భగవద్గీత 2-48 “ యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ | సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే || ” |
పదచ్ఛేదం
యోగస్థః – కురు – కర్మాణి – సంగం – త్యక్త్వా– ధనుంజయ – సిద్ధ్యసిద్ధ్యోః – సమః – భూత్వా – సమత్వం – యోగః – ఉచ్యతే
ప్రతిపదార్థం
ధనంజయ = ధనాన్ని జయించినవాడా ; సంగం = ఆసక్తిని ; త్యక్త్వా = విడిచి ; సిద్ధ్యసిద్ధ్యోః = సిద్ధి , అసిద్ధుల పట్ల ; సమః = సమబుద్ధి ; భూత్వా = కలిగి ; యోగస్థః = యోగస్థితిలో ఉండి ; కర్మాణి = కర్మలను ; కురు = చెయ్యి ; సమత్వం = సమత్వమే (సమత్వ బుద్ధియే) ; యోగః ఉచ్యతే = యోగమని చెప్పబడుతోంది.
తాత్పర్యం
“ ఓ ధనాన్ని జయించినవాడా ! ఆసక్తిని వదిలి, యోగస్థితిలో ఉంటూ కార్యసిద్ధి అయినా, కాకపోయినా సమభావం కలిగి కర్తవ్యకర్మలను ఆచరించు; సమత్వాన్నే ‘ యోగం ’ అని అంటారు. ”
వివరణ
“ సమత్వం ” అంటే అన్నింటినీ సరి సమానంగా చూడటం !
సమత్వమే అత్యంత గొప్పదైనది !
సమత్వమే నిజమైన “ యోగం ” అనిపించుకుంటుంది !
అనుకూల, ప్రతికూల పరిస్థితులకు అతిగా ప్రతిస్పందించక,
అన్ని పరిస్థితులలోనూ, ద్వంద్వాలలోనూ …
సమస్థితిలో ఉండడమే “ యోగం ” అనిపించుకుంటుంది.
అదే సమత్వంలో ఉండడం అంటే … యోగస్థితిలో ఉండడం అంటే.
“ యోగస్థితి ”లోనే వుంటూ ప్రాపంచిక కర్మలన్నీ చేయాలి !
‘యోగస్థితి’ లో వుండకుండా చేసే కర్మలన్నీ అనర్ధహేతువులే !
కర్మలను చేస్తూ వున్నా వాటి పట్ల ఆసక్తి రహితుడిలాగా వుండాలి !
ఫలితాలను – అవి పూర్తిగా ఫలించినా, కొద్దిగా ఫలించినా –
సమభావనతోనే గ్రహించాలి !
జీవితంలోని సకల ఆటుపోట్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరించగలిగే,
మానసిక సమత్వం నిరంతర సాధన వలన అలవడుతుంది.
అప్పుడు అనుక్షణం యోగస్థితిలోనే ఉంటూంటాం.
ఇలా యోగస్థితిలో ఉంటూ కర్మలు చేస్తూంటే …
సహజంగానే వాటి యొక్క సిద్ధి, అసిద్ధులలో … ఆనందించం, విచారించం.
కనుకనే ఆసక్తిని విడిచి, సిద్ధి అసిద్ధుల పట్ల సమభావం కలిగి ఉన్నట్టి …
యోగస్థితిలోనే కర్తవ్యకర్మలను ఆచరించమని శ్రీకృష్ణులవారి ఉద్బోధ !