భగవద్గీత 4-37
“ యథైధాంసి సమిద్ధోஉగ్నిః భస్మసాత్కురుతేஉర్జున | జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా || ” |
పదచ్ఛేదం
యథా – ఏధాంసి – సమిద్ధః – అగ్నిః – భస్మసాత్ – కురుతే – అర్జున – జ్ఞానాగ్నిః – సర్వకర్మాణి – భస్మసాత్ – కురుతే – తథా
ప్రతిపదార్థం
అర్జున = అర్జునా ; యథా = ఏ విధంగా ; సమిద్ధః , అగ్నిః = ప్రజ్వలిస్తున్న అగ్ని ; ఏధాంసి = ఇంధనాన్ని ; భస్మసాత్, కురుతే = భస్మం చేస్తుందో ; తథా = అలాగే ; జ్ఞానాగ్నిః = జ్ఞానం అనే అగ్ని ; సర్వకర్మాణి = కర్మలను అన్నింటినీ ; భస్మసాత్, కురుతే = భస్మం చేస్తుంది.
తాత్పర్యం
“ ప్రజ్వలిస్తున్న అగ్ని అన్నది కట్టెలను భస్మం చేసే విధంగానే జ్ఞానాగ్ని సమస్త కర్మలను భస్మం చేస్తుంది. ”
వివరణ
అగ్నికి ఆహుతి అయిన కట్టెలు …
ఏ రంగులో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, ఎంత పెద్దగా ఉన్నా …
చివరికి అన్నీ కాలి బూడిదగా మారిపోతాయి.
అదే విధంగా “ జ్ఞానాగ్ని ” …
ధ్యానసాధన ద్వారా ఆత్మజ్ఞానం సిద్ధించిన మానవుడిలో ప్రజ్వరిల్లిన …
“ జ్ఞానం అనే అగ్ని ” … సమస్త కర్మలనూ భస్మం చేసే శక్తి కలిగి ఉంది.
“ సమస్త కర్మలు ” అంటే … ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మలు అన్నీ కూడా అని అర్థం.
ప్రస్తుతపు పని వలన సంప్రాప్తించే కర్మ … “ ఆగామి కర్మ ”.
ముందు ముందు అనుభవించడానికి నిలువ ఉన్న కర్మ … “ సంచిత కర్మ ”
ఈ జన్మకు వచ్చే ముందు వరకూ ఉన్న సంచిత కర్మలలోంచి ఈ జన్మలో
అనుభవించడానికి స్వీయ అంగీకారంతో నిర్ణయించబడిన కర్మ … “ప్రారబ్ధ కర్మ”.
మానవుడిలో జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లినప్పుడు సమస్త కర్మలూ దగ్ధమై …
వేరే జన్మకు కారణభూతమైన కర్మ ఏదీ మిగిలి ఉండదు.