కొంగ్రొత్త తులసీదళాలు
నోటిలోని శూన్యత – మౌనం.
మనస్సులోని శూన్యత – ధ్యానం.
శ్వాస విత్తు అయితే, ధ్యానం అన్నది వృక్షం కాదు.
ధ్యానం వృక్షం అయితే, దివ్యచక్షువు అన్నది ఫలం కదా.
కూసంత శ్వాస – కొండంత సంజీవని.
కూసంత శ్వాస – ఏనుగంత కామథేనువు.
కూసంత శ్వాస – మణుగంత చింతామణి.
కూసంత శ్వాస – వట వృక్షమంత కల్పతరువు.
కూసంత శ్వాస – సముద్రమంత అక్షయపాత్ర.
తింటే గారెలే తినాలి.
వింటే భారతమే వినాలి.
చేస్తే శ్వాస – ధ్యానమే చేయాలి.
చదివితే పిరమిడ్ పుస్తకాలే చదవాలి.
కడితే పిరమిడ్లే కట్టాలి.
మాట్లాడితే ఒక బుద్ధుడే మాట్లాడాలి.
ధ్యానం ఒక పుష్పమయితే,
ధ్యాన ప్రచారం అన్నది పుష్పం యొక్క సువాసన, గుబాళింపు.
సువాసన లేని పుష్పం … పుష్పమా?
ధ్యాన ప్రచారం లేని ధ్యానం ఒక ధ్యానమా?
మనం మానవులము కాదు
మానవ శరీరధారులమైన ఆత్మలము.
మనం దిగి వచ్చిన దేవుళ్ళము.
వృక్ష సామ్రాజ్యాన్ని పోషించటానికి వచ్చిన దేవుళ్ళము.
జంతు సామ్రాజ్యానికి సంరక్షించటానికి వచ్చిన దేవుళ్ళము.
భూమండలాన్ని నందనవనంగా తీర్చిదిద్దటానికి వచ్చిన దేవుళ్ళము.
ఊరికే తిని కూర్చుంటే మామూలు ఆత్మ,
తాగితందనాలాడితే మూర్ఖాత్మ,
మరొకరికి హాని చేస్తే దుస్టాత్మ.
ప్రజాసేవకు సర్వస్వం అంకితం చేస్తే మహాత్మ.
తనను తాను సృష్టికర్తగా తెలుసుకుంటే పరమాత్మ.
హింసా ఛోడో – హంసా పకడో,
ప్రార్థనా ఛోడో – సాధనా పకడో.
పరతంత్రతా ఛోడో – స్వతంత్రతా పకడో.
అతీత్ కో ఛోడో – వర్తమాన్ కో పకడో.
పురుష జాతి కన్నా – స్త్రీ జాతి మిన్న,
పెద్దలు కన్నా – పిన్నలు మిన్న.
పట్టణవాసుల కన్నా – పల్లెవాసులు మిన్న
ఆడంబరుల కన్నా – నిరాడంబరులు మిన్న
పండితమూర్ఖుల కన్నా- అమాయకులు మిన్న
ధ్యానులు కాని వారి కన్నా – ధ్యానులయిన వారు అతి మిన్న.
మనిషి అంటే అయిదు, మనిషికి కావలసినవి అయిదు.
ఒకటి: శరీరం శరీరానికి కావాలి ఆరోగ్యం.
రెండు: మనస్సు మనస్సుకు కావాలి శాంతం.
మూడు: బుద్ధి బుద్ధికి కావాలి జ్ఞానం.
నాలుగు: ఆత్మ ఆత్మకు కావాలి ధ్యానం
ఐదు: సర్వభూతాత్మ సర్వ భూతాత్మతో కావాలి స్నేహం.
శ్వాసవత్ ఆత్మానుభవం ద్వారానే శరీరానికి ఆరోగ్యం.
శ్వాసవత్ ఆత్మానుసంధానం ద్వారానే మనస్సుకు శాంతం.
శ్వాసవత్ ఆత్మానుసంధానం ద్వారానే బుద్ధికి జ్ఞానం.
శ్వాసవత్ ఆత్మానుసంధానం ద్వారానే సర్వభూతాత్మతో స్నేహం.
ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస.
జ్ఞానం అంటే మాట మీద శ్వాస
జీవితం అంటే మిత్రత్వం మీద ధ్యాస.