భగవద్గీత 2-45
“ త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున | నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ || ” |
పదచ్ఛేదం
త్రైగుణ్యవిషయాః – వేదాః – నిస్త్రైగుణ్యః – భవ – అర్జున – నిర్ద్వంద్వః – నిత్యసత్త్వస్థః – నిర్యోగక్షేమః – ఆత్మవాన్
ప్రతిపదార్థం
అర్జున = ఓ అర్జునా ; వేదాః = వేదాలు ; త్రైగుణ్యవిషయాః = త్రిగుణాత్మకమైన విషయాలు కలవి ; నిస్త్రైగుణ్యః = త్రిగుణాలలో ఆసక్తిలేకుండా ; నిర్ద్వంద్వః = హర్షశోకాది ద్వంద్వాలు లేకుండా ; నిత్యసత్త్వస్థః = నిరంతరం శుద్ధసత్వ గుణంలో ఉంటూ ; నిర్యోగక్షేమః = యోగక్షేమాలే లేనటువంటి ; ఆత్మవాన్ = ఆత్మజ్ఞానివిగా ; భవ = ఉండు
తాత్పర్యం
“ ఓ అర్జునా ! వేదాలు త్రైగుణ్యవిషయాలను గురించే చెపుతున్నాయి ; నువ్వు త్రిగుణాతీతుడవుకా ! ద్వంద్వాలనూ, యోగక్షేమాలనూ విడిచి సదా శుద్ధసత్వాన్ని అవలంబించి, ఆత్మజ్ఞానివి కావాలి; ఆత్మతత్త్వంలోనే స్థిరపడు. ”
వివరణ
తమో, రజో, సత్త్వగుణాలే త్రిగుణాలు.
త్రిగుణాల గురించే ప్రస్తావిస్తున్నాయి వేదాలు.
“ తమోగుణం ” … అంటే తనువుకు సంబంధించిన విషయాలు.
“ రజోగుణం ” … అంటే మనస్సుకు సంబంధించిన విశేషాలు.
“ సత్త్వగుణం ” … అంటే శ్రేయస్సుకు సంబంధించిన సూత్రాలు.
త్రిగుణాల వల్ల ఏర్పడేవి కోరికలు. కోరికలను తీర్చుకునేందుకు కావలసిన
వస్తువుల కోసం చేసే కర్మకాండ అంతా “ త్రైగుణ్యవిషయాలు ”.
త్రిగుణాలను అధిగమించడం అంటే … శరీర మనోబుద్ధులను అధిగమించడమే.
మనో బుద్ధులను అధిగమించి … నిరంతరం నిత్యసత్త్వస్వరూపమైన ఆత్మలో
స్థితమవడమే “ నిత్యసత్త్వస్థుడు ”, “ ఆత్మవంతుడు ” కావడం అంటే !
సుఖదుఃఖాలు, శీతోష్ణాలు, మానావమానాలు … ఇవన్నీ ద్వంద్వాలు.
మనిషి జీవితంలో తటస్థపడే సమస్త అనుభవాలూ ద్వంద్వాలే.
వీటినుండి బయటపడటమే “ ద్వంద్వాతీతుడు కావడం ” అంటే.
భౌతిక పరిభాషలో మన దగ్గర లేని వాటిని పొందడాన్ని “ యోగం ” అనీ,
పొందినదాన్ని రక్షించుకోవడాన్ని “ క్షేమం ” అనీ అంటాం.
మనం సాధారణంగా చేసే ప్రతి కర్మ కూడా యోగక్షేమాలకు సంబంధించినదై
ఉంటుంది. ఈ యోగక్షేమాలనుండి బయటపడితే కర్మల నుండి బయటకి వచ్చేస్తాం.
ఆత్మకు “ యోగం ” … అంటే “ అభివృద్ధి ” ఎక్కడ? !
ఆత్మకు “ క్షేమం ” … అంటే “ శ్రేయస్సు ” అన్నది ఎక్కడ? !
శాస్త్రీయమైన వాక్కు, శాస్త్రీయమైన ఆలోచన, శాస్త్రీయమైన కర్మ వుండాలి.
వివేకంతో ఆలోచించాలి … మాట్లాడాలి … జీవించాలి.
ఆత్మతత్త్వంలో స్థిరపడి … ఆత్మవంతుడిగా జీవించి … ఆత్మజ్ఞానులం కావాలి!