భగవద్గీత 2-3

        “ క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |

        క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప! || ”

పదచ్ఛేదం

క్లైబ్యంమాస్మగమఃపార్థఏతత్త్వయిఉపపద్యతేక్షుద్రంహృదయదౌర్బల్యంత్యక్త్వాఉత్తిష్ఠపరంతప 

ప్రతిపదార్థం

పార్థ = అర్జునా ! ; క్లైబ్యం = నపుంసకత్వాన్ని (పిరికితనాన్ని) ; మా, స్మ, గమః = పొందవద్దు ; త్వయి = నీకు ; ఏతత్ = ఇది ; ఉపపద్యతే = తగదు; పరంతప = శత్రువులను తపింపచేసేవాడా ! ; క్షుద్రం=తుచ్ఛమైన ; హృదయ దౌర్బల్యం = హృదయ దౌర్బల్యాన్ని ; త్యక్త్వా = త్యజించి ; ఉత్తిష్ఠ = లే

తాత్పర్యం

పార్థా ! పిరికితనాన్ని తెచ్చుకోవద్దు ; అది నీకు ఎంత మాత్రమూ తగదు ; తుచ్ఛమైన హృదయదౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడవు కా ! ”

వివరణ

హృదయ దౌర్బల్యం, అధైర్యం, పిరికితనం అనేవి … 

మనస్సులోకి ప్రవేశించగానే బుద్ధి పనిచెయ్యడం మానేస్తుంది

విచక్షణా జ్ఞానం నశిస్తుంది.

కనుకనే తనకు సాటి ఎవరూ లేని మేటి వీరుడుమరి

శత్రువులను తపింప చేసినవాడు అయిన అర్జునుడు కూడా

తనలోని అంతఃశత్రువులైన హృదయ దౌర్బల్యానికీ, పిరికితనానికీ లోనై

యుద్ధం చెయ్యకూడదుఅన్న తగని నిర్ణయానికి వచ్చాడు.

ఒకానొక బుద్ధిశాలి ఎప్పుడూ వర్తమాన పరిస్థితుల వైపు కాక,

అంతిమలక్ష్యం వైపు దృష్టి పెట్టాలి.

విజ్ఞతయే ధర్మయుద్ధానికి మూలం ;

ధర్మయుద్ధమే అంతిమ విజయానికి మార్గం.

జీవన సమరంలో వెనుకడుగు వేసే ప్రతి సందర్భంలోనూ

మన అడుగులు ముందుకు వేస్తూంటే

గమ్యం చేరువ అవుతూ ఉంటుంది

చివరికి లక్ష్యాన్ని చేరుతాం !

అదేవిధంగా

ధ్యానయోగసాధనలో కలిగే విఘ్నాలను కూడా

ప్రతి ధ్యానయోగ సాధకుడు ధైర్యంగా ఎదుర్కొని నిలవాలి.

నిరాశా, నిస్పృహలకు లోను కారాదు.

అంతఃశత్రువులైన అరిషడ్వర్గాలతో అంతర్యుద్ధం చెయ్యాలి.

తమ అంతిమలక్ష్యమైన ఆత్మానుభూతినీ, జన్మరాహిత్యాన్నీ సాధించాలి.