భగవద్గీత 4-10
“ వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః | బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః || ” |
పదచ్ఛేదం
వీతరాగభయక్రోధాః– మన్మయాః – మాం – ఉపాశ్రితాః – బహవః – జ్ఞానతపసా – పూతాః – మద్భావం – ఆగతాః
ప్రతిపదార్థం
వీతరాగభయక్రోధాః = అనురాగం, భయం, క్రోధం లేనివాళ్ళు ; మన్మయాః = నాలోనే స్థితమైనవారు ; మాం, ఉపాశ్రితాః = ‘ నన్ను ’ ఆశ్రయించిన వారు ; బహవః = అనేకమంది ; జ్ఞానతపసా = జ్ఞాన తపస్సుచేత ; పూతాః = పవిత్రులై ; మద్భావం, ఆగతాః = నా స్వరూపాన్ని పొందారు.
నేను = ఆత్మ
అర్జునుడు = నేను దేహం అనుకునే తత్వం
శ్రీకృష్ణుడు = నేను ఆత్మను అని తెలుసుకున్న తత్వం
భగవాన్ ఉవాచ – ఆత్మ ఉవాచ :
“ అనురాగం, కోపం, భయం విడిచి పెట్టి, ‘ నాలో ’ స్థితమైనవారు ఎంతోమంది … ఇటువంటి జ్ఞాన తపస్సు చేత పవిత్రులై ‘ నా ’ స్వరూపాన్నే పొందారు. ”
వివరణ
“ శ్రీకృష్ణుడు ” అంటే “ ఆత్మ ” అని పదే పదే గుర్తుంచుకోవాలి.
ఈ శ్లోకంలో “ నేను ” అన్నప్పుడల్లా “ ఆత్మ ” అని అర్థం చేసుకోవాలి.
“ శ్రీకృష్ణుడు ” అనే వ్యక్తికి సంబంధం కాదు.
“ మన్మయాః ” అంటే “ ఎవరికి వారే ” … “ తన ఆత్మలో తాను ”.
“ మాముపాశ్రితాః ” – అంటే “ తన ఆత్మను తానే ఆశ్రయించుకోవడం ”…
“ ఎవరి ఆత్మధ్యానంలో వారుండడం ” ;
“ మద్భావమాగతః ” – అంటే “ ఆత్మస్వరూపాన్ని పొందడం ”
“ భగవద్గీత ” అన్నది మనలో జ్ఞానం పెంపొందడానికీ …
మన కర్తవ్య కర్మలను మనం సక్రమంగా నిర్వర్తించ గలగడానికీ …
మరి మనలను ధ్యానులుగా, ధ్యానయోగులుగామలిచేందుకూ
ప్రబోధింపబడింది.
మనలోనే అపారమైన శక్తి ఉంది. దానిని వినియోగించుకోవడానికి
రాగం, భయం, క్రోధం విడిచిపెట్టి,
మనల్ని మనమే ఆశ్రయించుకుని,
మన ఆత్మధ్యానంలో మనముండి,
‘ మేము ఆత్మలము ’ అని గ్రహించి, ఆత్మజ్ఞానులుగా మారాలి.
ధ్యానం చేసి … జ్ఞాన తపస్సుతో… పరిపూర్ణమయిపోవాలి.