భగవద్గీత 3-5
“ న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ | కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః || ” |
పదచ్ఛేదం
న – హి – కశ్చిత్ – క్షణం – అపి – జాతు – తిష్ఠతి – అకర్మకృత్ – కార్యతే – హి – అవశః – కర్మ – సర్వః – ప్రకృతిజైః – గుణైః
ప్రతిపదార్ధం
హి = నిస్సందేహంగా ; కశ్చిత్ = ఏ మానవుడు కూడా ; జాతు = ఏ సమయంలో కూడా ; క్షణం = రెప్పపాటు కాలం ; అపి = అయినప్పటికీ ; అకర్మకృత్ = ఏ పని చేయకుండా ; న తిష్ఠతి = ఉండలేడు ; హి = ఎంచేతంటే ; సర్వః = సమస్త మనుష్య సముదాయం ; ప్రకృతిజైః = ప్రకృతి వల్ల జన్మించిన ; గుణైః = గుణాల ద్వారా ; అవశః = వివశుడై ; కర్మ = కర్మాచరణకు కార్యతే = బాధ్యత వహిస్తోంది.
తాత్పర్యం
“ నిస్సందేహంగా ఏ మానవుడైనా కూడా ఎలాంటి సమయంలోనైనా కర్మచేయకుండా క్షణకాలం అయినా వుండలేడు ! ఎంచేతంటే ప్రకృతి వల్ల జన్మించబడిన గుణాలకు లోబడే మానవ సముదాయం అంతా కర్మాచరణకు ఉపక్రమిస్తోంది. ”
వివరణ
సత్త్వ, రజ, స్తమో గుణాలు త్రిగుణాలు ; త్రిగుణాలు మానువుడి నైజాలు.
ఈ గుణాలకు అనుగుణంగానే మానవుడు వివిధ కర్మలను చేస్తుంటాడు.
ఈ గుణాల సమాహారమే “ప్రకృతి”; ఈ గుణ వ్యవస్థనే “ప్రకృతి” అంటాం.
జీవాత్మల వివిధ కర్మలే ప్రకృతి! జీవాత్మల వివిధ కర్మ సముచ్చయాలే ప్రకృతి!
ప్రకృతి ఒక మహా కర్మఫలసముద్రం ! అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది.
ఆ ప్రకృతిలో … ఆ కర్మఫలమహాసముద్రంలో …
ప్రతి మనిషీ ఒకానొక ‘అల’ మాత్రమే;
ఒకానొక ‘అలజడి’ మాత్రమే !
అహంకారం చేత ప్రేరేపింపబడిన కోరికలతో …
తాను చేసే వివిధ క్రొత్తక్రొత్త కర్మల ద్వారా మనిషి
ఎప్పటికప్పుడు … మళ్ళీ మళ్ళీ .. క్రొత్త క్రొత్త
వాసనలను తగిలించుకుంటూ ఉంటాడు …
క్రొత్త సంస్కారాలను పొందుతూ ఉంటాడు.
కువాసనలను పోగొట్టుకోడానికీ … మరి
సువాసనలను సుదృఢం చేసుకోవడానికీ మళ్ళీ
మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటాడు …
జనన మరణ చక్రంలో పడి నలుగుతూనే ఉంటాడు.
కనుకనే మనిషి కర్మసంజాతుడు … కర్మలలోంచి పుట్టినవాడు !
మనోబుద్ధులు ఉన్న ఏ మనిషీ కూడా మేలుకుని ఉన్నంత సేపూ …
ఏ పనీ చెయ్యకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు.
శరీరం విశ్రాంతిగా ఉన్నా, మనోబుద్ధుల ద్వారా …
ఎప్పుడూ ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు.
తినడం, త్రాగడం, నిద్రించడం, లేవడం … ఇలాంటివన్నీ కూడా కర్మలే.
కనీసం ఇవైనా చెయ్యకుండా ఎవ్వరూ ఉండలేరు కాబట్టి …
మనిషి కర్మలకు “వివశుడు” … అంటే … కర్మలకు వశం అయినవాడు !
మనిషి ఎప్పటికీ కర్మశూన్యుడు కాజాలడు !
‘కర్మ శూన్య స్థితి’ అన్నది అసంభవం !
మనిషి కర్మపూర్ణుడు … రకరకాల కర్మలను సదా చేస్తూనే వుంటాడు !
అంతర్ గుణాలకు మూలం అనంతమైన బహిః కర్మలు !
అనంతమైన బహిః కర్మలకు మూలాలు అంతర్ గుణాలు ! ఇదీ పరిస్థితి !
Recent Comments