాడుతూ వుంటే లాభం లేదు; ధ్యానం చేసి వాటికి సంబంధించిన గత అనేకానేక జన్మల యొక్క కర్మల గురించీ, మరి తద్వారా తదుపరి జన్మలలో అనుభవించే కర్మఫలితాలను గురించీ తెలుసుకోవాలి.

అధికంగా డబ్బులు ఉన్నవాళ్ళు “అయ్యో! ఈ డబ్బులు ఏమైపోతాయో?” అని బెంగపెట్టుకోకుండా వాటిని పదిమందికీ ఉపయోగపడే మంచి పనులకు ఖర్చుపెట్టాలి! మరి అధికంగా సమయం ఉన్నవాళ్ళంతా ఏం చెయ్యాలో తోచక గోళ్ళు కొరుక్కుంటూ కూర్చోకుండా తమ తమ సమయాలను ధ్యానసాధనకూ, ధ్యానప్రచారానికీ ఇతోధికంగా వినియోగించాలి!