కలసి ఉంటే కలదు సుఖం

 

యోగం” అంటే “కలయిక

యుంజతే ఇతి యోగః” అన్నది శాస్త్రం

యుంజతి” అంటే “కలవడం” ఏవేని రెండు కలపడం

కలసి ఉంటే కలదు సుఖం .. కలవకపోతే లేదు సుఖం

రకరకాల యోగాలు ఉన్నాయి

రకరకాల అంగవిన్యాసాలతో, ముద్రలతో, భావనా ప్రదర్శనలతో కూడి ఉన్నది .. “నృత్యయోగం

సు-నాదంతో, సు-స్వరాలతో, సు-లయలతో ఏకమై తాదాత్మ్యస్థితినందేది .. “నాదయోగం

చేస్తున్న ప్రతి కర్మలో అన్యభావన లేకుండా ఏకాగ్రతలో ఉండడం .. “కర్మనిష్ణాతయోగం

ప్రతిఫలాపేక్ష లేకుండా సకల కర్మలనూ లోకకల్యాణార్థం చేయడం “కర్మఫలత్యాగయోగం

నోటిలోంచి వచ్చే వాక్కు పట్ల శాస్త్రీయమైన జాగరూకతతో, సర్వకుశలోపరిగా ఉండడం .. “సువాణియోగం

స్వాధ్యాయం పట్ల .. సజ్జనసాంగత్యం .. పట్ల విశేషంగా అంకితమై దేహభావన వీడి

ఆత్మభావనతో ఉండడం .. “జ్ఞానయోగం

పరమపురుషుల పట్ల, పరమయోగుల పట్ల దాసోహభావన కలిగి ఉండడం .. “భక్తియోగం

భౌతిక కాయంతో మనస్సు మమేకం అయి

రకరకాల ఆసనరీతులతో .. రకరకాల ప్రాణాయామాలతో .. కూడి ఉన్నదే “హఠయోగం

శ్వాసప్రక్రియ మీద ఏకధారగా ధ్యాస ఉంచుతూ చిత్తవృత్తులను నిరోధం గావించుకుంటూ

నాడీమండలశుద్ధి చేసుకుంటూ దివ్యచక్షువువైపు పయనం చేయడం .. “క్రియాయోగం/ధ్యానయోగం

స్వ-పర బేధం లేకుండా “మమాత్మా సర్వభూతాత్మ“గా జీవించడం .. “అద్వైతయోగం

సకల కారణ-కార్య సంబంధాలను .. పరస్పర స్పందన .. ప్రతిస్పందనాదులను

అధ్యయనం చేస్తూ ప్రకృతి యొక్క .. సహజ పరిణామ సూత్రాలను

సశాస్త్రీయంగా అవగాహన చేసుకోవడం .. “విజ్ఞానయోగం

స్వంత కష్టాలనూ, స్వంత బాధలనూ ప్రక్కన పెట్టి

ఇతరప్రాణికోటి యొక్క యోగక్షేమాల పట్ల ధ్యాస ఉంచడం .. “సేవాయోగం

“తస్మాత్ యోగీ భవ”

యోగులందరికీ ప్రణామాలు

యోగీశ్వరులందరికీ సాష్టాంగ ప్రణామాలు

“కలసి ఉంటే కలదు సుఖం”