భగవద్గీత 18-73 “నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయా చ్యుత | |
పదచ్ఛేదం
నష్టః – మోహః – స్మృతిః – లబ్ధా – త్వత్ప్రసాదాత్ – మయా – అచ్యుత – స్థితః – అస్మి – గతసందేహః – కరిష్యే – వచనం – తవ
ప్రతిపదార్థం
అచ్యుత = నాశనము లేనివాడా ; త్వత్ప్రసాదాత్ = నీ అనుగ్రహం వల్ల ; (మమ) మోహః = (నా) మోహం ; నష్టః = (పూర్తిగా) తొలగింది ; మయా = నాచేత ; స్మృతిః = జ్ఞాపకం ; లబ్ధా = పొందబడింది ; గత సందేహః = సందేహాలు తొలగిపోయినవాడనుగా ; స్థితః, అస్మి = కుదుట పడ్డాను ; తవ, వచనం కరిష్యే = నీ ఆజ్ఞను పరిపాలిస్తాను
తాత్పర్యం
” కృష్ణా, నీ అనుగ్రహం వల్ల నా మోహం నశించింది ; జ్ఞానం కలిగింది ; నా యొక్క సందేహాలు తీరిపోయాయి ; ఇప్పుడు నేన కుదుట పడ్డాను ; ఇక నీ అజ్ఞానుసారం నడచుకుంటాను. “
వివరణ
గీతా బోధ అంతా విన్న తరువాత అర్జునుడికి అజ్ఞానం నశించింది.
ఆ పాత స్మృతులన్నీ తిరిగి గుర్తుకువచ్చాయి …
ధ్యానసాధనలో మనస్సు శూన్యమైపోయినప్పుడు
జన్మ పరంపర అంతా జ్ఞాపకానికి వస్తంది.
అర్జునుడు ఒకానొక పురుషోత్తముడు.
“ప్రాపంచిక మోహం ” అతనిని ఎప్పుడూ అంటలేదు.
ఆ యుద్ధ సమయంలో అతనికి “ఆధ్యాత్మిక మోహం”
కేవలం క్షణమాత్రం “గ్రహణం” లా పట్టింది.
అయితే, గీతాబోధ వలన అది మరుక్షణం విడివడింది.
“ఓ కృష్ణా, నా యొక్క మోహం నశించింది.
నువ్వు చెప్పినట్టే గాండీవం చేపట్టి ధర్మసంస్థాపన చేసి తీరతాను …
నీ ఆజ్ఞానువర్తినై నడుస్తాను” అంటున్నాడు అర్జునుడు.
సందేహాలు వున్నంతవరకు మనం ఏం చెయ్యాలో,
ఏంచెయ్యకూడదో తెలియని దుఃస్థితిలో వుంటాం …
అయితే సందేహాలన్నీ తొలగినప్పుడు …
ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో క్షుణ్ణంగా తెలిసినప్పుడు
వెంటనే రంగంలోకి దూకుతాం. కర్తవ్యంలో నిమగ్నం అవుతాం.
ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు?
“క్షుద్రం హృదయ దౌర్భల్యం ” … “హృదయ దౌర్భల్యం తుచ్ఛమైనది”
” గతాసూన్ అగతాసూంశ్చ
నాను శోచంతి పండితాః ” … ” చనిపోయిన వారిని గురించి కానీ, జీవించి వున్న వారి గురించి కానీ పండితులు శోకించరు”
“అహమాత్మా గుడాకేశ ” … ‘ నేను ’ అనేది ‘ ఆత్మ ’ అని తెలుసుకో, ఓ అర్జునా |
“న హన్యతే హన్యమానే శరీరే ” … “శ రీరం చంపబడితే ఆత్మ చంపబడదు”
“యోగో భవతి దుఃఖహా ” … “ధ్యానయోగాభ్యాసం వల్లనే దుఃఖం హరిస్తుంది”
“సమత్వం యోగ ఉచ్యత” … అన్ని పరిస్థితులలోనూ సమంగా వుండడమే యోగం అనిపించుకుంటుంది “
“శ్రద్ధవాన్ లభతే జ్ఞానం ” … “శ్రద్ధ కలిగినవాడికే జ్ఞానం లభిస్తుంది”
“జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం ” … “ఆత్మజ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధమవుతాయి”
” బుద్ధి నాశాత్ ప్రణశ్యతి ” … ” బుద్ధి లేకపోవడమే ఆత్మ వినాశనం “
“కర్మణ్యేవాధికారస్తే మా
ఫలేషు కదాచన ” … “కర్మలు చెయ్యడానికే అధికారం వుంది కానీ వాటి ఫలితాలపైన ఎప్పటికీ లేదు”
“కర్మ జ్యాయో హ్యకర్మణః ” … “కర్మలు తక్కువ చెయ్యడం కంటే కర్మలు ఎక్కువ చెయ్యడమే మంచిది”
“యోగః కర్మసు కౌశలమ్ ” … “ధ్యానయోగం ద్వారానే కర్మల్లో కౌశలం వస్తుంది”
“యోగస్థః కురు కర్మాణి ” … “యోగస్థితిలో వుండే కర్మలను చెయ్యాలి”
“తస్మాత్ యోగీ భవార్జున ” … “కనుక ధ్యానయోగివి కా, అర్జునా |”
“నిస్త్రైగుణ్యో భవార్జున ” … “త్రిగుణాలకు అతీతుడవు కా, అర్జునా |”
“ఉద్ధరేదాత్మనాత్మానం ” … “ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి “
“హతో వా ప్రాప్యసి స్వర్గం ” … “చనిపోయాక స్వర్గాన్ని పొందుతావు”
“యుద్ధస్య విగత జ్వరః ” … “ఎంతమాత్రం ఆవేశం లేకుండా యుద్ధం చెయ్యి”
“యథేచ్చసి తథాకురు ” … “నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి “
“నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్రసాదాన్మయా అచ్యుత |
స్థితో అస్మి గతసందేహః కరిష్యే వచనం తవ ||”