భగవద్గీత 4-34
“ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా | ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః || ” |
పదచ్ఛేదం
తత్ – విద్ధి – ప్రణిపాతేన – పరిప్రశ్నేన – సేవయా – ఉపదేక్ష్యంతి – తే – జ్ఞానం – జ్ఞానినః – తత్త్వదర్శినః
ప్రతిపదార్థం
తత్వదర్శినః = పరమాత్మతత్వం తెలిసిన ; జ్ఞానినః = జ్ఞానులు ; జ్ఞానం = ఆత్మజ్ఞానాన్ని ; తే = నీకు ; ఉపదేక్ష్యంతి = ఉపదేశిస్తారు ; ప్రణిపాతేన = సాష్టాంగ నమస్కారం చేసి ; సేవయా = సేవచేసి ; పరిప్రశ్నేన = వినయంతో ప్రశ్నించి; తత్ = ఆ తత్వజ్ఞానాన్ని ; విద్ధి = తెలుసుకో.
తాత్పర్యం
“ తత్త్వదర్శనులైన వారికీ, జ్ఞానులకూ, సాష్టాంగ నమస్కారం చేసి, వినయంతో ప్రశ్నించి, శుశ్రూష చేసి, ఆత్మతత్వం తెలుసుకోవాలి. ”
వివరణ
తత్త్వదర్శనం చేసిన బ్రహ్మజ్ఞానులను …
ఏ విధంగా సేవించి, ప్రశ్నించి, జ్ఞానాన్ని పొందాలి ?
విద్య నేర్చుకోవాలనుకునే శిష్యుడికి ఉండవలసిన గుణాలేమిటి ?
సత్యం తెలుసుకోవాలనే కోరిక గల “ సరి అయిన శిష్యుడు ” ఉంటే …
అజ్ఞానాన్ని తొలగించడానికి గురువు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు.
“ ప్రణిపాతేన ” … సాష్టాంగ నమస్కారం చేసి …
“ పరిప్రశ్నేన ” … వినయంతో ప్రశ్నించి …
“ సేవయా ” … సేవ చేసి …
ఈ మూడు లక్షణాలు శిష్యుడికి ఉండాలి … అంటున్నారు శ్రీవేదవ్యాసులవారు.
“ సాష్టాంగ నమస్కారం ” అంటే ఎనిమిది అంగాలతో చేసే నమస్కారం.
చేతులు రెండు, కాళ్ళు రెండు, మొండెం ఒకటి, తల ఒకటి, మనస్సు ఒకటి,
బుద్ధి ఒకటి … ఈ ఎనిమిదీ కలిపి చేసే నమస్కారమే … “ సాష్టాంగ నమస్కారం ”.
కేవలం శరీరంతోనే కాదు, మనస్సునూ, బుద్ధినీ కూడా కలిపి … నమస్కరించాలి.
భౌతికకాయం మాత్రమే కాకుండా, మనఃకాయం, బుద్ధికాయం కూడా కలిపి … ప్రణమిల్లాలి. “ పరిప్రశ్నేన ” అంటే సూటి ప్రశ్నలు వేయాలి.
ఆధ్యాత్మిక గురువుల దగ్గరకు “ ఆధ్యాత్మికత ” కోసం …
ఆత్మజ్ఞానం కోసం వెళ్ళాలి … ప్రాపంచిక విషయాల కోసం కాదు.
వినయంగా స్పష్టమైన … సరియైన ఆధ్యాత్మిక ప్రశ్నలు వేయాలి.
ఆ తరువాత … ఆ గురువు ఏదన్నా కొంచెం సేవ చేయమని కోరితే … తప్పకుండా ఆ సేవ చేయాలి.
ఎవరో బలవంతం చేస్తే గురువుగారి దగ్గరకు వెళ్ళి చేసే మొక్కుబడి “ సేవ ”
కాదు, మనఃపూర్తిగా చేసేదే “ సేవ ”. సేవ అంటే గురువుకు శుశ్రూష
చేయడమనే కాదు … “ స్వంత పని ” అనేది లేకుండా ఎల్లప్పుడూ
గురువుగారి ద్వారా జరిగే లోకకళ్యాణ కార్యాల వినియోగార్థం … తన్, ధన్, మనస్సులను లగ్నం చేసి ఉంచడమే నిజమైన సేవ.
ఈ ప్రపంచంలో జ్ఞానులు, తత్త్వాన్ని దర్శించినవారు ఎంతో మంది ఉన్నారు.
అందరి దగ్గర నుండీ ఆ జ్ఞానాన్ని పొందాలి.