భగవద్గీత 3-6
“ కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ | ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారఃస ఉచ్యతే || ” |
పదచ్ఛేదం
కర్మేంద్రియాణి – సంయమ్య – యః – ఆస్తే – మనసా – స్మరన్ – ఇంద్రియార్థాన్ – విమూఢాత్మా – మిథ్యాచారః – సః – ఉచ్యతే
ప్రతిపదార్ధం
యః = ఎవరు ; విమూఢాత్మా = మూఢబుద్ధి కలవాడు ; కర్మేంద్రియాణి = అన్ని కర్మేంద్రియాలను ; సంయమ్య = నిరోధించి ; మనసా = మానసికంగా ; ఇంద్రియార్థాన్ = ఇంద్రియ విషయాలను ; స్మరన్ = స్మరిస్తూ ; ఆస్తే = ఉంటాడో ; సః = అలాంటివాడు ; మిథ్యాచారః = ‘మిథ్యాచారి’ అంటే ‘దంభి’, ‘ఢంబాచారి’ ; ఉచ్యతే = పిలువబడుతున్నాడు.
తాత్పర్యం
“ మూఢబుద్ధి గల ఏ వ్యక్తి ఇంద్రియాలన్నింటినీ బలవంతంగా నిరోధించి మనస్సులో సదా వాటినే స్మరిస్తూ వుంటాడో అతడే ‘ మిథ్యాచారి ’ అంటే ‘ఢంబాచారి ’ అనబడతాడు. ”
వివరణ
బాహ్య ఇంద్రియ నిగ్రహాన్ని “ దమం ” అంటాం.
ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించడమే “ దమం. ”
అంతరేంద్రియం అయిన మనస్సు యొక్క నియంత్రణను “ శమం ” అంటాం.
కేవలం “ దమం ” వుండి “ శమం ” లేకపోతే …
అది నిరర్థకం … అది అనర్థదాయకం.
అప్పుడు కోరికలు మనస్సులో అంతర్ముఖంగా విజృంభిస్తూనే వుంటాయి;
మనస్సు అల్లకల్లోలం అవుతూనే వుంటుంది.
అలాంటి మానవుడు మూఢబుద్ధికి నిలయం అవుతాడు.
కనుక, ఇంద్రియాలను బలవంతంగా బిగబట్టి కూర్చుని,
మనస్సులో వ్యవహారాలన్నింటినీ ఆలోచిస్తూ …
మనస్సులోనే మూడు లోకాలనూ చుట్టి వచ్చే
‘ మిథ్యాచారి ’, ‘ ఢంబాచారి ’, కాకూడదు.
మనస్సును ఎలాంటి పరిస్థితులలోనూ, అల్లకల్లోల పరచుకోకూడదు.
“ బలవంతపు బ్రాహ్మణార్థం ” ఎప్పుడూ పనికిరాదు !
సదా, ఎల్లప్పుడూ “ పట్టు–విడుపు ”
అన్నవి వుండి తీరాలి !
జీవితంలో సహజంగా బ్రతకాలి !
పరిపూర్ణయోగిగా విరాజిల్లాలంటే “
దమం ”తో ప్రారంభమయి,
వెంటనే “ శమం ”లోకి ఎగబ్రాకాలి !
కేవలం “ దమం ”లోనే ఉంటే అది ఆరంభ
శూరత్వం మాత్రమే !
అది యుక్తం కాదు !