పుట్టుక – చావు .. చావు – పుట్టుక

 

“పుట్టిన ప్రతి ఒక్కరూ చావక తప్పదు” అన్న మౌలిక సత్యాన్ని మనం అంతా కూడా తప్పక తెలుసుకోవాలి. “పుట్టుటయు నిజము .. పోవుటయు నిజము .. నట్టనడి మీ పని నాటకము” అన్నారు అన్నమయ్య.

ఇక్కడ .. ఇప్పుడు ఈ కైలాసపురిలో “ధ్యానమహాచక్రం” అనే మహానాటకం జరుగుతోంది. ఈ నాటకంలో ధ్యానం చేసే పాత్ర ధరించడానికి మీరంతా వచ్చారు.

తమతమ వాయిద్యాలతో చక్కటి సంగీతాన్ని పలికించి అఖండ ధ్యానాన్ని రక్తి కట్టించే పాత్రను ధరించి ఈ కళాకారులంతా వచ్చారు. మీరు ఆత్మజ్ఞానం అందించే గురువు పాత్రలో నేను వచ్చాను.

హైదరాబాద్‌లోనో, ఇంకా వేరే వేరే ప్రాంతాల్లోనే మనకంటూ కుటుంబాలు ఉన్నాయి. పెళ్ళాం, పిల్లలు, ఉద్యోగ, వ్యాపారాలు ఉన్నాయి. కొందరు ఒకటో రెండో రోజులు కోసం మరి కొందరు వారం రోజుల కోసం .. ఇంకా చాలామంది పూర్తి 14 రోజులకోసం తమ తమ సకల లావాదేవీలనూ ప్రక్కన పెట్టి ఇక్కడికి వచ్చారు. నాటకం ముగియగానే అనుభవజ్ఞాన రూపంలో తమ తమ పారితోషికాలను మూటకట్టుకుని మరింత సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. స్టేజీ మీదకు వస్తాం .. స్టేజీ దిగి వెళ్ళిపోతాం! స్టేజీ దిగాక, ప్రాంగణం వదిలాక, ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక .. అక్కడ వేరే పనులుంటాయి కదా .. మరి స్టేజీ దిగడానికీ, ప్రాంగణం వదలడానికీ “ఏడవడం” ఎందుకు? ?

వివిధ నక్షత్రలోకాలకు చెందిన మనం అంతా కూడా ఆయా లోకాల్లో మనం నిర్వహిస్తున్న విశ్వ సృజనాత్మక కార్యకలాపాలను ఒకింత ప్రక్కకు పెట్టి .. ఈ “భూమి” అనే నాటకరంగం పై వివిధ పాత్రలను పోషించి మన నైపుణ్యాలను మరింత మెరుగుపెట్టుకోవడానికే ఇక్కడ జన్మ తీసుకున్నాం.

మనం ఎంచుకున్న పాత్ర నిడివిని బట్టి నాలుగు రోజులో, నలభై రోజులో, అరవై సంవత్సరాలో మరి వంద సంవత్సరాలో మన పాత్రను పోషించి దానిని రక్తికట్టించి .. “అనుభవ జ్ఞానం” అనే పారితోషికంతో మళ్ళీ మన స్వంత నక్షత్రలోకాలకు, అధవా దివ్యలోకాలకు, తిరిగి వెళ్ళిపోతాం. సాధారణంగా జరిగే ఇలాంటి రాకపోకల మధ్య “దుఃఖం” అన్న సంభావ్యత లేనే లేదు! మరి “ఏడవడం” ఎందుకు?

“All the world is stage and we are all mere actors” అన్న విలియమ్ షేక్‌స్పియర్ గారి సందేశంలోని అంతరార్థం ఇదే! “ఇక్కడ పొందిన జ్ఞానంతో మనం ఇంకా సంతోషంగా తిరిగి వెళ్ళిపోవాలి” అని తెలిపేదే ఆత్మజ్ఞానం .. మరి దానిని బోధించేదే ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం.

“పుట్టుక ‘పుట్టుక’ కాదు .. చావు ‘చావు’ కాదు” అన్న సత్యం తెలుసుకున్నవాడు మాత్రమే ఆత్మవత్ పండితుడు! అందుకే “గతించిన వాడి కోసం కానీ, గతించబోయే వాడి కోసం కానీ ఏడ్చేవాడు పండితుడు ఎన్నటికీ కాజాలడు” అన్నారు శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో.

“నానాటి బ్రతుకు నాటకము .. కానక కన్నది కైవల్యము” అన్నారు అన్నమాచార్యుల వారు. నరుడిలా సాధారణ చర్మచక్షువులతో క్రింది నుంచి క్రిందికి ఈ నాటకాన్ని చూస్తూ వుంటే అంతా దుఃఖమే కనపడుతుంది.

నారాయణుడిలా పై నుంచి క్రిందికి దివ్యచక్షువుతో ఈ మానవాళిని చూస్తే .. ఈ ప్రపంచం అంతా కూడా ఒక నాటకరంగంలా కనిపిస్తూ అందులో మన పాత్ర పోషణ మనకు స్పష్టంగా తెలుస్తుంది. మన పాత్రపోషణ మనకు అవగతమైనప్పుడు మనం జీవితనాటకాన్ని అర్ధం చేసుకుని క్రిందికి దిగి వచ్చి ఇతర పాత్రధారులతో కూడి చక్కటి సమన్వయంతో నాటకాన్ని రక్తి కట్టించగలుగుతాం!