భగవద్గీత 6-30
“ యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి | తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి || ” |
పదచ్ఛేదం
యః — మాం — పశ్యతి — సర్వత్ర — సర్వం — చ — మయి — పశ్యతి — తస్య — అహం — న — ప్రణశ్యామి — సః — చ — మే — న — ప్రణశ్యతి
ప్రతిపదార్థం
యః = ఎవరైతే ; సర్వత్ర = సకల ప్రాణులలో ; మాం = (ఆత్మ రూపంలో వ్యాపించి ఉన్న) నన్ను ; పశ్యతి = చూస్తాడో ; సర్వం చ = అలాగే సమస్త ప్రాణులనూ ; మయి = నాలో ; పశ్యతి = చూస్తాడో ; తస్య = వానికి ; అహం = నేను ; న ప్రణశ్యామి = కనపడక పోను ; సః చ = అతడు కూడా ; మే = నాకు ; న ప్రణశ్యతి = కనపడక పోడు
తాత్పర్యం
“అన్ని ప్రాణులలో తననూ, తనలోనే అన్ని ప్రాణులనూ చూసే వాని మీద నా దృష్టీ, నా మీదే వాని దృష్టీ వుంటాయి.”
వివరణ
ఈ శ్లోకంలో మొదటి పాదంలో “మాం”, “మయి” అన్నపదాలఅసలు
అర్థాలకోసం ఎవరికి వారు తమకు తాముగా అన్వయించుకోవాలి.
రెండవ పాదంలోని “అహం” ను శ్రీ వేదవ్యాసునికి, లేక శ్రీకృష్ణునికి
అన్వయించి అర్థం చేసుకోవాలి.
ధ్యానసాధనలో పరిపూర్ణత సాధించిన స్థితిలో …
ఒకానొక ధ్యాని … తన మనోబుద్ధులను అతిక్రమించి
ఆత్మతో ఏకత్వం పొందుతాడు.
అంటే ధ్యానయోగికి సమస్త చరాచర ప్రాణికోటిలో
ఒకే ఆత్మ తప్ప ఇంకేమీ కనపడదు.
ఆత్మయొక్క సర్వవ్యాపకత్వం అర్థం అయి …
తనకంటే భిన్నంగా ఏదీ లేదని తెలుస్తుంది.
ఈ విధంగా సమస్తంలో తనను, తనలో సమస్తంనూ చూడగలడు.
ఒక్కటే మట్టితో రకరకాల కుండలను తయారుచేసినా,
అన్నింటిలో ఉన్న మట్టి ఒకటే కదా !
ఆభరణాలు వేరైనా బంగారం ఒకటే కదా !
కనుక ఎవరికి ఎవరూ వేరు వేరు కారు.
అంతా ఒకటే ఆత్మపదార్థం.
దాన్ని తెలుసుకోవడానికే ధ్యానం చేయాలి …
ధ్యాన సాధన చేయాలి …
ధ్యానయోగి కావాలి.
ఒకానొక “అయోగి” మరి “యోగి” అయి …
తనలో సర్వాన్నీ … సమస్తంలో తననూ చూడగలిగినప్పుడు …
అతనికంటే తాను, తనకంటే అతను వేరు కాదు అంటున్నారు … శ్రీకృష్ణపరమాత్మ !