భగవద్గీత 14-5

సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః |

నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ ||

 

పదచ్ఛేదం

సత్త్వంరజఃతమఃఇతిగుణాఃప్రకృతిసంభవాఃనిబధ్నంతిమహాబాహోదేహేదేహినంఅవ్యయం

ప్రతిపదార్థం

మహాబాహో ! = గొప్ప బాహువులు కలవాడా ! ; సత్త్వం = సత్త్వగుణం ; రజః = రజోగుణం ; తమః , ఇతి = తమోగుణం అనే ; ప్రకృతి సంభవాః = ప్రకృతి నుంచి ఉత్పన్నాలైన ; గుణాః = మూడు గుణాలు ; అవ్యయం = నాశరహితుడైన ; దేహినం = జీవాత్మను ; దేహే = శరీరంలో ; నిబధ్నంతి = బంధిస్తున్నాయి.

తాత్పర్యం

ఓ మహాబాహో ! ప్రకృతి వల్ల కలిగిన సత్త్వ, రజో, తమోగుణాలు నాశరహితుడైన జీవాత్మను దేహంలో బంధిస్తున్నాయి.”

వివరణ

నిజానికి గుణాలకు ప్రత్యేకమైన అస్తిత్వం లేదు.

గుణాలన్నీ మనస్సులోనే కలుగుతుంటాయి.

రకరకాల సందర్భాలలోని వేరువేరు మానసిక పరిస్థితులే

ఈ గుణాలుగా అభివ్యక్తం అవుతుంటాయి.

ఎప్పుడు ఏ గుణం ప్రకోపిస్తే తదనుగుణంగా మనస్సు మారుతూ వుంటుంది.

జీవాత్మ వాస్తవానికి గుణాతీతుడు అయినప్పటికీనూ,

ఆయా గుణాలతో తాదాత్మ్యం చెంది

సుఖదుఃఖాలనూ, ద్వంద్వాలనూ అనుభవిస్తుంటాడు.

ఆయా అనుభవాలు సంస్కారాలనూ, వాసనలనూ సృష్టిస్తున్నాయి.

తద్ద్వారా వివిధ జన్మలను పొందుతూ బంధాలలో చిక్కుకుంటున్నాడు.

అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అన్నమాట !