భగవద్గీత 11-8
“ న తు మాం శక్యసే ద్రష్టుమ్ అనేనైవ స్వచక్షుషా | దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్ || ” |
పదచ్ఛేదం
న – తు – మాం – శక్యసే – ద్రష్టుం – అనేన – ఏవ – స్వచక్షుషా – దివ్యం – దదామి – తే – చక్షుః – పశ్య – మే – యోగం – ఐశ్వరం
ప్రతిపదార్థం
తు = కాని ; మాం = నన్ను ; అనేన = ఈ ; స్వచక్షుషా = చర్మచక్షువులతో ; ద్రష్టుం = చూడడానికి ; ఏవ = నిస్సందేహంగా ; న, శక్యసే = సమర్థుడవు కావు ; (అతః = ఇందువలన) ; తే = నీకు ; దివ్యం = దివ్యమైన ; చక్షుః = ద్రుష్టిని ;
దదామి = ఇస్తాను ; మే, ఐశ్వరం, యోగం = నా దివ్య యోగ శక్తిని ; పశ్య = చూడు
తాత్పర్యం
“ కాని, సామాన్య దృష్టితో నువ్వు నన్ను చూడలేవు కనుక, నీకు దివ్యదృష్టిని ప్రసాదిస్తున్నాను ; అపురూపమైన నా విశ్వరూపాన్ని ఆ చూపుతో చూడు. ”
వివరణ
“ ఆత్మ దర్శనం ” .. “ పరమాత్మ దర్శనం ” … “ బ్రహ్మాత్మ దర్శనం ” …
స్థూల దృష్టికి లభించేవి కాదు …
చర్మచక్షువుల దృష్టికి గోచరమయ్యేది కాదు …
సూక్ష్మాతి సూక్ష్మమైన, ఇంకా సమస్త సృష్టిలో అంతటా వ్యాపించి ఉన్న …
ఆత్మ దర్శనానికి … పరమాత్మ దర్శనానికి … బ్రహ్మాత్మ దర్శనానికి …
దివ్యచక్షువులు కావాలి … జ్ఞాననేత్రాలు కావాలి …
అవి ధ్యాన సాధన ద్వారా మాత్రమే … యోగసాధన ద్వారా మాత్రమే … తనకు
తానుగా మాత్రమే సిద్ధింప చేసుకునేవి ;
అది అలౌకిక శక్తి … అలౌకిక దృష్టి !
“ ఆ దివ్యదృష్టిని నేను నీకు ప్రసాదిస్తున్నాను ” అన్నప్పుడు
అది ఒక అద్భుతమైన ఘడియ, ఒక అద్భుతమైన సన్నివేశం !
సర్వసాధారణంగా అది జరిగే పని కాదు.
అయినా, “ Every rule has an exception ” అన్నట్లుగా …
ఆ సూత్రాన్ని ఆధారం చేసుకుని ఆ సన్నివేశాన్ని రూపకల్పన చేశారు వేదవ్యాసులవారు.