కరుణయే .. ఉత్తమ ధర్మం
క్రతువుల పేరిట, పండుగల పెరిట గొర్రెలనూ, ఆవులనూ, మేకలనూ కోళ్ళనూ చంపి తినడం మహా ఆటవికం .. మహా అనాగరికం. తోటి ప్రాణుల పట్ల జాలి, కరుణ చూపించాల్సిన మానవుడు అలా వాటిని చంపి తింటూంటే .. పైన ఉన్న బుద్ధుడు, ఏసుప్రభువు, అల్లా, మహావీరుడు .. అంతా చూసి ఏడుస్తున్నారు. అటువంటి క్రతువులను ప్రోత్సహించే మతాలు “మతాలు” కావు; మరి ఇటువంటి మతాలు ఎన్నటికీ, ఎవ్వరికీ సమ్మతాలు కావు.
ఉన్నది ఒక్కటే మతం .. మరి అదే “శాకాహార మతం”! శాకాహార మతాన్ని ప్రచారం చెయ్యడం కోసమే .. ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరినీ శాకాహారులుగా మార్చడం కోసమే మరి ఈ భూమ్మీద ప్రతి ఒక్క జంతువు నిర్భయంగా జీవించేలా చేయడంకోసమే .. “పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్” ఆవిర్భవించింది.
“నీ వలెనే నీ పొరుగువాడిని ప్రేమించు” అన్న ఏసు ప్రభువు సందేశంలోని అంతరార్థం ఇదే. ఏసుప్రభువు సందేశంలో రెండు దశలు ఉన్నాయి: “నిన్ను నువ్వు ప్రేమిచుకున్నట్లే” అన్నది మొదటి దశ అయితే .. “నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే .. నీ పొరుగువాడిని కూడా ప్రేమించడం” అన్నది రెండవ దశ.
“నిన్ను నువ్వు ప్రేమించుకోవడం” అంటే మీ శరీరాన్ని, మీ కాళ్ళనూ, మీ చేతులనూ మీరు ప్రేమించుకోవడం కాదు! జన్మ జన్మలుగా మిమ్మల్ని వెన్నంటే వస్తూన్న మీ ఆత్మను గుర్తించి .. ధ్యానం ద్వారా మీ సమస్త శక్తియుక్తులతో దానిని ఆలింగనం చేసుకోవడం! ఆత్మ యొక్క హంగులనూ, పొంగులనూ, మరి రంగులనూ చూసి ఆనందిస్తూ, ఆ ఆనందంతో పరవశించిపోవడం.
ఇలా మనల్ని మనం ఆత్మవత్ ప్రేమించుకున్నప్పుడే, మనకు మన పొరుగువారిని కూడా ప్రేమించే అర్హత వస్తుంది! “నీ పొరుగువాడు” అంటే .. మీ ప్రక్కన ఉన్న మనిషే కాదు. ఏసుక్రీస్తుకు గొర్రెపిల్ల, శివుడికి నంది, అయ్యప్పస్వామికి నెమలి, సరస్వతికి హంస, వినాయకుడికి ఎలుక, దుర్గాదేవికి పులి, దత్తాత్రేయుడికి శునుకాలు “పొరుగు వారు” అయినట్లే మనకు కూడా “మన సాటి జంతుజాలం అంతా కూడా పొరుగువాళ్ళే”!
“ఇలాంటి పొరుగువాళ్ళను” ప్రేమించడమే మతం .. సమ్మతం .. ఆనందం .. ఆరోగ్యం .. మరి విజ్ఞానం. ఇది అర్థం చేసుకోకుండా మన ప్రక్కన ఉన్న సాటిమనిషిని మాత్రమే ప్రేమించడానికి ప్రయత్నిస్తూ .. జంతువులను మాత్రం చంపి కోసుకు తినడం ఎన్నటికీ సరికాదు.
ఒకానొక బుద్ధుడూ, ఒకానొక ఓషో మరి వాళ్ళ ప్రక్కవాడికీ .. మరి వాళ్ళ ప్రక్కింటి వాడికీ ఎంతమాత్రం అర్థం కారు. ఒక “ఏసు ప్రభువు” యొక్క సందేశాన్ని అర్ధం చేసుకోవాలంటే “ఇంకొక ఏసుప్రభువే” దిగిరావాలి. ఒక “కాస్పరోవ్”ను అర్థం చేసుకోవాలంటే ..ఇంకో “కాస్పరోవ్” మాత్రమే దిగిరావాలి. ఒక పండిట్ రవిశంకర్ పలికించే సితార్ రాగాలను .. “ఇంకో పండిట్ రవిశంకర్” మాత్రమే అర్థం చేసుకోగలడు. ఆ రాగాలను గురించి తెలియని వాళ్ళ వల్ల అది సాధ్యంకాదు.
ఏసుక్రీస్తు “రెండు కళ్ళూ ఒక్కటై .. దివ్యచక్షువు తెరుచుకోబడి .. చిన్న పిల్లవాడిగా మారినప్పుడే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించగలం; అందుకు నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను” అన్నాడు. “ఉపవాసం” అంటే అసలు అర్ధం “ఏ ఆలోచనలూ లేకుండా ఉండడం”.
సాధారణంగా చిన్నపిల్లలకు మనస్సనేది ఉండదు కనుక ఆలోచనారహితస్థితిలో వారి దివ్యచక్షువు ఎక్కువుగా తెరుచుకునే వుంటుంది; వాళ్ళు సదా దేవుని రాజ్యంలో విహరిస్తూనే ఉంటారు. అయితే పెరిగి పెద్దవుతున్నకొద్దీ ఇంట్లో ఉన్న మూర్ఖపు ‘పెద్దవాళ్ళు’ .. ‘పండుగుల’ పేరిట .. వాళ్ళకు మాంసాహారాన్ని తినిపిస్తూ వాళ్ళ శరీరాలను అపవిత్రం చేసేస్తూంటారు. వారిని పాప పంకిలంలోకి తోసివేస్తూ వాళ్ళ దివ్యచక్షువును సర్వనాశనం చేస్తూంటారు.
“ఉపవాసం” అంటే శారీరక ఉపవాసం కాదు, “మానసిక ఉపవాసం” అని తెలుసుకోవాలి; అంటే ధ్యానం అన్నమాట. “ప్రతి జంతువు కూడా మనలాగే రకరకాల అనుభవాల కోసం జన్మతీసుకుంటుంది” అన్న దివ్య సందేశాన్ని అర్థం చేసుకోవడమే “అసలైన ఆధ్యాత్మికత”! మరి అసలైన సిసలైన “ఆధ్యాత్మికత” యొక్క యథార్ధ అర్థాన్ని శాస్త్రీయమైన రీతిలో అర్థం చేసుకోవాలంటే మనం నిరంతర ధ్యానసాధనలో మునిగి తేలవలసిందే!!