భగవద్గీత 2-50
“ బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే | తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ || ” |
పదచ్ఛేదం
బుద్ధియుక్తః – జహాతి – ఇహ – ఉభే – సుకృతదుష్కృతే – తస్మాత్ – యోగాయ – యుజ్యస్వ – యోగః – కర్మసు – కౌశలం
ప్రతిపదార్థం
బుద్ధియుక్తః = సమత్వబుద్ధి గలవాడు ; సుకృతదుష్కృతే = పుణ్యపాపాలను ; ఉభే = రెండింటినీ ; ఇహ = ఈ లోకంలోనే ; జహాతి = త్యజిస్తాడు(వాటి నుండి విముక్తుడౌతాడు) ; తస్మాత్ = అందువలన ; యోగాయ = సమత్వబుద్ధి కోసం ; యుజ్యస్వ = ప్రయత్నించు; యోగః = సమత్వరూప యోగమే ; కర్మసు = కర్మలలో ; కౌశలం = నేర్పు (కర్మబంధాల నుండి విడిపిస్తుంది)
తాత్పర్యం
“ సమబుద్ధి గలవాడు తన పాపపుణ్యాలను ఈ జన్మలోనే నశింప చేసుకుంటాడు; కాబట్టి నువ్వు కూడా అలాంటి యోగాన్ని అనుసరించి కర్తవ్య కర్మలను ఆచరించు ; యోగమే కర్మలలోని కౌశలం ”.
వివరణ
మానవుడు నిత్య కర్మిష్టి … కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా కుదరదు.
మంచిదో, చెడ్డదో ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు.
సృష్టి ధర్మం ప్రకారం పుణ్యపాపాలు, కర్మబంధాలు తగులుకుంటాయి.
తత్ఫలితంగా జన్మపరంపరలో చిక్కుకుని విలవిల్లాడుతూ ఉంటాం.
కర్మలను ఎలా ఆచరిస్తే కర్మబంధాలలో చిక్కుకోమో …
పుణ్యపాపాల నుండి విముక్తులం అవుతామో …
జన్మపరంపరలో నుండి బయటపడతామో …
ఆ కిటుకు, ఆ కౌశలం, ఆ విధానం తెలియజేస్తున్నారు శ్రీకృష్ణపరమాత్మ.
అదే … సమస్థితిలో… యోగస్థితిలో ఉండి కర్మలు ఆచరించడం.
“ సమత్వం యోగ ఉచ్యతే ”…
“ సమత్వమే యోగమని చెప్పబడుతున్నది ” అని ముందు శ్లోకంలో చెప్పారు.
ఇక్కడ “ యోగః కర్మసు కౌశలమ్ ” …
“ యోగమే కర్మలలో కౌశలం ” అంటున్నారు
సమత్వంలో ఉంటూ … యోగస్థితిలో ఉంటూ … కర్మలు చెయ్యడం అంటే …
కర్మఫలాల మీద ఆసక్తి గానీ, కోరిక గానీ లేకుండా కర్మలు చెయ్యడం.
ఇంకా కార్యం యొక్క సిద్ధి, అసిద్ధుల పట్ల సమభావం కలిగి ఉండడం.
కర్మఫలాల మీద ఆసక్తిని విడవడమంటే …
కర్మఫలాలను త్యజించి నిష్కామంగా ఉండడం.
“ సిద్ధి, అసిద్ధుల యందు సమభావం ” అంటే…
కర్మలు సిద్ధించినా, సిద్ధించకపోయినా కొంచెంగా సిద్ధించినా …
కర్మఫలాలు ఏమైనా గానీ మనస్సులో సమత్వంతో ఉండడం.
అప్పుడు, ఆకర్మలు పునర్జన్మను కలిగించే ఫలితాలను ఇవ్వలేవు.
కనుక జన్మపరంపర నుండి బయట పడగలం. కనుక కర్మఫల ఆసక్తిని వదిలి…
కార్యసిద్ధి కలిగినా, కలుగకున్నా సమస్థితిలో ఉంటూ … కర్మలను ఆచరిస్తే …
ఈ లోకంలోనే పాపపుణ్యాల నుండి విముక్తిని పొందవచ్చు.
ఎన్ని కర్మలను చేస్తూ ఉన్నా ఏ కర్మల పర్యవసానాలకూ అంటని …
రహస్యాన్ని మాత్రం అభ్యసిస్తూ ఉండాలి … అదే కర్మల్లో కౌశలం !