భగవద్గీత 3-13

“ యజ్ఞ శిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః |

భుఞ్జతే తే త్వఘం పాపా యే పచం త్యాత్మకారణాత్ ||

 

పదచ్ఛేదం

యజ్ఞ శిష్టాశినః – సంతః – ముచ్యంతే – సర్వకిల్బిషైః – భుఞ్జతే – తే – తు – అఘం – పాపాః – యే – పచంతి – ఆత్మకారణాత్

ప్రతిపదార్ధం

యజ్ఞ శిష్టాశినః = యజ్ఞంలో ‘మిగిలిన దానిని’ తినే ; సంతః = సజ్జనులు ; సర్వకిల్బిషైః = సమస్త పాపాల నుంచి ; ముచ్యంతే = విముక్తులు అవుతారు ; యే = ఎవరైతే ; పాపాః = పాపులు ; ఆత్మకారణాత్ = తమ శరీర పోషణ నిమిత్తం; పచన్తి = వండుకుంటున్నారో ; తే = వాళ్ళు ; తు = అయితే ; అఘం = పాపాన్ని ; భుఞ్జతే = తింటున్నారు

తాత్పర్యం

“ యజ్ఞంలో మిగిలిన దానిని తినే సజ్జనులు సమస్త పాపాల నుంచి విముక్తులు అవుతారు ; అయితే, ఏ పాపులు తమ స్వంత శరీర పోషణ నిమిత్తమే అన్నం వండుకుంటున్నారో వారు పాపాన్నే తింటున్నారు. ”

వివరణ

“ యజ్ఞావశిష్టం ” అంటే యజ్ఞాచరణ తదనంతరం

ఇతరుల ద్వారా మనకు ఏది అనాయాచితంగా లభిస్తుందో అది.

“ ఇతరులకు మనం చేయడం ద్వారా వారు సంతృప్తితో మనకు యిచ్చింది. ”

దీనినే “ మహాప్రసాదం ” అని కూడా అంటాం.

అంటే ఆ మహాప్రసాదంతోనే సంతృప్తిగా జీవించాలి !

“ మహాప్రసాదం ”తో మాత్రమే జీవించేవారు నిరంతరముక్తులు అవుతున్నారు.

అలా కాకుండా తమ కోసమే తాము చేసుకునే వంట …

అది “ పాపపు కూడు ” అవుతుంది !

కనుక ముక్తికి మార్గం ఏది ? యజ్ఞమే ముక్తికి మార్గం !

“ పునరపి జననం పునరపి మరణం ” … దీనికి కారణం ఏది ?

ఎవరికి వారు విడిగా వండుకుని, ఎవరికి వారు విడిగా భోంచేయడమే … 

నిరంతర పునర్జన్మలకు కారణం !

భోజనం ‘ విడి ’ గా ఉండరాదు ; ‘ కలివిడి ’గా ఉండాలి !