భగవద్గీత 9-21
“ తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి | ఏవం త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభన్తే || ” |
పదచ్ఛేదం
తే – తం – భుక్త్వా – స్వర్గలోకం – విశాలం – క్షీణే – పుణ్యే – మర్త్యలోకం – విశంతి – ఏవం – త్రయీధర్మం – అనుప్రపన్నాః – గతాగతం – కామకామాః – లభన్తే
ప్రతిపదార్థం
తే = వారు ; తమ్ = ఆ; విశాలం = విశాలమైన ; స్వర్గలోకం = స్వర్గలోకాన్ని ; భుక్త్వా = అనుభవించాక ; పుణ్యే = పుణ్యాలు ; క్షీణే = క్షీణించగానే ; మర్త్యలోకం = మనుష్యలోకాలలో ; విశంతి = ప్రవేశిస్తారు ; ఏవం = ఈ ప్రకారంగా ; త్రయీధర్మం = మూడు రకాల ధర్మాలను ; అనుప్రపన్నాః = ఆశ్రయించేవారు ; కామకామాః = భోగాలను ఆశించినవారై ; గతాగతం = (స్వర్గమర్త్యలోకాల మధ్య) రాకపోకలను ; లభన్తే =పొందుతున్నారు
తాత్పర్యం
“ చనిపోయిన వారు విశాలమైన స్వర్గలోకంలో పుణ్యం క్షీణించిపోయేదాకా అనుభవించి తరువాత భూలోకంలో జన్మిస్తారు ; మూడు ధర్మాలను అనుష్ఠించే కామాభిలాషులు జనన మరణాలు అనే రాకడపోకడలను పొందుతున్నారు.”
వివరణ
“ విశాలమైనట్టిది స్వర్గలోకం ” అని చెబుతున్నారు వేదవ్యాసులవారు
అక్కడ .. ” “ ఆ విశాలమైన స్వర్గలోకాలలో ”…
భూలోకంలో చేసుకున్న పుణ్యం పూర్తయ్యేదాకా అనుభవించి …
మళ్ళీ తిరిగి ఈ లోకానికి వస్తాం
అయితే “ చనిపోయిన వెంటనే ” తిరిగి రాము
యాత్రలకు తీసుకెళ్ళిన డబ్బులు ఖర్చు అయిపోయిన తర్వాత …
ఇంటికి తిరిగి వచ్చినట్టు …
చేసుకున్న పుణ్యం కాస్తా స్వర్గలోకాలలో ఖర్చుపెట్టేసుకున్న తర్వాత …
అప్పుడు తిరిగి ఈ భూలోకంలో జన్మిస్తాం.
ఎన్నో లోకాలు ఉన్నాయి :
భువర్లోకాలు, సువర్లోకాలు, జనలోకాలు, మహాలోకాలు, తపోలోకాలు,
సత్యలోకాలు … ఎన్నెన్నో లోకాలు.
దేనికోసం ఈ భూలోకంలో మళ్ళీ జన్మలు తీసుకుంటున్నాం?
అనేక రకాల ధర్మాలు ఉన్నాయి.
“ శరీరధర్మం ” .. “ సంఘధర్మం ” .. “ ఆత్మధర్మం ” అనే త్రివిధ ధర్మాలు ఉన్నాయి.
భౌతిక శరీరం కోసం నిర్వర్తించవలసిన కార్యక్రమాలు ఉంటాయి …
ఇవి “ శరీరధర్మం ” క్రిందికి వస్తాయి.
ఏ కుటుంబంలో పుడ్తామో ఆ కుటుంబాన్ని చూసుకోవాలి … అది “కుటుంబధర్మం ”.
ఏ సంఘంలో పెరుగుతామో ఆ సంఘాన్ని చూసుకోవాలి …
అది “ సంఘధర్మం ” .
“ కుటుంబ ధర్మం ” అన్నది “ సంఘధర్మం ”లో అంతర్భాగం.
అయితే, ఆత్మగురించి తెలుసుకోలేదు కనుక …
ఆత్మజ్ఞానం పొందలేదు కనుక …
మళ్ళీ మళ్ళీ జన్మించాల్సి వస్తుంది.
మరి ఈ రాకడ పోకడలను వదిలించుకోవాలంటే …
“ ఆత్మధర్మం ” అన్నది సరిగ్గా నిర్వర్తించాలి.
అంటే …“ ఆత్మ ” గురించి తెలుసుకోవాలి …
ఒకసారి ఆత్మ గురించి తెలుసుకుంటే … “ ఆత్మధర్మం ” నిర్వర్తిస్తే …
మళ్ళీ శరీరం ఉండదు … శరీరధర్మం ఉండదు ;
“ కుటుంబం ” ఉండదు … “ కుటుంబధర్మం ” ఉండదు ;
“ సంఘం ” ఉండదు …“ సంఘధర్మం ” ఉండదు
ఆ ఊర్ధ్వలోకాల్లో హాయిగా … సదా విహరిస్తూనే ఉంటాం.
రావాలనుకుంటే వస్తాం … మాస్టర్స్గా ఇతరులకు ధ్యానం చెప్పడానికి
లేకపోతే రానే రాము … రానక్కరలేదు
“క్షీణే పుణ్యే ” అంటే “ పుణ్యం క్షీణించిన తరువాత ”
స్వర్గలోకాలలో కొంతకాలం వున్న తరువాత
తిరిగి భూలోకం లోనికి వస్తూంటాం.
ఎంత వరకు? …
ఆత్మమోక్షం సంపాదించేంత వరకు
“ గతాగతం ” అంటే “ గత అగత ”
“ వెళ్ళడం రావడం ” అన్నమాట
“ స్వర్గలోకాలకు వెళ్ళడం ” … “ తిరిగి అక్కడ నుంచి రావటం ” అన్నమాట
“ కామకామా ” అంటే ” కామ … అకామ ” అంటే
“ కోరికల వల్ల, మరి కోరికలను అధిగమించడం వల్ల ” అని అర్థం.
“ సరి అయిన కోరికలను ” ఆవిష్కారం చేసుకుంటూ …
ఆ సరి అయిన కోరికలను సాధించుకుంటూ …
మరి ఆ భూలోకాలకు మాత్రమే సరి అయిన కోరికలను …
అధిగమిస్తూ వుండాలి కూడా.