భగవద్గీత 2-40
“ నేహాభిక్రమనాశోஉస్తి ప్రత్యవాయో న విద్యతే | స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ || ” |
పదచ్ఛేదం
న – ఇహ – అభిక్రమనాశః – అస్తి – ప్రత్యవాయః – న – విద్యతే – స్వల్పం – అపి – అస్య – ధర్మస్య – త్రాయతే – మహతః – భయాత్
ప్రతిపదార్థం
ఇహ = ఈ యోగంలో ; అభిక్రమనాశః = ఆరంభించినది నాశనం ; న అస్తి = ఉండదు ; ప్రత్యవాయః = విపరీతమైన దోషం కూడా ; న, విద్యతే = ఉండదు ; అస్య = ఈ ; ధర్మస్య = ధర్మం యొక్క ; స్వల్పం, అపి = ఏ కొంచెం సాధన అయినా ; మహతః భయాత్ = గొప్ప భయం నుంచి ; త్రాయతే = కాపాడుతుంది.
తాత్పర్యం
“ ఈ యోగంలో ప్రారంభించితే నాశనం ఉండదు ; పైగా విపరీత దోషం కూడా ఉండదు ; ఈ ధర్మం స్వల్పమైనా గొప్ప భయం నుంచి రక్షిస్తుంది. ”
వివరణ
ఈ యోగంలో … ఎంత ఆచరిస్తూ ఉంటే, ఎంత కృషి చేస్తూ ఉంటే,
అంత ఫలితం తప్పకుండా ఉంటుంది.
అలాగే వైదిక కర్మాచరణ సక్రమంగా జరగని పక్షంలో
‘ ప్రత్యవాయము ’ అనే దోషం కలుగుతుంది.
కానీ ఈ యోగం కొద్దిగా చేసినా గాని
జనన మరణ సంసార మహాభయం నుండి ఉద్ధరిస్తుంది.
“ సత్ విద్య ” అభ్యాసం కొంచెం అయినా అది గొప్పదే.
“ అసత్య విద్య ”ను కొంచెం తలపెట్టినా అది అనర్థదాయకమే.
“ ఆత్మ విద్య ” ను కొంచెం తెలుసుకున్నా అది సాటిలేనిదే.
“ యోగ సాధన ”ను కొంచెం చేసినా అది సాటిలేని ఫలితాన్ని ఇస్తుంది.
“ ధర్మా”న్ని కొద్దిగా ఆచరించినా అది ఎంతో లాభదాయకమే.
“ అధర్మా ”నికి కొద్దిగా తల ఒగ్గినా అది ఎంతో నష్టదాయకమే.
“ సన్మార్గం ”లో ప్రారంభించినది ఏదీ ఎప్పటికీ వృథా కాజాలదు.
“ ధర్మమార్గం ” లో ప్రారంభించి,
ఎంత చేస్తే అంత భవిష్యత్తుకు పునాది అవుతుంది.